దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2020-07-26T10:41:48+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు దశాబ్దాల పాటు అపరిష్కృతంగా ఉన్న జగదేవ్‌పూర్‌ మండలం ఇటిక్యాల రెవెన్యూ గ్రామ పరిధిలోని ..

దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఇటిక్యాల రెవెన్యూ గ్రామ ప్రజలకు కలెక్టర్‌ హామీ


జగదేవ్‌పూర్‌, జూలై 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు దశాబ్దాల పాటు అపరిష్కృతంగా ఉన్న జగదేవ్‌పూర్‌ మండలం ఇటిక్యాల రెవెన్యూ గ్రామ పరిధిలోని కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లె గ్రామాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి పేర్కొన్నారు. శనివారం కొత్తపేట గ్రామంలో కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లె గ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారంపై కలెక్టర్‌ సంబంధిత గ్రామ రైతులు, ప్రజలతో సుదీర్ఘంగా చర్చించారు. దీర్ఘకాలిక భూ సమస్యల పూర్వాపరాలను ఆ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ ఇటిక్యాల రెవెన్యూ గ్రామ పరిధిలోనీ కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లె గ్రామాల్లో 80 సంవత్సరాలకు పైగా భూ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. పన్నాలాల్‌ పట్టి పేరుతో 546 ఎకరాలు, ఇతర భూ సమస్యలు 350 ఎకరాల మొత్తం 896 ఎకరాలకు చెందిన భూములకు సంబంధించి వివాదాలు ఉన్నాయన్నారు.


2006లో అప్పటి ప్రభుత్వం వీటిని సీలింగ్‌ భూములుగా పేర్కొనడంతో అప్పటి నుంచి నేటివరకూ 14 సంవత్సరాలుగా అధికారిక క్రయ విక్రయాలకు నోచుకోలేదన్నారు. భూ సమస్యల విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి రాగానే వెంటనే స్పందించి దశాబ్దాల సమస్యకు సాధ్యమైనంత త్వరలో శాశ్వత పరిష్కారం చూపాలని తమను ఆదేశించారని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుత సమావేశం తర్వాత ఈ మూడు గ్రామాల్లోని రైతులకు రైతుబంధు సాయం అందించడానికి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామన్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో భూ సమస్యల శాశ్వత పరిష్కారం ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి సర్వే నంబర్‌ వారీగా, అత్యంత పారదర్శకంగా భూ సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.  శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్‌ పంపిస్తామన్నారు. అనంతరం వచ్చే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతులకు భూ యాజమాన్య హక్కు పత్రాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, ‘గడ’ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, జడ్పీటీసీ, ఎంపీపీ, తహసీల్దార్‌, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 


తీరనున్న యాభై ఏళ్ల కల

గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌, జూలై 25: కొత్తపేట, లింగారెడ్డిపల్లి గ్రామాల పరిధిలోని 650 ఎకరాల భూమిలో జాగీర్దార్లు ఇనాం పట్టాదారులుగా 1924లో నమోదై ఉన్నారు. అనంతరం ఈ భూమిని దాదాపుగా 150 మంది రైతులకు పట్టా చేశారు. 50 ఏళ్ల పాటు పట్టాదారులుగా కొనసాగిన రైతులకు ప్రభుత్వం నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన, సవరణలో పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదు. ఇనాం పట్టాదారులుగా ఉన్న జాగీర్దార్లు సీలింగ్‌ యాక్ట్‌లో భాగంగా ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. తరువాత ఈ భూమిపై ప్రభుత్వం సీలింగ్‌ పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించడంతో రైతులు తీసుకునేందుకు నిరాకరించారు. 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇనాం భూములపై ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి రైతులకు అక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్లను అందజేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్‌ దృష్టికి కొత్తపేట గ్రామస్థులు తమ భూమి విషయాన్ని తీసుకెళ్లారు.


కేసీఆర్‌ సీఎం అయినా తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో 2018లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు ముందు తమకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తేనే ఓట్లేస్తాం అంటూ ఆ రెండు గ్రామాల ప్రజలు పంచాయతీల ఎదుట తీర్మానం చేశారు. ఎన్నో సార్లు రైతుల సమస్యను ‘ఆంధ్రజ్యోతి’ సైతం కథనాల రూపంలో వెలువరించి తమ వంతు ప్రయత్నాలను చేసింది. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ సీఎం కేసీఆర్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి సర్పంచులకు ఫోన్‌ చేయడంతో పాటు సమస్యపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు శనివారం గ్రామంలో రైతుల నుంచి వివరాలను సేకరించారు. సీలింగ్‌ను ఎత్తివేసి 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆక్యుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్లను రెగ్యులరైజ్‌ చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపి స్వయంగా పట్టాదారు పాసుపుస్తకాలను అందజేయనున్నారు  దీంతో కొత్తపేట, లింగారెడ్డిపల్లి గ్రామాల 50 ఏళ్ల కల సాకారం కానుంది.

Updated Date - 2020-07-26T10:41:48+05:30 IST