పకడ్బందీగా మునిసిపల్‌ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-03-01T05:50:30+05:30 IST

గుంటూరు నగరపాలకసంస్థతో పాటు తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్లలో మునిసిపల్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ ఎస్‌ఈసీకి నివేదించారు.

పకడ్బందీగా మునిసిపల్‌ ఎన్నికలు
ఎస్‌ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరైన జిల్లా అధికారులు

ఎస్‌ఈసీకి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ నివేదన

గుంటూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):  గుంటూరు నగరపాలకసంస్థతో పాటు తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్లలో మునిసిపల్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ ఎస్‌ఈసీకి నివేదించారు. ఆదివారం విజయవాడలో జరిగిన ప్రాంతీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ మొత్తం 290 వార్డుల్లో 1,078 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి 1,186 మంది ప్రిసైడింగ్‌, 1,186 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, 3,557 మంది పోలింగ్‌ అధికారులను కలిపి మొత్తం 5,929 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికల్లో మొత్తం 10,74,727 మంది ఓటర్లు ఓటుహక్కుని వినియోగించుకోనున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా 4,225 ఫ్లెక్సీలు, 218 పోస్టర్లు, 119 గోడరాతలను తొలగించామన్నారు. 514 రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడగడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్‌ అమలు చేయడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లను నియమించి పర్యవేక్షిస్తోన్నామన్నారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ జిల్లాలో 241 లైసెన్సు కలిగిన ఆయుధాల్లో 192 డిపాజిట్‌ చేసుకున్నామని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అల్లర్లకు పాల్పడే వారిని బైండోవర్‌ చేశామన్నారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అన్ని ముందస్తు చర్యలు  చేపడుతోన్నామన్నారు. జిల్లా నుంచి ఈ సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు. మెజార్టీ రెండు అంకెలలో ఉంటే రీ కౌంటింగ్‌కు అవకాశం ఇవ్వరాదన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా నిరంతరాయం జరగాలన్నారు. ఓటర్ల లిస్టులు సకాలంలో అందజేయాలని, ఓటర్‌ లిస్టులో ఒక పేరు పలుమార్లు ఉంటే వాటిని తొలగించాలన్నారు. ఓటర్ల జాబితా, స్లిప్పులను మూడు రోజులు ముందుగానే పంపిణీ చేయాలన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం చాలా సున్నితమైందని, ఇదులో 24 డివిజన్లు ఉన్నందున పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లని రక్షణగా ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అడవి ఆంజనేయులు, సీహెచ్‌ వాసు, తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, గురజాల ఆర్‌డీవో పార్థసారధి, అదనపు ఎస్‌పీ గంగాధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T05:50:30+05:30 IST