కదిలిన ప్రగతిచక్రం రోడ్కెక్కిన బస్సులు

ABN , First Publish Date - 2020-05-20T10:20:31+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండు నెలల పాటు ఆగిన ప్రగతి చక్రం కదిలింది.

కదిలిన ప్రగతిచక్రం రోడ్కెక్కిన బస్సులు

ఖమ్మం బస్టాండ్‌ను సందర్శించిన కలెక్టర్‌

అవసరం ఉంటేనే ప్రయాణం చేయాలని సూచన


ఖమ్మం ఎడ్యుకేషన్‌/కొత్తగూడెం, మే 19:  కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండు నెలల పాటు ఆగిన ప్రగతి చక్రం కదిలింది. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మంగళవారం రోడ్లపై పరుగులు తీశాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో మొత్తం 635 బస్సులు ఉండగా.. తొలిరోజు 246 బస్సులు నడిచాయి. వీటిలో 123 అద్దె బస్సులు కాగా 123 ఆర్టీసీ బస్సులున్నాయి. భద్రాచలం , కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోల నుంచి పల్లెవెలుగు, రాజధాని, సూపర్‌ లగ్జరీలను వివిధ ప్రాంతాలకు నడపగా.. హైదరాబాద్‌కు మాత్రం హయత్‌నగర్‌కు వరకు మాత్రమే నడిపారు.


సడలింపు ఇచ్చిన తొలిరోజు కావడం, ఎండ తీవ్రత కారణంగా ప్రయాణికుల తాకిడి ఉదయం నుంచి సాధారణంగా ఉండగా.. సాయంత్రం వేళకు పుంజుకుంది. సాయంత్రం ఏడు గంటల తర్వాత బస్సులను శానిటైజ్‌ చేసి డిపోలకు పంపారు. అలాగే బస్టాండ్లలో బస్సులు, ప్రయాణికులు వెయిటింగ్‌ సీట్లు, రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. అలాగే మాస్కులు ధరించిన ప్రయాణికులను మాత్రమే బస్సుల్లోకి అనుమతించారు. చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ఇక బస్టాండ్లలోని దుకాణాలను మూసే ఉంచారు. పలు చోట్ల టీస్టాల్‌ లాంటి వాటిని తెరిచి ఉంచారు. 


విధుల్లోకి డ్రైవర్లు, కండక్లర్లు..

మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజు నుంచి ఈనెల 18వరకు లాక్‌డౌన్‌ కారణంగా ప్రజారవాణా వ్యవస్థను నిలిపేయడంతో డ్రైవర్లు,  కండక్టర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో సగం జీతం మాత్రమే ఇవ్వడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి బస్సులు రోడ్డెక్కడంతో వారంతా విధులకు హాజరయ్యారు. ఉదయం ఐదు గంటలకే డిపోలకు చేరుకుని ఉత్సాహంగా రిపోర్టు చేశారు. తొలిరోజున అద్దె బస్సులకు 123 మంది ప్రైవేట్‌ డ్రైవర్లు, 123మంది కండక్టర్లు(ఆర్టీసీ), ఆర్టీసీ బస్సులకు 123 మంది డ్రైవర్లు, 103 మంది కండక్టర్లు విధుల్లోకి వచ్చారు. 


కొన్నిచోట్ల నిబంధనలు ఉల్లంఘన..

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్న నియమం ఉన్నా పలు చోట్ల అది కనిపించలేదు. సీటుకు ఒక్కరు మాత్రమే కూర్చోవాల్సి ఉండగా.. కొన్ని బస్సులో సీటుకు ఇద్దరు కూర్చోవడం కనిపించింది. ముఖ్యంగా కొత్తగూడెం బస్టాండ్‌లో బస్సులు ఎక్కిన ప్రయాణికులు కొందరు నిబంధనలను పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారు. 


అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ల ఆదేశాలు.. 

కరోనా నియంత్రణకు గాను అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యం ప్రజారవాణా వ్యవస్థలో సడలింపు ఇచ్చిన నేపథ్యంలో ప్రయాణికులు బస్సులు ఎక్కిన సమయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డి ఆదేశించారు. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌ను కలెక్టర్‌ కర్ణన్‌ సందర్శించి ప్రయాణికులు నిబంధనలు పాటించడంపై ఆరా తీశారు. బస్సులను శానిటైజ్‌ చేయడం, బస్టాండ్‌ ఆవరణలో, బస్సుల్లో శానిటైజర్ల ఏర్పాటు, ప్రయాణికులు మాస్కులు ధరించడం లాంటి అంశాల గురించి ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.


కలెక్టర్‌ వెంట ఆర్టీసీ ఆర్‌ఎం కృష్ణమూర్తి, డీవీఎం సుగుణాకర్‌, డీఎం శివశంకర్‌, సిబ్బంది ఉన్నారు. అలాగే ప్రజలు ప్రయాణాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని లేదంటే వారిని బస్సుల్లోకి అనుమతించొద్దని  అధికారులను ఆదేశించారు. బస్టాండ్‌లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. 


Updated Date - 2020-05-20T10:20:31+05:30 IST