Apr 19 2021 @ 21:45PM

అండగా నిలిచిన ప్రభుత్వాలకు కృతజ్ఞతలు: వివేక్‌ సతీమణి

తన భర్త అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తి చేయడం పట్ల ప్రముఖ హాస్య నటుడు దివంగత వివేక్‌ సతీమణి అరుళ్‌సెల్వి ధన్యవాదాలు తెలిపారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వివేక్‌ అంత్యక్రియలు శనివారం ముగిసిన విషయం తెలిసిందే. వీటిని ప్రభుత్వం.. అధికారిక లాంఛనాలతో పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో వివేక్‌ సతీమణి అరుళ్‌సెల్వి తన కుమార్తెలతో కలిసి మీడియాతో మాట్లాడారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు గౌరవ సూచకంగా నివాళులర్పించారని, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల తన భర్త అభిమానులకు, హితులకు, సన్నిహితులకు, మీడియాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.