Abn logo
Oct 25 2021 @ 02:21AM

డీజీపీ, మంత్రుల ఫోన్లూ ట్యాపింగ్‌

  • రెండు వర్గాలుగా చీలిన పోలీస్‌ శాఖ
  • 30 మంది పోలీసులతో కేసీఆర్‌ దళం
  • భయంభయంగా డీజీపీ కుటుంబం
  • నక్సల్స్‌ ఉంటే నైనా పరిస్థితి బాగుండేదేమో
  • నయా నిజాం కేసీఆర్‌.. ఖాసీంరజ్వీ హరీశ్‌
  • టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు


కరీంనగర్‌ అర్బన్‌/పెద్దపలి/కమలాపూర్‌/ఇల్లందకుంట, అక్టోబరు 24: రాష్ట్ర పోలీస్‌ శాఖ రెండు సామాజిక వర్గాలుగా చీలిపోయిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. తనతోపాటు డీజీపీ, ఎంపీలు, రాష్ట్ర మంత్రుల ఫోన్లూ ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులు ప్రభాకర్‌రావుతోపాటు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు, కోవర్ట్‌ ఆపరేషన్‌లో నిష్ణాతులు వేణుగోపాల్‌రావు, నర్సింగరావుకు చట్ట విరుద్ధంగా రెగ్యులర్‌ పదవులు ఇచ్చిన కేసీఆర్‌.. మొత్తం 30మందితో ఓ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. డీజీపీని అవమానిస్తూ తక్కువ హోదా కలిగిన అధికారితో నిఘా పెట్టారని అన్నారు. డీజీపీ కుటుంబం భయంభయంగా గడుపుతున్నదని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో రాధాకిషన్‌రావు, సిట్‌లో సందీ్‌పరావు, ఏసీబీలో భుజంగరావు, మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాదరావు, రమణకుమార్‌ను పెట్టి.. హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములపై నిఘా పెట్టడంతోపాటు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్‌లో ఆదివారం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి, కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట, హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ బంధువు గజానంద్‌ భూపాల్‌ను ఏపీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ పోస్టింగ్‌ ఇచ్చారని తెలిపారు.


రాష్ట్రంలో ప్రస్తుత నిర్బంధాలు, భయానక పరిస్థితులు చూస్తుంటే దేవుడా... నక్సలైట్లు ఉంటే బాగుండేదేమో అన్న ఆలోచన కలుగుతుందన్నారు. వాళ్లుంటేనైనా ఈ దుర్మార్గాలు తగ్గుతాయనే పరిస్థితులు వచ్చాయన్నారు. కేసీఆర్‌ నయా నిజాం అయితే... హరీశ్‌రావు ఖాసీం రజ్వీలాగా హుజూరాబాద్‌లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ అనే వ్యాపార సంస్థలో ఇద్దరు సహచరుల మధ్య పంపకాల్లో వచ్చిన విభేదాల వల్లే హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు. ఇందులో టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ఫలితం వస్తే హరీశ్‌రావు కుర్చీ ఊడుతుందని జోస్యం చెప్పారు. హుజురాబాద్‌లో కసబ్‌రెడ్డి కోవర్టుగా మారినందునే కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక ఆలస్యమైందన్నారు. బల్మూరి వెంకట్‌ కాంగ్రెస్‌లో పుట్టాడని, చివరి వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటాడని స్పష్టం చేశారు. బల్మూరి స్థానికేతరుడైతే.. గజ్వేల్‌లో కేసీఆర్‌, సిరిసిల్లలో కేటీఆర్‌, సిద్దిపేటలో హరీశ్‌ కూడా స్థానికేతరులేనని అన్నారు. 


బీజేపీలోనూ రెండు వర్గాలు

నల్ల చట్టాలతో రైతులకు తీరని అన్యాయం చేస్తున్న బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని రేవంత్‌ ప్రశ్నించారు. బండి సంజయ్‌కు బీజేపీలో విలువ లేదని, కరీంనగర్‌లో ఫ్లెక్సీలో మురళీధర్‌రావు ఫొటో భారీ సైజులో ఉండగా బండి ఫొటో స్టాంపు సైౖజులో కూడా లేదని అన్నారు. పార్టీలో ఆయన్ను గుర్ఖా కంటే హీనంగా చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా బీజేపీ చీలిపోయిందని వ్యాఖ్యానించారు. అనుకూల వర్గం సాయంతోనే దళితబంధుపై స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. మురళీధర్‌రావు, సుగుణాకర్‌రావు, విద్యాసాగర్‌రావు హుజూరాబాద్‌లో ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. 2023లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, అవమాన భారంతో కేసీఆర్‌ ఆత్మహత్య చేసుకోవడం ఖాయమన్నారు.


పెద్ద కొడుకు కాదు.. దొంగ కొడుకు!

రూ.2016 పింఛన్‌ ఇస్తూ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటున్నానని చెప్పుకునే కేసీఆర్‌.. పెద్ద కొడుకు కాదని, దొంగ కొడుకని రేవంత్‌ మండిపడ్డారు. మాయమాటలతో మభ్యపెడుతూ పబ్బం గడిపే వంచకుడని ధ్వజమెత్తారు. పింఛన్‌ను ఎరగా వేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. 1.50లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్‌.. వేల కోట్లు కమీషన్లు దండుకొన్నారని ఆరోపించారు. వరి స్థానంలో పత్తి వేయమని చెప్పి.. ఇప్పుడు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ధర ఇవ్వకపోవడానికి అదేమైనా కేసీఆర్‌ అబ్బ సొత్తా.. తాత సొత్తా.. అని నిలదీశారు. పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా ఈటల రంగు మార్చాడని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మాదిరిగానే హరీశ్‌, ఈటల తోడుదొంగలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ను గెలిపించాలని కోరారు.


పెద్దపల్లి అభ్యర్థిగా విజయరమణారావు

టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసుగుచెంది ఉన్నారని రేవంత్‌ అన్నారు. ప్రజల మూడ్‌ చూస్తుంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయరమణారావు నిలబడతారని రేవంత్‌ ప్రకటించారు. కాగా, ‘‘హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.111.18, డీజిల్‌ రూ.104.32 ఉంది. పెరిగిన ధరలపైనా పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. ఈ మోసానికి అంతం ఎన్నడు?’’అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు. 

క్రైమ్ మరిన్ని...