3న విచారణకు రండి

ABN , First Publish Date - 2022-01-22T07:32:16+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు

3న విచారణకు రండి

  • రాష్ట్ర సీఎస్‌, డీజీపీకి లోక్‌సభ 
  • సభా హక్కుల ఉల్లంఘన కమిటీ ఆదేశం
  • హోం శాఖ కార్యదర్శి, కరీంనగర్‌ సీపీకీ..
  • తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేశారు
  • కరీంనగర్‌ సీపీ సహా ఇతర పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి
  • ‘కమిటీ’ విచారణలో బండి సంజయ్‌


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు వ్యవహారంపై విచారణ జరుపుతున్న లోక్‌సభ సభా హక్కుల ఉల్లంఘన కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమన్లు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కూడా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. సొంత కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తున్న తనపై పోలీసులు క్రూరంగా దాడి చేశారని, తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని లోక్‌సభ సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వివరించారు.


317 జీవోకు నిరసనగా ఇటీవల ఆయన చేసిన జాగరణ దీక్షను భగ్నం చేసి బండి సంజయ్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆయన సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి ఫిర్యాదు చేయగా.. శుక్రవారం కమిటీ విచారణ ప్రారంభించింది. దీనికి హాజరైన బండి సంజయ్‌ ఘటన జరిగిన తీరును వివరించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ సహా పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారి అని చెప్పినట్లు తెలిసింది. 2019లో ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలోనూ తనపై దాడి చేశారని చెప్పినట్లు సమాచారం.


ఇటీవల కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, హుజూరాబాద్‌ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట ఇన్‌స్పెక్టర్‌ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వీ.శ్రీనివాస్‌, కరీంనగర్‌ సీసీఎస్‌ ఏసీపీ కె. శ్రీనివాస్‌, కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ చల్లమల్ల నరేష్‌ సహా గుర్తు తెలియని ఇతర పోలీస్‌ సిబ్బంది తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. తన హక్కులకు భంగం కలిగించిన ఈ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిటీని అభ్యర్థించినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారాలుగా బండి సంజయ్‌ కమిటీకి సమర్పించారు. 




అసభ్యంగా టీఆర్‌ఎస్‌ నేతల మాటలు: రాకేశ్‌ రెడ్డి 


తమ పార్టీ గిరిజన నేతలు సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత టీఆర్‌ఎస్‌ నేతలకు భయం పట్టుకుందని, అందుకే అసభ్యంగా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత ఉపయోగించిన భాష అసభ్యంగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పదవుల కోసం సీఎం మెప్పు పొందేందుకు బానిసలుగా బతుకున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ మండిపడ్డారు. ‘దళిత బంధు’ సంగతి ఏమైందని ప్రశ్నించారు. 


Updated Date - 2022-01-22T07:32:16+05:30 IST