పథకాల్లో మహిళలకే పట్టం

ABN , First Publish Date - 2021-04-17T08:58:58+05:30 IST

‘‘ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. అన్ని పథకాల్లోనూ మహిళలకే ప్రాధాన్యం. ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

పథకాల్లో మహిళలకే పట్టం

మహిళా రైతుల కోసమే అమూల్‌

మహిళా డెయిరీలకు సంపూర్ణ సహకారం

‘చేయూత’ పథకంలో గేదెల పంపిణీ

ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టీకరణ

గుంటూరులో అమూల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం


అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘‘ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. అన్ని పథకాల్లోనూ మహిళలకే ప్రాధాన్యం. ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పుడు ‘అమూల్‌’ వల్ల ఇంకా మేలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. మహిళా పాడి రైతుల సంక్షేమం కోసమే  అమూల్‌ ద్వారా పాల సేకరణ చేపట్టాం. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు ఎంతో ప్రయోజనం. అమూల్‌లో వాటాదారులూ,భాగస్వాములూ మహిళలే. లాభాలను మహిళలకే అది పంచుతుంది’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఏపీ-అమూల్‌ పాలవెల్లువ ప్రాజెక్ట్‌’లో భాగంగా గుంటూరు జిల్లాలో పాల సేకరణను శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.


ఇప్పటికే చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో అమూల్‌ ప్రాజెక్ట్‌ అమలులో ఉండగా, కొత్తగా గుంటూరు జిల్లాలో 129గ్రామాలతో పాటు చిత్తూరు జిల్లాలో అదనంగా 174 గ్రామాల నుంచి అమూల్‌ ద్వారా పాల సేకరణకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘అమూల్‌ ప్రైవేటు సంస్థ కాదు.. సహకార సంఘం. ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అమూల్‌ చేసే ప్రాసెసింగ్‌ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఈ సంస్థ ఐస్‌క్రీమ్‌లు, చాకెట్లు కూడా తయారు చేస్తోంది. అమూల్‌ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. భారీ లాభాలు కూడా వస్తున్నాయి. అమూల్‌ మన రాష్ట్రానికి రావడం విప్లవాత్మక పరిణామంగా చెప్పుకోవాలి. అమూల్‌ను మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్రంలో మహిళల జీవితాలు మార్చడం కోసం మహిళా డెయిరీ సహకార సంఘాలకు సంపూర్ణ మద్దతు అందించేలా 9,899 గ్రామాలను గుర్తించి, వాటి నుంచి పాల సేకరించేందుకు రూ.4 వేల కోట్లతో ఆటోమేటిక్‌, బల్క్‌మిల్క్‌ యూనిట్లను నిర్మిస్తున్నాం.


గతంలో ఏనాడూ పాల నాణ్యతా పరీక్షలు పాడి రైతుల సమక్షంలో జరిగేవి కాదు. కానీ, ఇప్పుడు పాడి రైతుల ముందే నాణ్యతా పరీక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా పాల సేకరణ తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి అమూల్‌ సంస్థ రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది. ప్రతి లీటర్‌ పాలకు అమూల్‌ రూ.5-7 అదనంగా చెల్లిస్తుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా మోసం లేదని స్పష్టం చేశారు. పాడి గేదెలు కావాలని మహిళా రైతులు కోరుతున్నారని, ఈ క్రమంలో చేయూత పథకంలో దీనిని చేర్చినట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలు పాడి గేదెలు తీసుకోవచ్చని చెప్పారు. భవిష్యత్‌లో ఆర్బీకేల ద్వారా మేలు రకం దాణా సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో 36 లక్షల మంది మహిళాపాడి రైతులు అమూల్‌ సంస్థలో భాగస్వాములయ్యారని, వారే తమ సంస్థకు యజమానులని అమూల్‌ ఎండీ ఆర్‌.ఎస్‌. సోధి చెప్పారు.  

Updated Date - 2021-04-17T08:58:58+05:30 IST