ఒకేసారి కిడ్నీ, లివర్ మార్పిడి.. సంచలనం సృష్టించిన చెన్నై ఆస్పత్రి..

ABN , First Publish Date - 2020-10-22T23:51:30+05:30 IST

భారత దేశంలోనే తొలిసారిగా చెన్నైకి చెందిన ఓ ప్రయివేట్ ఆస్పత్రి ఒకేసారి మూత్రపిండాలు, కాలేయ మార్పిడి చేసి సంచలనం సృష్టించింది...

ఒకేసారి కిడ్నీ, లివర్ మార్పిడి.. సంచలనం సృష్టించిన చెన్నై ఆస్పత్రి..

చెన్నై: భారత దేశంలోనే తొలిసారిగా చెన్నైకి చెందిన ఓ ప్రయివేట్ ఆస్పత్రి ఒకేసారి మూత్రపిండాలు, కాలేయ మార్పిడి చేసి సంచలనం సృష్టించింది. అందునా జీవించి ఉన్న దాతల నుంచి కాలేయం, మూత్రపిండాలు సేకరించి చికిత్స విజయవంతం చేసి ఔరా అనిపించింది. ఆసియాలోనే సుప్రసిద్ధమైన గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ (జీజీహెచ్‌సీ)లో ఈ శస్త్ర చికిత్స జరిగింది.  మిట్టల్ అనే 35 ఏళ్ల వ్యక్తికి మూత్రపిండాలు విఫలం కావడంతో పాటుగా తీవ్రమైన కాలేయ సమస్యలు (ఫ్యాటీ లీవర్‌) ఉన్నాయి. తక్షణమే ఆయనకు మూత్రపిండాలు, కాలేయం మార్పిడి చేయాల్సి వచ్చింది. అయితే ఆయనకు లో బీపీ, కార్డియాక్‌ షాక్‌ వంటి సమస్యలతో పాటు వివిధ అవయవాలు కూడా దెబ్బతినడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ కుదరదని  ఢిల్లీలోని ఓ ఆస్పత్రి  చేతులెత్తేసింది. ఆయన కుటుంబ సభ్యులు తమ ఆశను చంపుకోలేక సెకండ్ ఒపీనియన్ కోసం చెన్నై జీజీహెచ్‌సీకి వాయుమార్గంలోొ తరలించారు. రోగికి చెరో మూత్రపిండం, కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇక్కడి వైద్యుల తెగువ, నైపుణ్యంతో రోగి 130 కిలోల ఊబకాయంతో బాధపడుతున్నప్పటికీ అవయవ మార్పిడి  ప్రక్రియ సజావుగా సాగింది. 


వాస్తవానికి రోగి జీజీహెచ్‌సీకి చేరుకునే సమయానికి అపస్మారక స్థితిలో ఉండటం, లోబీపీతో పాటు డయాలసిస్‌ మీద ఉన్నారు. దీంతో జీజీహెచ్‌సీ వైద్యులు ప్రత్యేకమైన లీవర్‌ ఐసీయులో రెండు వారాలు ఉంచి రోగికి అవసరమైన చికిత్స అందించారు. మూడు, నాలుగు రోజులు 24 గంటలూ డయాలిసిస్‌ చేశారు. జీజీహెచ్‌సీ ఆస్పత్రి హెపటాలజీ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్‌ జాయ్‌ వర్గీస్‌ మాట్లాడుతూ ‘‘ఈ శస్త్రచికిత్సలో కాలేయ, మూత్రపిండాల నిపుణులతో పాటుగా క్రిటికల్‌ కేర్‌ బృందం 14 గంటల పాటు కష్టపడింది. విజయవంతంగా ఈ రెండు అవయవాల మార్పిడి తరువాత రోగి స్పృహలోకి వచ్చారు. 16 చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశాం. రోగితో పాటుగా అతని సోదరి, భార్య కూడా ఆరోగ్యంగా ఉన్నారు’’అని పేర్కొన్నారు.

Updated Date - 2020-10-22T23:51:30+05:30 IST