Abn logo
Sep 25 2021 @ 03:12AM

లాయర్ల దుస్తుల్లో వచ్చి.. కోర్టు హాల్లోనే దారుణహత్య

  • కాల్పుల మోతతో దద్దరిల్లిన రోహిణి కోర్టు
  • గ్యాంగ్‌స్టర్‌ జితేంద్ర గోగి దారుణ హత్య
  • జడ్జి ఎదురుగానే విచారణ ఖైదీపై ఘాతుకం
  • పోలీసుల కాల్పుల్లో హంతకులిద్దరూ హతం
  • ఢిల్లీలో కలకలం.. కోర్టుల్లో భద్రతపై ప్రశ్నలు
  • విధులకు వెళ్లం.. లాయర్ల ఆందోళన
  • ఘటనపై ఆరా తీసిన సీజేఐ ఎన్‌.వి.రమణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: అది ఉత్తర ఢిల్లీలోని రోహిణి కోర్టు. న్యాయవాదులు, కక్షిదారులతో ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. కోర్టు హాలు నంబరు 207లోకి ఓ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌, పలు క్రిమినల్‌ కేసుల్లో నిందితుడు అయిన జితేంద్ర గోగిని విచారణ కోసం ప్రవేశపెట్టారు. అక్కడ న్యాయవాదులంతా కూర్చున్నారు. తన స్థానంలో ఆసీనులైన జడ్జి, విచారణ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతలో.. న్యాయవాదుల దుస్తుల్లో ఉన్న ఇద్దరు, ఆ గ్యాంగ్‌స్టర్‌ వైపు తుపాకులను ఎక్కుపెట్టి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ అనూహ్య ఘటనతో అక్కడివారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే మళ్లీ కాల్పుల మోత మోగింది. గ్యాంగ్‌స్టర్‌కు ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులు అప్రమత్తమె ఆ ఇద్దరినీ కాల్చి చంపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటింట సమయంలో జరిగిన ఈ ఘటన దేశరాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టు ప్రాంగణంలో భద్రత ప్రమాణాల లోపాలను ఎత్తిచూపింది. 


3 తూటాలు శరీరంలోకి దిగడంతో తీవ్రంగా గాయపడిన గోగిని ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులిద్దరూ సునీల్‌ మాన్‌ అలియాస్‌ టిల్లూ గ్యాంగ్‌కు చెందిన వారని భావిస్తున్నారు. కాల్పుల ఘటనలో ఈ ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ అస్థానా తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనలో మొత్తంగా 30రౌండ్ల కాల్పులు జరిగినట్లు గుర్తించారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌ అయింది. కాల్పుల శబ్ధాలకు భయపడి ఇద్దరు పిల్లలు పరుగెత్తడం, న్యాయమూర్తులు, కాల్పుల నుంచి తప్పించుకునేందుకు దాక్కునేందుకు ప్రయత్నించడం వంటి దృశ్యాలు కనిపించాయి.  కాగా కోర్టులో కాల్పుల ఘటనపై ఆందోళనలకు గురైన లాయర్లు శనివారం నుంచి విధులను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌చేశారు. ఢిల్లీ పరిధిలోని ఏడు జిల్లాలోని కోర్టుల్లో భద్రతను సమీక్షించాలని స్పష్టం చేశారు. కాగా ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.  ఘటనపై ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సతో మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలు సజావుగా జరిగేలా పోలీసులు, బార్‌ అసోసియేషన్‌తో మాట్లాడాలని సూచించారు. 

ఏడాదిన్నరగా టార్గెట్‌

గోగి-టిల్లూ గ్యాంగ్‌ల మధ్య నెలకొన్న స్పర్థలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు గ్యాంగ్‌ల నడుమ ఏళ్లుగా ఆధిపత్యపోరు నడుస్తోందని, ఈ పోరులో ఇరువార్గలకు చెందినవారిలో 25మందికి పైగా మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. 2018లో ఉత్తర ఢిల్లీలోని బురారీలో గోగి-టిల్లూ గ్యాంగ్‌ నడుమ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. జితేంద్ర గోగీ దాదాపు ఏడాదిన్నర కాలంగా జైల్లోనే ఉన్నాడు. టిల్లూ గ్యాంగ్‌కు అతడు గత ఏడాది మార్చి నుంచే టార్గెట్‌ అయ్యాడని, అతడిని జైల్లోనే హతమార్చేందుకు ఆ గ్యాంగ్‌ ప్రణాళికలు వేసినట్లు చెబుతున్నారు. అయితే, గోగి శుక్రవారం విచారణకు హాజరవనుండటంతో టార్గెట్‌ మిస్‌ అవ్వొద్దని పక్కా స్కెచ్‌ వేసి అమలు చేసినట్లు చెబుతున్నారు. కాగా కోర్టు ప్రాంగణంలోకి ఆయుధాలతో ప్రవేశించిన ముష్కరులను భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారు? మెటల్‌ డిటెక్టర్లు ఉన్నా వారు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

  

ఎవరీ జితేంద్ర గోగి

జితేంద్ర గోగి స్వస్థలం ఢిల్లీ. వయసు 37 ఏళ్లు. స్కూల్‌ దశలోనే చదువు మానేశాడు. 2010లో తండ్రి మెహర్‌ సింగ్‌ మరణం తర్వాత నేరాలవైపు మళ్లాడు. హత్య, హత్యాయత్నం, దోపిడీలు, దొంగతనాలు, బలవంతపు వసూళ్లు సహా 19 కేసుల్లో గోగి నిందితుడు. పలుమార్లు జైలుకెళ్లాడు. తన అనుచరుడైన నిరంజన్‌ హత్యలో ప్రమేయం ఉన్న దేవేందర్‌ ప్రధాన్‌ అనే వ్యక్తిని 2017 ఫిబ్రవరిలో ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లో గోగి హత్యచేశాడు. అదే ఏడాది అక్టోబరులో హరియాణాకు చెందిన ఫోక్‌ సింగర్‌, డ్యాన్సర్‌ హర్షిత దహియాను హత్యచేశాడు. తన అనుచరుడు దినేశ్‌ కరేలా చేసిన హత్య కేసులో ఆమె ప్రధాన సాక్షి కావడంతోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. దీపక్‌ అనే ఉపాధ్యాయుడిని, రవి భరద్వాజ్‌ అనే వ్యక్తిని గోగి మనుషులు చంపేశారు. ఉత్తర ఢిల్లీలో ఆప్‌ నేత వీరేంద్ర మన్‌ను కాల్చి చంపింది గోగీ గ్యాంగ్‌ సభ్యులే. 


గోగి 2011, 2016లో అరెస్టయ్యాడు. 2016లో కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి గోగి.. ఢిల్లీ, హరియాణా రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారాడు. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.4 లక్షలిస్తామని ఢిల్లీ, రూ.2 లక్షలిస్తామని హరియాణా ప్రకటించాయి. కాగా గోగిని, అతడి కుడి భుజం అయిన కుల్‌దీప్‌ మాన్‌ అలియాస్‌ ఫాజాను గత ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్డనైజ్డ్‌ క్రైం యాక్ట్‌ (ఎంసీడీసీఏ) చట్టం కింద గుర్‌గావ్‌లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్లకు కస్టడీ నుంచి కుల్‌దీప్‌ తప్పించుకునే ప్రయత్నం చేయగా అతడిని  పోలీసులు కాల్చి చంపారు. గోగి మాత్రం అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు.