వ్యాపారాలు పుంజుకుంటున్నాయ్‌

ABN , First Publish Date - 2020-10-05T06:49:37+05:30 IST

కొవిడ్‌-19 ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా బయటపడుతోందని దేశీయ కార్పొరేట్‌ రంగానికి చెందిన ప్రధాన కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓ) వెల్లడించారు...

వ్యాపారాలు  పుంజుకుంటున్నాయ్‌

  • ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోంది
  • లాక్‌డౌన్‌లు వద్దే వద్దు.. సీఐఐ సీఈఓ సర్వే వెల్లడి 


న్యూఢిల్లీ : కొవిడ్‌-19 ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా బయటపడుతోందని దేశీయ కార్పొరేట్‌ రంగానికి చెందిన ప్రధాన కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓ) వెల్లడించారు. వివిద రంగాలకు చెందిన 115 ప్రముఖ కంపెనీల సీఈఓలతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ‘దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్స్‌ సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. కంపెనీలూ తమ వ్యాపారాలను ప్రారంభించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ క్రమం గా కోలుకుంటోంది’ అని పలువురు సీఈఓలు అభిప్రాయపడినట్లు సీఐఐ వెల్లడించింది. 


కోలుకున్నాయ్‌..

మెట్రో నగరాల్లో డిమాండ్‌ ఇంకా అంతంత  మాత్రంగానే ఉంది. అయితే చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వస్తు సేవల డిమాండ్‌ ఇప్పటికే కొవిడ్‌ ముందు స్థాయికి చేరినట్టు సర్వే తెలిపింది. ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌, వినియోగ వస్తువులు, నిర్మాణ సామాగ్రి ఉత్పత్తి కంపెనీల డిమాండ్‌ ఇప్పటికే గాడిన పడిన  విషయాన్ని గుర్తు చేసింది. పరిస్థితులు క్రమంగా కుదుటపడడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంపెనీల ఉత్పత్తి సామర్ధ్య వినియోగం 50 శాతానికి చేరే అవకాశం ఉందని సర్వేలో పాల్గొన్న సీఈఓలు చెప్పారు. పండగల సీజన్‌తో డిమాండ్‌ మరింత ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

జీవనోపాధి ముఖ్యమే

ఇంకా కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కరోనా కట్టడి కోసం ఉన్నట్టుండి లాక్‌డౌన్లు విధించడంపై పలువురు సీఈఓలు ఆందోళన వ్యక్తం చేశారు. గాడిన పడుతున్న ఆర్థిక కార్యకలాపాల్ని ఇది దెబ్బతీస్తుందన్నారు. ప్రజల ప్రాణాలతో పాటు వారి జీవనోపాధి ముఖ్యమనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. ఇలాంటి చర్యలు కొవిడ్‌ను కట్టడి చేయాలనే లక్ష్యాన్ని కూడా నెరవేర్చవన్నారు. ఆంక్ష లు పూర్తిగా ఎత్తివేస్తే తప్ప పడిపోయిన డిమాండ్‌ మళ్లీ పుంజుకునే  అవకాశం లేదని సర్వే తేల్చి చెప్పింది. డిమాండ్‌ పుంజుకున్నప్పుడే కంపెనీల ఉత్పత్తి సామర్ధ్య వినియోగం పెరుగుతుందనే విషయా న్ని గుర్తు చేసింది. పరిస్థితులు ఎంతగా కుదురుకున్నా ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీల ఆదాయాలు గత ఏడాది స్థాయిలో మాత్రం ఉండవని సీఈఓలు స్పష్టం చేశారు. 



సంస్కరణలతో దీర్ఘకాలిక మేలు 

కరోనా నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లు, కార్మిక చట్టాలు, ఎంఎ్‌సఎంఈల నిర్వచనం వంటి వివిధ రంగాల్లో ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేపట్టిన సంస్థాగత సంస్కరణలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్ధించుకుంది. ఈ సంస్కరణలతో ఎంఎస్‌ఎంఈ రంగానికి మరింత మేలు జరుగుతుందని పేర్కొంది. ఈ రంగాల్లో కార్మికుల వేతనాలతో పాటు ఉపాధి అవకాశాలు, ఉత్పాదకత పెరుగుతాయని అంచనా వేసింది. దీర్ఘకాలంలో నిలకడతో కూడిన అధిక జీడీపీ వృద్ధి రేటు సాధనకు ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని తెలిపింది. బారత్‌కు కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగకపోయినా, క్రమంగా గాడిన పడే అవకాశం ఉందని పేర్కొంది.


Updated Date - 2020-10-05T06:49:37+05:30 IST