త్వరలోనే.. అందరికీ టీకా

ABN , First Publish Date - 2021-01-09T07:29:26+05:30 IST

త్వరలో ప్రారంభం కానున్న కొవిడ్‌-19 టీకా కార్యక్రమానికి సన్నాహకంగా.. రెండో డ్రై రన్‌ను దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో శుక్రవారం నిర్వహించారు.

త్వరలోనే..  అందరికీ టీకా

  • తొలి దశలో ప్రాధాన్య వర్గాలకే..
  • టీకా కార్యక్రమంపై వివరాలతోరాష్ట్రాలకు 150 పేజీల డాక్యుమెంట్‌ 
  • 600 కోట్లతో వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్లాంట్‌
  • 736 జిల్లాల్లో రెండో డ్రై రన్‌ పూర్తి
  • కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ 
  • సన్నద్ధతపై 11న సీఎంలతో మోదీ సమీక్ష
  • సభ్యులంతా ‘డ్రైవ్‌’లో పాల్గొనాలి: ఐఎంఏ
  • ‘ముక్కు’ టీకాపై ట్రయల్స్‌కు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు
  • మార్చి నాటికి ప్రారంభమయ్యే అవకాశం

న్యూఢిల్లీ, జనవరి 8 : త్వరలో ప్రారంభం కానున్న కొవిడ్‌-19 టీకా కార్యక్రమానికి సన్నాహకంగా.. రెండో డ్రై రన్‌ను దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో శుక్రవారం నిర్వహించారు. ఇందుకోసం ఒక్కో జిల్లాలో 3 చొప్పున టీకా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా టీకాల తరలింపు, డోసుల నిల్వ, మానవ వనరుల నిర్వహణ, వ్యాక్సినేషన్‌ వంటి అంశాల్లో ఎదుర య్యే అవరోధాలను గుర్తించారు. ఈ అనుభవాల ఆధారంగా.. త్వరలో ప్రారంభమయ్యే టీకా కార్యక్రమం విజయవంతానికి ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. చెన్నైలోని రాజీవ్‌గాంధీ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో నిర్వహించిన డ్రై రన్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సమీక్షించారు.




ప్రాధాన్య వర్గాల వారందరికీ వ్యాక్సినేషన్‌ చేశాక.. సాధ్యమైనంత త్వరగానే దేశ ప్రజలందరికీ టీకాలు వేస్తామని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ ఐదు నెలల క్రితం ఏర్పాటుచేసిన జాతీయ నిపుణుల బృందం వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. టీకా కార్యక్రమంతో ముడిపడిన ప్రతి చిన్న అంశాన్ని నిపుణుల బృందం ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించిందని, ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని క్షేత్రస్థాయి దాకా చేరవేశామన్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా అందించినట్లు తెలిపారు.

ప్రజలు టీకా కోసం పేర్లు నమోదు చేసుకున్నప్పటి నుంచి రెండు డోసులు వేయించుకునే దాకా ‘కొవిన్‌’ వేదికగా పూర్తిస్థాయి డిజిటల్‌ పర్యవేక్షణ ఉంటుందని హర్షవర్ధన్‌ చెప్పారు. టీకా డోసులు వేయించుకున్న ప్రతి ఒక్కరికి ఎలకా్ట్రనిక్‌ ధ్రువపత్రం జారీచేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేసేందుకుగానూ.. ఈమేరకు వివరాలతో కూడిన 150 పేజీల డాక్యుమెంట్‌ను అన్ని రాష్ట్రాలకు అందించినట్లు ఆయన వెల్లడించారు.


కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల పెట్టుబడితో తమిళనాడులోని చెంగల్‌పట్టులో నిర్మించిన హెచ్‌ఎల్‌ఎల్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ (హెచ్‌బీఎల్‌) సమీకృత వ్యాక్సిన్‌ కాంప్లెక్స్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని హర్షవర్ధన్‌ తెలిపారు. దీన్ని కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రక్రియ కోసం వాడుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో దేశం చేపట్టబోతున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై సమీక్షించేందుకు జనవరి 11న (సోమవారం) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా సమావేశమవనున్నారు.



కాగా.. కార్గో, ప్యాసింజర్‌ విమానాల ద్వారా కరోనా టీకాలను రవాణాచేసే క్రమంలో విమానయాన సంస్థలు పాటించాల్సిన నిబంధనల వివరాలతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. డ్రై ఐస్‌లో ప్యాక్‌ చేసిన టీకాలను తరలించే విమాన సిబ్బందికి స్టాక్‌ నిర్వహణ, నిర్వహణ లోపంతో తలెత్తే సమస్యలు, తరలింపు క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై శిక్షణ ఇవ్వాలని నిర్దేశించింది. టీకాలను తరలించే విమానాల్లో ప్రయాణికులను తీసుకెళ్లరాదని ఆదేశించింది. వాతావరణ పీడనం సాధారణంగా ఉన్నప్పుడు.. ఉష్ణోగ్రత మైనస్‌ 78 డిగ్రీల సెల్సీయస్‌ను మించితే డ్రై ఐస్‌, కార్బన్‌ డయాక్సైడ్‌గా రూపాంతరం చెందుతుందని తెలిపింది. దాన్ని ‘డేంజరస్‌ గూడ్స్‌’ విభాగానికి చెందిన అంశంగా పరిగణిస్తారని గుర్తుచేసింది.


‘డేంజరస్‌ గూడ్స్‌’ తరలింపునకు ఇప్పటికే అనుమతి ఉన్న విమానయాన సంస్థలు మాత్రమే టీకాల తరలింపు సేవలు అందించాలని స్పష్టంచేసింది. విమానంలో గరిష్ఠంగా ఏ మేరకు డ్రై ఐస్‌ను లోడ్‌ చేయొచ్చనే దానిపై విమానయాన సంస్థలు ముందస్తు నిర్ధారణకు రావాలని తెలిపింది. ఈనేపథ్యంలో విమాన కేబిన్‌లలో తగినన్ని కార్బన్‌ డయాక్సైడ్‌ డిటెక్టర్లను అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఇక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో క్రియాశీలంగా పాల్గొనాలని తమ సభ్యులందరికీ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) విజ్ఞప్తి చేసింది. డ్రైవ్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు టీకాలపై అపోహలు, వదంతులను తిప్పికొడతామని ప్రకటించింది. 


Updated Date - 2021-01-09T07:29:26+05:30 IST