కల్తీలపై నిరంతరం తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-11T05:14:37+05:30 IST

కల్తీ నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు విక్రయించేవారిపై కఠిన శిక్షలు అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు.

కల్తీలపై నిరంతరం తనిఖీలు
కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశాలు

గుంటూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): కల్తీ నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు విక్రయించేవారిపై కఠిన శిక్షలు అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి టాస్కుఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత మూడు రోజుల నుంచి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 124 వ్యాపార సంస్థలను తనిఖీ చేయడం జరిగిందని, వాటిల్లో 16 సీజ్‌ చేశామని, 87 చోట్ల శాంపిల్స్‌ సేకరించినట్లు పేర్కొన్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయించే వారిపై నమోదు చేయాల్సిన కేసులపై అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, కొన్ని శాఖల అధికారులు అసలు మీటింగ్‌కు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ చేసిన ప్రతీ వ్యాపార సంస్థలో ఉత్పత్తుల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించాలని సూచించారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో మటన్‌ పేరుతో ఇతర జంతువుల మాంసం కలుపుతున్నారని, దీని దృష్ట్యా మాంసాహార పదార్థాల శాంపిల్స్‌ తప్పనిసరిగా సేకరించాలని స్పష్టం చేశారు. ఆహార పదార్థాలకు సంబంధించి ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్‌ అఽథారిటీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. టాస్కుఫోర్సు బృందాలు మరింత విస్త్రృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆహార పదార్థాలు కల్తీకి పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల వరకు జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమాన విధిస్తారని వ్యాపారస్థులకు తెలియజేయాలన్నారు. కల్తీలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నెంబరు. 1902పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  సమావేశంలో జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ గౌస్‌మొహిద్దీన్‌, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్‌ చిన్నయ్య, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, గురజాల ఆర్డీవో పార్థసారధి పాల్గొన్నారు.  


    

Updated Date - 2021-04-11T05:14:37+05:30 IST