Abn logo
Apr 1 2020 @ 00:29AM

రండి.. రక్త కాటేరుపై గెలుద్దాం!

మనిషిలోంచి మనిషి మాయం. ఈ అమానవీయతకు కరోనానే నిందిద్దామా? నెపం మొత్తం పిపీలికం కన్నా చిన్నదైన ఆ సూక్ష్మ క్రిమి మీదే వేసేద్దామా? కనిపించని శత్రువుతో బహిరంగ పోరాటం కుదరదు. శుభ్రతే అస్త్రంగా, ఇల్లే భద్రంగా గెరిల్లా యుద్ధ వ్యూహమే సాగాలి. గూడుకట్టుకుంటున్న భయం బద్దలు కావాలి. జనానికి భరోసా నివ్వాలి.


ఇంత నిశ్శబ్దాన్ని ఎన్నడైనా అనుభవించామా? రాత్రిళ్లు వీధి కుక్కలు కూడా అరవడం మానేశాయి! ఆవుల మందల్లాగా లేళ్ళ గుంపులు కనుమ దారుల్లో కనిపిస్తున్నాయి. అడవి అంచు ఊళ్ళలో నెమళ్లు కోళ్లలా తిరుగుతున్నాయి. నిర్భయంగా నిదానంగా చిరుతలు రోడ్లు దాటుతున్నాయి. ఎంత వింత సందర్భం! అరుదే అయినా ఈ దృశ్యాలేవీ ఉల్లాసాన్నివ్వడం లేదు. ఆహ్లాదంగానూ అనిపించడం లేదు. పరచుకున్న నిశ్శబ్దం ప్రశాంతతనివ్వడం లేదు. అలజడి తగ్గడం లేదు. భార్యా బిడ్డా, అమ్మా నాన్నా, అక్కా తమ్ముడూ అందరూ ఇంట్లోనే ఉన్నా కుదురు లేదు. కనిపించని ప్రమాదమేదో ఘంటానాదంలా గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఉండి ఉండీ వెన్నులో ఏదో జరజరా పాకుతున్నట్టుగా ఉంటోంది. వాట్సాప్‌ తెరిచినా, టీవీ ఆన్‌ చేసినా, పేపర్‌ పేజీలు విప్పినా ఒక్కటే వార్త. ఇదంతా అప్రమత్తత కోసమే అని ఎంత సమాధానపరచుకున్నా తెలియని భయం ఒకటి లోపల్లోపలికి జొరబడిపోతోంది.


ముళ్ళు పొడుచుకొచ్చిన ఉమ్మెత్తకాయ ఆకారంలో ఉండే ప్రాణం లేని ఒక సూక్ష్మ క్రిమి సమస్త జన ప్రపంచాన్నీ కలవరపెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారి బలి తీసుకుంటున్నది మానవ ప్రాణాలను మాత్రమే కాదు, మానవ సంబంధాలను కూడా. మనిషి నుంచి మనిషిని వేరు చేసింది. ఆలింగనం, కరచాలనం, ముద్దూ మురిపెం అన్నీ దూరం దూరం. మనిషికి మనిషి రెండు మీటర్ల ఎడం. ఇళ్ళు జైళ్ళయ్యాయి. పడక గదిలో మంచాలు వేరయ్యాయి. దూరదేశం నుంచీ తిరిగొచ్చిన బిడ్డను చేతులు చాచి హత్తుకోడానికి లేదు. మన ఊరివాడే నగరం నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నాడనే సంతోషం లేదు, ఏం మోసుకొచ్చాడో అనే సందేహం తప్ప. ఇల్లు చేరుకోలేక సరిహద్దు క్వారెంటైన్‌ గదుల్లోంచి మోగుతున్న ఫోన్‌లు ఏ గుండెల్నీ కరిగించడం లేదు.


రాష్ట్రానికీ రాష్ట్రానికీ నడుమ, జిల్లాకూ జిల్లాకూ మధ్య మొలుస్తున్న గోడలు, ఊళ్ల పొలిమేరల్లో అడ్డుపడుతున్న ముళ్ల కంచెలు.. సమైక్య భారతాన్ని సవాలు చేస్తున్నాయి. ఆప్యాయమైన పలకరింపులు మాయమై అనుమానపు చూపులు పెరిగాయి. పనివాళ్ళు పాదం మోపితే ఇల్లు ‘మైల’ పడుతుందేమోనన్న భయం. ఇస్ర్తీ చేసి తెచ్చిన బట్టలు తాకడానికి జంకు. పొరుగింటి పుల్లగూరలు హఠాత్తుగా చేదయిపోయాయి. పక్కింటి వాళ్ళయినా సరే, గేటు బయట నుంచే మాటలు. ‘లిఫ్ట్‌ ప్లీజ్‌’ అని బతిమాలినా ఏ కారూ, ఏ బైకూ ఆగడం లేదు. కొనుక్కొచ్చుకున్న కూరగాయల మీద ఎన్ని చేతులు పడ్డాయో అని కడిగిందే కడగడం. కారు తలుపు తెరవాలన్నా, బైక్‌ హ్యాండిల్‌ తాకాలన్నా, దుకాణంలో వెనక్కిచ్చిన చిల్లర జేబులో వేసుకోవాలన్నా... చేతులు ముందుకు రావడం లేదు. పొద్దున్నే వచ్చే పాల ప్యాకెట్టు మీద అనుమానం.. నీళ్ళను మోసుకొచ్చే చేతుల మీద అనుమానం.. గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చిన మనిషిని వంటింటిదాకా రానివ్వలేని భయం. నడిచే నేలా, రోజూ కూర్చునే కుర్చీ, వాడే మొబైల్‌, రాసే పెన్నూ.. దేన్నీ నమ్మలేనితనం. మనిషిలోంచి మనిషి మాయం. 


ఈ అమానవీయతకంతా కారణమని కరోనానే నిందిద్దామా? నెపం మొత్తం పిపీలికం కన్నా చిన్నదైన ఆ సూక్ష్మ క్రిమి మీదే వేసేద్దామా? మరి, విపత్తు వేళ మన కళ్ల ముందు కనిపిస్తున్న అమానవీయ దృశ్యాలకు ఎవరిని బోనెక్కించాలి? రక్తకాటేరు లాంటి క్రిమితో పోరాడుతున్న ప్రభుత్వాసుపత్రుల్లో చాలినన్ని మాస్కుల్లేవు, చెత్త మోసుకెళ్తున్న చేతులకి గ్లౌజుల్లేవు. ఆంక్షలను ధిక్కరించి రోడ్ల మీదకు వస్తున్న వాళ్ళని ఎర్రటెండల్లో నిలబడి అడ్డుకుంటున్న పోలీసులకి భద్రకవచాల్లేవు. వైరస్‌ అనుమానితులతో మెలిగే ఎవరికైనా చైనా తరహా రక్షణకవచాలు ఎక్కడైనా చూశామా? వీధివీధీ తిరిగి జనానికి చేతులెత్తి మొక్కుతున్న రెవెన్యూ, మునిసిపల్‌ ఉద్యోగుల ప్రాణాలకున్న ముప్పును గ్రహిస్తున్నామా, వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేవి? లాక్‌డౌన్ ఒక పరిష్కారం కాదు, ప్రయత్నం మాత్రమే. దానికీ లొంగక ఉప్పెనలా వైరస్‌ విరుచుకుపడితే వెంటిలేటర్లేవీ? ఆక్సిజన్ నిల్వల్లేవు, తగినన్ని పడకల్లేవు. ఇదంతా ఎవరి అమానవీయత? ఉచిత పంపకాల కోసం వేల కోట్లు వెచ్చిస్తూ, ఆపద వేళ పదుల కోట్లు విదిలిస్తున్న ప్రభుత్వాలనేమనాలి? కరోనాకన్నా ఎన్నికలే ముఖ్యమని దబాయించిన నాయకులని ఏ కోర్టులో నిలబెట్టాలి? అయినా సరే నెపం కాసేపు కరోనా మీదే వేసేద్దామా? ఈ క్రూర ఘోర క్రిమి పుట్టిందెక్కడ, పుట్టించినదెవరు అని చర్చలు చేసుకుందామా? చైనానో, అమెరికానో కారణమని కాడి పడేయడానికి ఇది సమయమూ కాదు. ఇదొక యుద్ధం. కనిపించని శత్రువుతో బహిరంగ పోరాటం కుదరదు. శుభ్రతే అస్త్రంగా, ఇల్లే భద్రంగా గెరిల్లా యుద్ధ వ్యూహమే సాగాలి. గూడుకట్టుకుంటున్న భయం బద్దలు కావాలి. జనానికి భరోసా నివ్వాలి. గడప దాటకుండా చేసే సమీక్షలు సరిపోవు, ఊళ్లు తిరగాలి. ఆదేశాలు అమలవుతున్న తీరు స్వయంగా చూడాలి. సైన్యాన్ని వెనక ఉండి నడిపేవాడు కాదు, ముందు నిలబడి శంఖారావం పూరించేవాడే నిజమైన నాయకుడు. ఈ యుద్ధంలో బహుశా మనం గెలుస్తాం, మనమే గెలుస్తాం! రెండు నెల్లో, ఆరునెల్లో పట్టినా సరే.. గెలిచేది మాత్రం మనమే! పోరాటమే మన చరిత్ర. గెలుపే మన అస్తిత్వం. గెలిచి తీరుతాం. విజయీభవ!

ఆర్‌.ఎం.ఉమామహేశ్వరరావు

Advertisement
Advertisement
Advertisement