పంచాయతీలకు త్వరలో ఉపఎన్నికలు

ABN , First Publish Date - 2021-01-13T05:54:26+05:30 IST

ఎన్నికై నిండా రెండేళ్లయినా కాక ముందే వివిధ కారణాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దసంఖ్యలో సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

పంచాయతీలకు త్వరలో ఉపఎన్నికలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25 సర్పంచులు, 864 వార్డు సభ్యులు ఖాళీ

నల్లగొండ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎన్నికై నిండా రెండేళ్లయినా కాక ముందే వివిధ కారణాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దసంఖ్యలో సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉపఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషన్‌ జిల్లాల పంచాయతీ అధికారుల నుంచి ఇప్పటికే వివరాలు సేకరించింది. ఎన్నికల ఖర్చుల వివరాలు తెలుపకపోవడంతో పదుల సంఖ్యలో వార్డు సభ్యులపై అనర్హత వేటుపడింది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 586 మంది సభ్యులపై ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు చర్యలు తీసుకున్నారు. 


పంచాయతీ అధికారుల కసరత్తు 

పంచాయతీలు, వార్డులకు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఖాళీల వివరాలను ఎన్నికల కమిషన్‌ స్వీకరించింది. జిల్లాలో చనిపోయిన, వివిధ రకాల కారణాలతో రాజీనామా చేసిన సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ కారణాలతో  నల్లగొండ జిల్లాలో రాజీనామా చేసిన సర్పంచుల సంఖ్య 15 కాగా, ఇటీవలే ఒకరు మృతి చెందడంతో 16 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇదే తరహాలో 51 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటితోపాటు ఎన్నికల ఖర్చులు వెల్లడించని 586 మంది వార్డు సభ్యులపై అనర్హత వేటుపడటంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలు పూర్తయిన 45రోజుల్లోపు ఖర్చుల వివరాలు ఎన్నికల కమిషన్‌కు పంపాలి.  వివరాలు పంపక, నిబంధనలు పాటించని వార్డు సభ్యులను పదవుల నుంచి తొలగించారు. వీటితోపాటు నకిరేకల్‌ మండలంలోని ఏడు గ్రామాల పాలకవర్గ పదవీకాలం ఇటీవలే పూర్తయ్యింది. మొత్తంగా నల్లగొండ జిల్లాలో 16 సర్పంచ్‌లు, 637 వార్డులు ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో వివిధ కారణాలతో ఏడు సర్పంచ్‌ స్థానాలు, యాదాద్రి జిల్లాలో రెండు ఖాళీ అయ్యాయి. అనర్హత వేటు మూలంగా సూర్యాపేట జిల్లాలో 160, యాదాద్రి జిల్లాలో 67 ఖాళీలు ఏర్పడగా వీటి ఎన్నికకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 


ప్రత్యేక అధికారి పాలనతో ఇబ్బందులు

 సర్పంచ్‌లు, వార్డుల స్థానాలకు స్వల్ప కాలంలోనే ఖాళీలు ఏర్పడటంతో నిధులు అందుబాటులో ఉన్నా పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. సర్పంచ్‌లు లేని చోట, కోరం పూర్తిగా లేనిచోట ఇటీవలే ప్రత్యేక అధికారులను నియమించారు. అనర్హత వేటు పడిన వారిలో కొందరు ఉప సర్పంచులు ఉన్నారు. దీంతో కోరం ఉన్న పంచాయతీల్లో మరొకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఇటీవల పదవీకాలం పూర్తయిన నకిరేకల్‌ మండలంలోని ఏడు గ్రామాల్లో ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది. ఇప్పటికే పంచాయతీ నిఽధుల వినియోగం విషయంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ ఉద్యోగుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. తొందరగా ఎన్నికలు నిర్వహించడమే ఈ సమస్యకు పరిష్కారం అన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. 


నల్లగొండ జిల్లాలో 10 గ్రామాల్లో వార్డు సభ్యులంతా ఖాళీ 

జిల్లాలోని 10 గ్రామాల్లో ఎన్నికల ఖర్చు వెల్లడించలేదని వార్డు సభ్యులందరిపై అనర్హత వేటుపడింది. దీంతో ఆయా గ్రామాల్లో సర్పంచులు మాత్రమే మిగిలారు. చండూరు మండలంలో పడమటి తాళ్ల, డిండి మండలంలో దాసరి నెమలిపూర్‌, నిజాంనగర్‌, పెద్దతండా, గుర్రంపోడు మండలంలోని బొల్లారం, చామలోనిబావి, గాసీరాంతండా, కొత్తలాపురం, పోచంపల్లి, తేనేపల్లి తండాల్లో సర్పంచ్‌లు మాత్రమే ఉన్నారు. పాలకవర్గం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. 


ఖాళీల వివరాలు పంపాం : విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఓ, నల్లగొండ 

ప్రతినెలా 5వ తేదీ లోపు ఖాళీల వివరాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తాం. ఈనెల కూడా పంపాం. ఎన్నికలు ఎప్పుడు అనేది కమిషన్‌ పరిధిలోని అంశం.

Updated Date - 2021-01-13T05:54:26+05:30 IST