Abn logo
Sep 15 2021 @ 00:18AM

చేసే పనేదైనా గర్వంగా భావిస్తా

ఉదయం... అందరూ ఆహ్లాదంగా లేచే వేళల్లో... ఆమె పనికి బయలుదేరుతుంది. నాన్న బండి ఎక్కి... గడపగడపకూ తిరిగి చెత్త సేకరిస్తుంది. మధ్యాహ్నమైతే... కళాశాలలో విద్యార్థిని. సాయంత్రం... పాఠాలు చెప్పే పంతులమ్మ. విరామం దొరికితే... సమస్యలపై పోరాడే సామాజిక కార్యకర్త. బస్తీల్లో కొత్తగా అంగన్‌వాడీలు సాధించుకొని... వాటిల్లోని పిల్లలకు అల్పాహారం అందించిన ఘనత ఆమెది. హైదరాబాద్‌ ‘చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌’కు ప్రధానిగా చిన్నారుల్లో చైతన్యం రగిలిస్తున్న ఇంటర్‌ విద్యార్థిని అరిపిన జయలక్ష్మి జీవితం భిన్న కోణాల సమాహారం. 


జీవితమంటేనే నిత్య పోరాటం. నేను పెరిగిన బస్తీ... మా ఇంటి పరిస్థితి... కష్ట పడితే కానీ నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్లవని చిన్నప్పుడే అర్థమయ్యేలా చేశాయి. మేం ఉండేది హైదరాబాద్‌ సింగరేణి కాలనీలో. ఇరవయ్యేళ్ల కిందట బతుకుదెరువు కోసం రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. ఇళ్లల్లో చెత్త సేకరించడం మా అమ్మా నాన్నల వృత్తి. నాకో అన్నయ్య, చెల్లి. మేం కూడా వాళ్లకు పనిలో సహకరిస్తుంటాం. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు కదా! అందుకే మా కోసం కష్టపడుతున్న అమ్మా నాన్నలకు చేతనైన సాయం చేస్తుంటాం. ఉదయం ఐదు గంటలకు నా రోజు మొదలువుతుంది. లేవగానే నాన్న ఆటోలో కూర్చుంటాను. అప్పుడు బయలుదేరితే ఎనిమిది గంటలకు మళ్లీ తిరిగి వస్తాను. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించాలి. ఒకటీ రెండు కాదు... ఐదారొందల ఇళ్లు ఉంటాయి. అవన్నీ పూర్తయ్యే సరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది. కానీ నేను కాలేజీకి వెళ్లాలి కదా! దాంతో ఎనిమిదింటికల్లా నా పని ముగిస్తాను. సెలువు రోజులైతే సేకరణ అయ్యాకే ఇంటికి వెళ్లేది. 


నా సంపాదనతోనే... 

పేదరికంలో మగ్గుతున్న కుటుంబం మాది. ఇంటిల్లిపాదీ చమటోడ్చినా ఇల్లు గడవడమే కష్టం. ఈ పేదరికం నుంచి బయటపడాలన్నా... ఉన్నత స్థానంలో నిలబడాలన్నా... అది చదువుతోనే సాధ్యమని తెలుసుకున్నాను. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువు కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం సీఈసీ గ్రూప్‌తో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. ‘ఎంఎస్‌ఐ’ (మాంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇనిస్టిట్యూట్‌) స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్‌గా కూడా పని చేస్తున్నా. వాళ్లు నెలకు రూ.2 వేలు ఇస్తారు. అవన్నీ దాచుకుని కాలేజీ ఫీజులు కట్టాను. నా ఆర్థిక పరిస్థితిని చూసిన ‘ఎంఎస్‌ఐ’... సంస్థ వాలంటీర్‌గా పని చేసే అవకాశం ఇచ్చింది. 


‘చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌’...

సాయంత్రం కాలేజీ నుంచి రాగానే మా బస్తీల్లో చిన్నారులకు ట్యూషన్స్‌ చెబుతాను. రాత్రి ఏడున్నర వరకు తరగతులు ఉంటాయి. చదువుకోవాలన్న ఆకాంక్ష వారిలో ఎంతో ఉంది. కానీ ఆర్థిక స్తోమత లేక మంచి బడికి వెళ్లి చదువుకోలేకపోతున్నారు. అది చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అంతేకాదు... బస్తీల్లోని మహిళలకు కొవిడ్‌, రుతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గృహ హింస, చిన్నారులపై లైంగిక వేధింపుల వంటి వాటిపై అవగాహన కల్పిస్తుంటాను. ఇవన్నీ ‘చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌’ ద్వారా చేస్తున్నాను. దీన్ని ‘ఎంఎస్‌ఐ’ నిర్వహిస్తోంది. ‘చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌’ అంటే అంతా పిల్లలే ఉండే ఒక వేదిక. అందులో ప్రధాని, ఉపప్రధాని, సభాపతి తదితర హోదాలు ఉంటాయి. బస్తీల్లోని పిల్లలందరినీ ఒక దగ్గరకు చేర్చి, ఎన్నికల ద్వారా వీరిని ఎన్నుకొంటారు. అంటే పిల్లల సమస్యలను పిల్లలే పరిష్కరించుకొనే చక్కని వేదిక ఇది. హైదరాబాద్‌ సిటీ ‘చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌’కు నేను పీఎం (ప్రైమ్‌ మినిస్టర్‌)ని. ప్రతి సంవత్సరం ఒక సమస్యని తీసుకొని దాని పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటాం. 


ఎన్నో సాధించుకున్నాం... 

‘చిల్డ్రన్స్‌ పార్లమెంట్‌’ ద్వారా చాలా సమస్యలు పరిష్కరించుకోగలిగాం. వాటిల్లో ప్రధానమైనవి కొత్త అంగన్‌వాడీలు. మా సంస్థ ‘ఎంఎస్‌ఐ’ నగరంలోని యాభైకి పైగా బస్తీల్లో పని చేస్తోంది. మేమందరం వాటిల్లో తిరిగిన తరువాత తెలిసిందేమిటంటే... 21 మురికివాడల్లో అంగన్‌వాడీలు లేవని. పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యం. కానీ బస్తీల్లో తల్లితండ్రులు ఉదయాన్నే పనికి వెళ్లడంవల్ల ఆరేళ్ల లోపు చిన్నారులు అర్ధాకలితోనే గడుపుతున్నారు. అలాంటి పిల్లల కోసం అంగన్‌వాడీల్లో ఉదయంపూట అల్పాహారం కూడా ఇవ్వాలని ‘ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌’ (డబ్ల్యూడీసీడబ్ల్యూ) కమినర్‌ దివ్యా దేవరాజన్‌కు వినతి పత్రం సమర్పించాం. ఆమె సానుకూలంగా స్పందించారు. మేం కోరినట్టుగానే కొత్తగా 21 అంగన్‌వాడీలు, అల్పాహారం ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ దసరా నుంచి ఇది అమల్లోకి రానుంది. చిన్న వయసులోనే మాలోని సామాజిక చైతన్యాన్ని చూసి ఆమె అభినందించారు. ‘చిల్డ్రన్‌ పార్లమెంట్‌’కు ఒక అమ్మాయి నాయకత్వం వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా రెండేళ్ల కిందట మా బస్తీల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు విన్నవించాం. ఆయన వెంటనే తగిన ఆదేశాలిచ్చారు. వాళ్ల ప్రోత్సాహమే లేకుంటే...

నేను చెత్త సేకరిస్తానని తెలిసి చిన్న చూపు చూసినవారున్నారు. అలాగే ఇంత కష్టపడి చదువుకొంటోందని గర్వంగా చెప్పుకొనే దోస్తులూ ఉన్నారు. నా పని నాకు ఏ రోజూ కష్టమనిపించలేదు. తక్కువగానూ భావించలేదు. చదువుకోవాలన్న తపన... దాని కోసం పట్టు వదలని ప్రయత్నం... ఇదే నేను చేస్తున్నది. సాధారణంగా మా ఇళ్లల్లో పదో తరగతి వరకు చదవడమే కష్టం. చిన్న వయసులోనే పెళ్లి చేసేసి బరువు దించుకున్నామనుకొనేవారే ఎక్కువ. కానీ నా ఆసక్తిని గమనించి మా అమ్మా నాన్న, మామయ్యలు నన్ను ప్రోత్సహించారు. స్కూల్లో కూడా నేను ఆటలు ఆడేదాన్ని. వ్యాసరచన పోటీల్లో పాల్గొనేదాన్ని. కబడ్డీ జిల్లా స్థాయిలో ఆడాను. కానీ కొన్ని కారణాలవల్ల తరువాత ఆటను కొనసాగించలేకపోయాను. 


ప్రజా సేవ చేయాలని... 

నా సంకల్పం ఐఏఎస్‌ కావాలని. అప్పుడైతే ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా నాలాంటి బస్తీ పిల్లలను మెరికల్లా తీర్చిదిద్దాలన్నది నా కోరిక. ఐఏఎస్‌ కల నెరవేరాలంటే ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక కావాలి. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. డిగ్రీ అయ్యే లోపు కొంత డబ్బు కూడబెట్టుకోవాలి. నాకు అన్ని విధాలా సహకరిస్తున్న ‘ఎంఎస్‌ఐ’ సంస్థ కూడా మద్దతునిస్తానని హామీ ఇచ్చింది. ఈ పనులన్నీ చేసుకొంటూ సివిల్‌ సర్వీసెస్‌పై శ్రద్ధ పెట్టడం అంత సులువు కాదని తెలుసు. కానీ మా బస్తీల్లో నాలాగా పని చేస్తూ చదువుకొనేవారు చాలామంది ఉన్నారు. వారే నాకు స్ఫూర్తి. 

- హనుమా