Abn logo
Sep 25 2021 @ 02:31AM

కాలేజీ సీట్లు ఫర్‌ సేల్‌

డిగ్రీ, పీజీ కళాశాలల్లో 30శాతం మేనేజ్‌మెంట్‌ కోటా!

మరో వింత నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం?

ఆ సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు

యాజమాన్యాలు ఎవరికైనా అమ్ముకోవచ్చు

ఆ మేరకు ఇతర వర్గాల ‘ఉచిత’ సీట్లకు కోత

‘రీయింబర్స్‌’ భారం తగ్గించుకునేందుకేనా?

ఎయిడ్‌ నిలిపివేతతో ఇప్పటికే ఇక్కట్లు

మేనేజ్‌మెంట్‌ కోటాతో మరీ దారుణం


ఇప్పటికే ‘ఎయిడెడ్‌’ కాలేజీలకు సహాయం ఆపేశారు. ఆ కాలేజీల అధ్యాపకులను ప్రభుత్వ కళాశాలల్లో కలిపేశారు. సొంతంగా అధ్యాపకులను నియమించుకోలేక, కాలేజీలను నడపలేక అవన్నీ దాదాపుగా ‘మూసివేత’ దిశగా కదులుతున్నాయి. ఇప్పుడు.... రాష్ట్ర  సర్కారు సాధారణ డిగ్రీ, పీజీ కాలేజీలపైనా పడుతోంది. ఈ కళాశాలల్లోనూ ‘మేనేజ్‌మెంట్‌ కోటా’ అనే ఒక వింత నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది. దీని ఫలితంగా... ఆ కాలేజీల్లో పేదలు, సామాన్యులకు దక్కే సీట్లలో కోత పడుతుంది. అసలు విషయం ఏమిటంటే ఆ మేరకు ప్రభుత్వానికి ‘రీయింబర్స్‌మెంట్‌’ భారం తగ్గుతుంది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రొఫెషనల్‌ కళాశాలల్లో మాత్రమే మేనేజ్‌మెంట్‌ కోటా ఉంటుంది. అది కూడా.. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి కోర్సులకు మాత్రమే అమలు చేయాలి. ఆ సీట్లను కాలేజీల యాజమాన్యాలు విక్రయించుకోవచ్చు. కానీ... రాష్ట్ర ప్రభుత్వం సాధారణ డిగ్రీ, పీజీ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశపెట్టి... 30 శాతం సీట్లను కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డిగ్రీ, పీజీ కాలేజీల్లో చేరుతున్న వారిలో దాదాపు 99 శాతం మందికి ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ వర్తిస్తోంది. వారి ఫీజులను ప్రభుత్వమే భరిస్తోంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరే విద్యార్థులకు ఈ ఫీజులు, ఇతర పథకాలు వర్తించవు. అంటే... ఆ మేరకు సర్కారుపై భారం తగ్గినట్లే. నిజానికి... ప్రస్తుతం సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులకు ఆదరణ తగ్గింది.


కొన్ని సబ్జెక్టుల మీద ఇష్టంతో, సివిల్స్‌, ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ ఉద్యోగాలపై దృష్టి పెట్టిన వారు, ఇంజనీరింగ్‌ ఎందుకులే అనుకునే వారు మాత్రమే సాధారణ డిగ్రీల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వారే ఎక్కువ. వీరందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తోంది.ఆయా కాలేజీలు దాదాపుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఇప్పుడు... మేనేజ్‌మెంట్‌ కోటాలో సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి డిగ్రీ చదువుకునే విద్యార్థులు ఎందరు ఉంటారు? ఆ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో వచ్చే ఆదాయం పోయినట్లేనా? అప్పుడు కళాశాలలను నడపడం ఎలా? అని కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.


రాజకీయ ఒత్తిళ్లు!:


డిగ్రీ, పీజీ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్‌కోటా ప్రవేశపెట్టేలా కొందరు నేతలు ప్రభుత్వ స్థాయిలో పైరవీ చేస్తున్నట్లు సమాచారం. మెజారిటీ యాజమాన్యాలకు మేనేజ్‌మెంట్‌ కోటా ఇష్టం లేదు. కొన్ని యాజమాన్యాలు మాత్రమే ఆదాయం పెంచుకునేందుకు ఈ పద్ధతి పెట్టాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం నాటికి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే... రాష్ట్రంలో ఉన్న దాదాపు 1200 అన్‌ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలలన్నింటిలోనూ ఈ కోటా అమలవుతుంది. డిగ్రీ కళాశాలల ఫీజులను కూడా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏ-కేటగిరీ కళాశాలలైతే  రూ.30 వేలు, బీ- కేటగిరీకి రూ.20 వేలు, సీ-కేటగిరీకి రూ.10 వేలుగా నిర్ణయించింది. ఇవి బీఎస్సీ లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సులకు అమలు చేస్తున్నారు. మిగతా కోర్సులకు తక్కువ ఫీజులే ఉంటాయి. 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా అమలైతే... ఆ మేరకు పేదలందరికీ లభించే సీట్లలో కోత పడుతుంది.


మేనేజ్‌మెంట్‌ కోటాలో మూడింతల ఫీజు వసూలు చేయవచ్చనే నిబంధన పెట్టే అవకాశముందని చెబుతున్నారు. మంచి పేరున్న కాలేజీల్లో బీఎస్సీలాంటి కోర్సులో మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరాలంటే బాగా ఖర్చు చేయాలి. ఇది విద్యార్థులకు భారమవుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి డిగ్రీ కళాశాలలు పదేళ్లకు పైగా లీజు భవనాల్లో ఉంటే.. వాటికి కొత్త కోర్సులకు అనుమతులు ఇవ్వకూడదు.సొంత భవనాల్లోకి వెళ్తే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు పెరగడంతోపాటు విద్య నాణ్యత పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. 2004లోనే హైకోర్టు కూడా దీనిని సమర్థించింది. తర్వాత కొంతకాలం దీన్ని పొడిగించారు. ఆ పొడిగింపును ఇప్పుడు తొలగించారు. అయినా.. సొంత భవనాల్లో లేని డిగ్రీ, పీజీ కళాశాలలకు కూడా కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలంటూ ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలిసింది.