వలసజీవుల ఆకలికేకలు

ABN , First Publish Date - 2020-03-30T10:30:28+05:30 IST

బతుకుతెరువు కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. కరోనా నేపథ్యంలో జిల్లాలో చిక్కుకుపోయారు. కుటుంబాలతో

వలసజీవుల ఆకలికేకలు

చెరకుతోటల నరికివేతకు వచ్చిన ఇతర జిల్లాల కూలీలు

కరోనా ప్రభావంతో నిలిచిన పనులు

పొలిమేరల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం


(నరసన్నపేట) 

బతుకుతెరువు కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. కరోనా నేపథ్యంలో జిల్లాలో చిక్కుకుపోయారు. కుటుంబాలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలో నవంబరు నుంచి మార్చి వరకు చెరకు తోటల నరికివేత పనులు జరుగుతుంటాయి. ఈ పనుల కోసం జిల్లాకు ప్రకాశం, గుంటురు ప్రాంతాలకు చెందిన కొందరు కుటుంబాలతో వస్తుంటారు. ఈ ఏడాది  ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దడోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం, గుంటూరు జిల్లా నర్సారావుపేట, రొంపిచెర్ల  తదితర మండలాల నుంచి కూలీలు పిల్లలతో సహా గత నవంబరులో జిల్లాకు చేరుకున్నారు.


గ్రామ పొలిమేరలు, తోటల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని చెరకు పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. నరసన్నపేట మండలంలో మాకివలస, కిళ్లాం, నడగాం, పారశెల్లి, రెల్లి వలస, చోడవరం, పోలాకి మండలం మబుగాం, జొన్నం తదితర గ్రామాల్లో  పలువురు కూలీలు గుడారాలు వేసుకుంటూ చెరకు కటింగ్‌ పనులు చేపడుతున్నారు. చెరకు కటింగ్‌కు కోసం టన్నుకు రూ.200 నుంచి రూ.300 వరకు రైతులు చెల్లిస్తారు. అయితే, ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెరకు తోటల కటింగ్‌ పనులను నిలిపి వేశారు. దీంతో వీరంతా ఉపాధి కోల్పోయారు.


రాకపోకలు సైతం నిలిచిపోవడంతో.. గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పుల్లల చెరువులు, ముటుకుల, సతకోడు, అక్కపాలెం గ్రామాలకు చెందినవారితోపాటు గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండల సంతగురిపాడులకు చెందిన సుమారు 60 కుటుంబాలు మాకివలస గ్రామ శివారున  ఉంటున్నాయి. వీరిని ప్రభుత్వం గుర్తించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


అయితే, అధికారులు అరకొరగా సరుకులు అందిస్తుండటంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 మందికి  3 కేజీల బియ్యం, గోధుమరవ్వ ప్యాకెట్‌, పిండి, కేజీ ఉల్లి  చొప్పున పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని వాపోతున్నారు.  కుటుంబాలతో జీవించడం కష్టంగా ఉందని అఽధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. చాలచాలనీ రేషన్‌ సరుకులతో ఎలా జీవించేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు అకాలవర్షాలతో ఇబ్బంది పడుతున్నామన్నారు. తమ స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి..ఎల్‌. హూసన్నా, చెరకు కటింగ్‌ కూలీ, సంతగురిపాడు, గుంటూరు జిల్లా 

 ఏటా చెరకు కట్టింగ్‌ కోసం కుటుంబాలతో సహ ఈ జిల్లాకు వస్తుంటాం.  కరోనా ప్రభావంతో  ఈ పనులు నిలిపివేశాం. తమలాగే వచ్చిన కూలీలు నరసన్నపేట, పోలాకి, గార, రేగిడి ఆమదాలవలస మండలాల్లో ఉన్నాం. అధికారులు చొరవ తీసుకుని ప్రత్యేక పునరాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. లేదంటే స్వగ్రామాలకు పంపించాలి.

Updated Date - 2020-03-30T10:30:28+05:30 IST