Abn logo
Sep 19 2021 @ 03:09AM

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు రండి

ప్రధానిని ఆహ్వానించిన చినజీయర్‌స్వామి  

న్యూఢిల్లీ, శంషాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించే భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని త్రిదండి చిన్న జీయర్‌ స్వామి స్వయంగా ఆహ్వానించారు. శనివారం ఆయన ఇక్కడ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం దివ్యసాకేతంలో నిర్వహించే ఈ మహోత్సవాల విశిష్టతను చిన్న జీయర్‌ స్వామి ప్రధానికి వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహావిష్కరణలో పాల్గొనాలని కోరారు. చిన జీయర్‌ స్వామితో కలిసి ప్రధానిని కలిసిన మైహోం గ్రూపు అఽధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు.. రామానుజాచార్య పంచలోహ విగ్రహం ప్రాజెక్టు విశేషాలను మోదీకి వివరించారు.


ప్రపంచ శాంతి కోసం చిన్న జీయర్‌ స్వామి చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా అభినందించారు. విగ్రహావిష్కరణకు తప్పక హాజరవుతానని చిన్న జీయర్‌కు హామీ ఇచ్చారు. కాగా, రామానుజాచార్య పంచలోహ విగ్రహం కొలువుదీరుతుండటంతో శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ ప్రాంతం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త రూపును సంతరించుకోనుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు పలువురు ప్రముఖులు తరలి వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు