పెను విషాదం నుంచి కరోనాపై విజయం వైపు...!

ABN , First Publish Date - 2021-06-03T19:25:47+05:30 IST

కరోనా మిగిల్చిన గుండె కోతను కొందరు తలుచుకొని బాధపడుతుంటారు.

పెను విషాదం నుంచి కరోనాపై విజయం వైపు...!

  • కొంబ్యాట్‌ కొవిడ్‌ పేరుతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు
  • ఏడాదిగా కొన్నివేల మందికి ఆర్థిక, హార్థిక సాయం
  • 24 గంటల హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

కరోనా మిగిల్చిన గుండె కోతను కొందరు తలుచుకొని బాధపడుతుంటారు. మరికొందరు విధిరాత అని వదిలేస్తారు. ఒక యువకుడు మాత్రం తన కుటుంబంలో ముగ్గురిని దూరం చేసిన కొవిడ్‌పై పోరాటానికి సిద్ధమయ్యాడు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వైద్యులతో ప్రత్యేక హెల్ప్‌లైన్‌నూ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి తేడాలేకుండా ‘అన్నా.. ఆపదలో ఉన్నాం. ఆక్సిజన్‌ కావాలి. ఆస్పత్రిలో బెడ్‌ కావాలి’ అంటూ ఫోన్లో సాయం అడగడం తరువాయి, కొవిడ్‌ బాధితుల పట్ల ఆపద్బాంధవుడిగా మారుతున్నాడు. వాళ్ల ప్రాణాలను నిలబెడుతున్నాడు. అతనే శ్రీకర్‌ ఆదిత్య. కొంబ్యాట్‌ కొవిడ్‌-19 గ్రూపు పేరుతో ఏడాదిగా వాళ్లు కరోనా బాధితులకు నిర్విరామ సేవలందిస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ : ఢిల్లీకి చెందిన పదిహేడేళ్ల పాప ఒకరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో హైదరాబాద్‌కి చెందిన కొంబ్యాట్‌ కొవిడ్‌-19 గ్రూపు సభ్యులకు ఫోన్‌ చేసి, కరోనాతో బాధపడుతున్న తన తల్లికి ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గాయని, ఆస్పత్రిలో బెడ్‌ దొరకలేదని వాపోయింది. అంతే, ఆ వేళప్పుడు వారంతా అలెర్ట్‌ అయ్యారు. రోగిలో ఆత్మస్థైర్యం నింపడంతోపాటు ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరిగేందుకు వీడియోకాల్‌ ద్వారా కొంబ్యాట్‌ కొవిడ్‌ -19 హెల్ప్‌లైన్‌ డాక్టర్లు సూచనలిచ్చారు. అంతలోపే ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో బెడ్‌ ఇప్పించగలిగారు. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుంది. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా కమ్యూనికేట్‌ చేయడమేకాదు, సాయంకూడా చేయచ్చని నిరూపించారు. అలాగే మరొక ఘటనలో బ్లాక్‌ఫంగ్‌సతో బాధపడుతున్న ఒక హైదరాబాదీకి అత్యవసరంగా ఇంజెక్షన్‌ అవసరమైంది. అందుకోసం కొంబ్యాట్‌ టీమ్‌ను కలిశారు బాధితులు. వారూ ఎంత ప్రయత్నించినా దొరకలేదు. చివరికి, ట్విట్టర్‌ వేదికగా ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఫలానా ఇంజెక్షన్‌ అర్జెంటుందని శ్రీకర్‌ ఆదిత్య పోస్టు చేశారు. స్పందించిన సదరు మంత్రి పలుకుబడితో ఇంజెక్షన్‌ను తెప్పించి ఇచ్చా రు. సమస్య పరిష్కారమైంది. 


గతేడాది జూలై నుంచి

కొంబ్యాట్‌ కొవిడ్‌-19 వాట్సాప్‌ గ్రూపు గతేడాది జూలైలో మొదలైంది. అప్పటి నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆస్పత్రుల్లో బెడ్లు, రకరకాల మందులు, ఐసోలేషన్‌లోని వాళ్లకు నిత్యావసరాలు, భోజనం... ఇలా ఒకటేమిటి ఫలానా సాయం కావాలని అడిగిందే తడవుగా కాదనకుండా తమవంతుగా తోడ్పడుతున్నారు కొంబ్యాట్‌ టీమ్‌ సభ్యులు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న వాళ్లకు 24 గంటలూ అందుబాటులో ఉండే ఒక ఉచిత హెల్ప్‌లైన్‌ను కూడా ప్రారంభించారు. డాక్టర్‌ తేజస్వి, డాక్టర్‌ సాకేత రెడ్డితో పాటు మరో ముగ్గురు డాక్టర్లు హెల్ప్‌లైన్‌ ద్వారా సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు మూడు వేలమంది కొవిడ్‌ రోగులకు ఆన్‌లైన్‌ ట్రీట్మెంట్‌ ఇచ్చారు. వారానికి ఒకరోజు కొవిడ్‌ బాధితులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల బయట పడిగాపులు కాస్తున్న రోగుల బంధువులకు ఆహార పొట్లాలను అందిస్తున్నారు



నిత్యావసరాల పంపిణీ

స్వీయ నిర్బంధంలో ఉన్న వారెవరైనా నిత్యావసరాలు, మందుల కోసం కొంబ్యాట్‌ బృందానికి ఫోన్‌ చేస్తే తక్కువ సమయంలోనే వాటిని సమకూరుస్తున్నారు. కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించే విషయంలోనూ తమవంతు సాయం చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన బాధిత కుటుంబాలకు డ్రై రేషన్‌ కిట్లనూ పంచుతున్నారు. రెండు రోజుల కిందట పోచంపల్లిలోని అరవై చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. వరంగల్‌ జిల్లాలోని మూడు వందల నిరుపేద కుటుంబాలకు మాస్కులు, శానిటైజర్లు, ఆరోగ్య కిట్లను పంచారు.


మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రావద్దని...

మా నాన్న బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు అచ్యుతరావు చాలా మందికి తెలుసు. ఆయనతో పాటు మేనత్త కొడుకు, పెద్దమ్మ ఆరు నెలల వ్యవధిలో కరోనాతో చనిపోయారు. ఆ బాధ మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. మా కష్టం మరెవ్వరి ఇంట్లో కలగకూడదు అనే ఉద్దేశంతో సిద్దార్థ అన్నయ్యతో కలిసి కొంబ్యాట్‌ కొవిడ్‌ గ్రూపు ద్వారా సేవలను ప్రారంభించాం. అమ్మ అనూరాధ సపోర్టుతో భోజనం అందించగలుగుతున్నాం. నాన్న స్మారకంగానూ కొంతమందికి నిత్యావసరాలు పంచాం. తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాల నుంచి కూడా మాకు ఫోన్లు వస్తుంటాయి. వాళ్లకూ మేము చేయగలిగినంత వరకూ తోడ్పడగలిగాం. కేవలం మా కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన విరాళాలతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. - శ్రీకర్‌ ఆదిత్య, కొంబ్యాట్‌ కొవిడ్‌-19 వాట్సాప్‌ గ్రూపు నిర్వాహకుడు. 


కొంబ్యాట్‌ కొవిడ్‌-19 గ్రూపు అందిస్తున్న కొవిడ్‌ సేవల కోసం 9985364242 నెంబర్‌లో సంప్రదించవచ్చు. 

Updated Date - 2021-06-03T19:25:47+05:30 IST