కమిషన్‌ పెట్టి కథ తేల్చేస్తాం!

ABN , First Publish Date - 2021-10-23T07:54:03+05:30 IST

‘‘తప్పుడు కేసులు పెట్టే పోలీసు అధికారులను వదిలేది లేదు. అధికారంలోకి రాగానే ఒక కమిషన్‌ వేస్తాం.

కమిషన్‌ పెట్టి కథ తేల్చేస్తాం!

  • తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలేది లేదు
  • తప్పులు చేసిన వారినీ వదిలిపెట్టం
  • దేశంలో ఎక్కడున్నా తప్పించుకోలేరు
  • ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు 
  • పార్టీలు, సంఘాలూ కలిసి రావాలి: బాబు


ఒక వ్యక్తి రౌడీయిజం చేయవచ్చు. ఒక అధికారి దౌర్జన్యానికి దిగవచ్చు. కానీ... ఇక్కడ మొత్తం ప్రభుత్వమే ఉగ్రవాదం చేస్తోంది. దాని పర్యవసానమే తెలుగుదేశం కార్యాలయంపై దాడి! -చంద్రబాబు


అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘తప్పుడు కేసులు పెట్టే పోలీసు అధికారులను వదిలేది లేదు. అధికారంలోకి రాగానే ఒక కమిషన్‌ వేస్తాం. అన్యాయం చేసిన, అక్రమంగా కేసుపెట్టిన వారిపై ఫిర్యాదులు స్వీకరిస్తాం. విచారణ జరిపి వారు ఎక్కడున్నా శిక్షిస్తాం’’... అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. వైసీపీ సర్కారు పాల్పడుతున్న ‘ప్రభుత్వ  ఉగ్రవాదం’పై పోరాడేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా చేపట్టిన 36 గంటల నిరాహారదీక్ష ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 


 కలిసి పోరాడదాం...

రాష్ట్రాన్ని అన్నిరకాలుగా నాశనం చేశారు. ఆర్థికంగా విధ్వంసం చేశారు. పన్నులేసి ప్రజల జేబులు కొల్లగొట్టారు. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్‌, గంజాయికి కేంద్రం చేశారు. ప్రభుత్వమే ఉగ్రవాదం చేస్తోంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా! అంతా కలిసి పోరాడదాం. తర్వాత ఎవరి సిద్ధాంతాలతో వారు ఎన్నికలకు వెళ్దాం. అదేవిధంగా ప్రజాసంఘాలు, కులసంఘాలు, కూలీలు, రైతులు అందరినీ కోరుతున్నా! ఈ పోరాటంలో కలిసి రండి. 


 ప్రశ్నించే గొంతులే లేకుంటే...

ప్రశ్నించే గొంతులే లేకుంటే ప్రజలనూ లెక్క చేయరు. మాస్క్‌ అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చివాడిని చేసి చంపేశారు. ఇసుక అక్రమంగా వెళ్తోందని అడిగితే తూర్పుగోదావరిలో మరో దళితుడికి శిరోముండనం చేసేశారు. మద్యం ధరలు పెంచి, నాసిరకం పెట్టారన్న ఒక తమ్ముడు పుంగనూరులో  ఐదోరోజుకు శవమై తేలాడు. డ్రగ్స్‌, గంజాయిపై పోరాడుతుంటే భయపెట్టాలని పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. ఇక పేదలకు రక్షణ ఏముంటుంది? భర్త ముందే భార్యను రేప్‌ చేస్తే... దోషులను పట్టుకున్నారా? 


 తల్లిని, చెల్లిని లాగే పరిస్థితి  

పట్టాభి వీళ్ల తల్లిని తిట్టాడట! ఆ పదమే నేను ఎప్పుడూ వినలేదు. నాకు బూతులు రావు. యుక్తవయసులో రాజకీయాల్లోకి వచ్చా. అప్పటికి ఇతను బుడ్డీపాలు తాగుతుంటాడు. అలాంటిది నాపై ఏం మాట్లాడారో విన్నారా!  మంత్రులు, ముఖ్యమంత్రి నన్ను తిడతారు. వీళ్లు చేసే తప్పుడు పనుల్ని ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక ఆడలేక మద్దెల ఓటు అన్నట్లుగా ఏదో సాకు వెతుకుతున్నారు. మాట్లాడాలంటే గట్టిగా మాట్లాడతాను తప్ప నాకు బూతులు రావు. ఏదో అన్నారని లేనిదాన్ని సృష్టించి ఆయన తల్లిని కూడా తీసుకొచ్చారు. అమ్మపై అంత మమకారం ఉందా? ఆ రోజు ఆమెను ఊరూరా తిప్పావు. ఆయనకో చెల్లి ఉంది. ఆమెను నాకు కౌంటర్‌గా జగనన్న బాణం అని ఊరూరా తిప్పారు. ఆ బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతోంది? తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని నువ్వు నాకు నీతులు చెబుతావా? ఆరోజు జైలుకు పోతే నీ తల్లిని ఉపయోగించుకున్నావు. చెల్లిని ఉపయోగించుకున్నావు. ఎన్నికల ముందు జగన్‌ బాబాయి వివేకానంద రెడ్డిని నేనే చంపించానన్నారు. ఎన్నికలయ్యాక వివేకా కూతురు సీబీఐ విచారణ కావాలని కోర్టుకెళ్లి పోరాడుతుంటే వీళ్లు మాత్రం ఏం మాట్లాడడం లేదు. ఎవరు మోసగాడు? ఎవరు మోసం చేస్తున్నది?


 మద్యనిషేధం ఎక్కడ...

రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని జగన్‌ రెడ్డి కంకణం కట్టుకున్నారు. మద్య విధానం, డ్రగ్స్‌, గంజాయిపై ఉదాసీనత అందులో భాగమే. మద్యం ధరలు పెంచితే నిషేధమవుతుందా? దేశంలో ఎక్కడాలేని బ్రాండ్లు పెట్టారు. నాసిరకం బ్రాండ్లు పెట్టారు. మహిళల మంగళసూత్రాలు తాకట్టు పెట్టయినా తాగాలన్నట్లుగా చేశారు. మద్యనిషేధం అన్న వ్యక్తి... తాగేవాళ్ల ఆదాయాన్ని 25ఏళ్లు తాకట్టుపెట్టి వేల కోట్ల అప్పు తెచ్చేశాడు. అంటే 25ఏళ్లపాటు తాగుతూనే ఉండాలన్నమాట! 


 యూనిఫాం ఇచ్చేయండి..

కొందరు పోలీసు అధికారులు చేయకూడని నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. రోజులు ఇలానే ఉండవు. సాక్ష్యాలిస్తే విచారణ చేస్తామని పోలీసులు అంటున్నారు. ఆధారాలు ఇవ్వాలని లేఖలు రాస్తున్నారు. అయితే... మీ చొక్కాలు విప్పి మాకిచ్చేయండి. మేమే విచారణ చేస్తాం. డీజీపీ.. మా కార్యాలయంపై దాడి జరిగితే మాపైనే కేసులా? ఆ సమయంలో లేని వారినీ జైలుకు పంపిస్తారా? నిన్ను వదిలిపెట్టాలా డీజీపీ? ‘ఇదే మాట రాయలసీమలో అంటే ఖూనీలు జరిగేవి’ అని ఒక ఎమ్మెల్యే అన్నాడు. ఆయనపై కేసు ఎందుకు పెట్టలేదు? వ్యక్తిత్వం లేనివాళ్లు కూడా నాపై పడుతున్నారు. అరగంట మంత్రి, బెట్టింగ్‌ మంత్రి, కూతల మంత్రి నాపై పడతారు. 


 కేసులకు భయపడొద్దు...

కేసంటే తెలియని నాపై నాలుగైదు కేసులు పెట్టారు. లోకేశ్‌పై పెట్టారు. పార్టీ నేతలపై పెట్టారు. భయపడం. పోరాడతాం. అంతిమ విజయం ధర్మానిదే. అధర్మానిది కాదు. ఈ పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదు. ఎవరిపైనైనా కేసులు పెడితే భయపడవద్దు. మేమే చూసుకుంటాం. మీరేమీ లక్ష కోట్లు అక్రమంగా సంపాదించి జైలుకు వెళ్లడం లేదు. బాబాయిని చంపి జైలుకు వెళ్లడం లేదు. స్వాతంత్య్రపోరాటం కోసం పోరాడినవారిని ఎలా గుర్తుపెట్టుకుంటారో ఆంధ్రప్రదేశ్‌ కోసం పోరాడిన మిమ్మల్నీ అలాగే గుర్తుపెట్టుకుంటారు. న్యాయం కోసం పోరాడినప్పుడు తాత్కాలిక ఇబ్బందులు తప్పవు. కానీ... అంతిమంగా మనదే విజయం. తాత్కాలికంగా మనం ఇబ్బందిపడినా... తప్పుడు కేసులు పెట్టిన వారిని మాత్రం వదిలిపెట్టం. ఎవరైనా తప్పుడు కేసులు పెడితే మీరు కూడా రికార్డు చేయండి. 


ప్రైవేటు కేసులు పెడదాం! మన నాయకుడు ఎన్టీఆర్‌ వేసిన పునాది చాలా గట్టిది. ఎన్ని అడ్డంకులొచ్చినా విజయం మనదే. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, జేసీ ప్రభాకర్‌రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్‌... వీరంతా ఏం తప్పుచేశారు. తప్పుడు కేసులు పెట్టే పోలీసు అధికారులకు ఒకటే చెబుతున్నా! రేపనేది ఉంది. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే వదిలిపెట్టను. నా మంచితనాన్నే చూశారు. నా సంకల్పం ఉక్కుసంకల్పం. చోటా, మోటా రౌడీలకు ఇదే హెచ్చరిక! అడ్రస్‌ లేని రౌడీలు అడ్డంగా సీసీ టీవీ కెమెరాలో బుక్‌ అయ్యారు. వాళ్లను వదిలిపెట్టేది లేదు. ఈ డీజీపీ, ఈ జగన్‌రెడ్డి కూడా కాపాడలేరు. 


 ముద్దులు పోయి... గుద్దులు

నేను ఈ రాష్ట్రం, ఈ సమాజం కోసం ఆలోచించా. ఆయన (జగన్‌) చరిత్రను మరిచిపోయారో లేక మోసపోయారో... అంతా కలిసి ఓట్లేశారు. చివరికి... నాడు ముద్దులు. నేడు గుద్దులు. అమరావతి అభివృద్ది ఆగిపోయింది. కోకాపేటలో నాడు ఎకరా 20వేలు...ఇప్పుడు వేలంలో 60కోట్లు. ఇక్కడ 35వేల ఎకరాలు రైతులు భూమి ఉచితంగా ఇచ్చారు. రాష్ట్రం గురించి, యువత కోసం ఆలోచించా. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం. తెలుగువారికి గర్వకారణంగా ఒక మహానగరం నిర్మించాలని. కానీ... 1.5 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి చేశాడు. 


 అన్నీ మోసాలే...

రాష్ట్రంలో ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసం ప్రారంభమైంది. అన్నా క్యాంటీన్లు పోయాయి. చంద్రన్న బీమా పోయింది. పింఛను మూడువేలు పెంచుతా అని  రూ.250 పెంచారు. రెండున్నరేళ్లైంది పెంచలేదు. అమ్మ ఒడి ఒక ఏడాది ఎగ్గొట్టేశారు. నాన్న బుడ్డి మాత్రం అక్కడే ఉంది. నాడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తుంటే వైఎస్‌ తిట్టారు. కానీ... ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ప్రాజెక్టు తప్ప మిగిలినవన్నీ కొనసాగించారు. కానీ... జగన్‌ చేసిందేమిటి? అమరావతిని ఆపేశారు. పోలవరం పక్కనపెట్టాడు. 


 ప్రజల్లో చైతన్యం తేవాలి

ప్రజల్లో కూడా చైతన్యం తేవాలి. వదిలేస్తే రాష్ట్రమంతా పులివెందుల రాజకీయమే అవుతుంది. ఈ పోరాటం ఈ రోజుతో ఆగకూడదు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ ఆంధ్ర చేయాలి. గంజాయి పూర్తిగా నివారించాలి. జగన్‌రెడ్డి... ఇప్పటికైనా నీ సారా వ్యాపారం వదిలిపెట్టు. దేశమంతా ఉన్న బ్రాండ్లు పెట్టు. మద్యపానాన్ని నిషేధించు. ఇసుక ధర నాలుగింతలు పెంచారు.  ప్రజలు కూడా మా ఖర్మ అనుకునే స్థాయికి వచ్చేశారు. ప్రజల కోసం మేం పోరాడతాం!  కానీ, మీ సహకారం కావాలి. ఒక్కసారి ఆలోచించండి. నేను ఆరోజు చేసిన పనులు, ఈరోజు పనులు చూడండి. మీకే అర్థమవుతుంది. ఏం కోల్పోయామో! ఈ పోరాటం మాకోసం కాదు. రాష్ట్రం కోసం.  


 సీబీఐ విచారణ వేయాలి

దేవాలయంలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై చేసిన దాడిపై సీబీఐ విచారణ వేయాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే నేనూ పారిపోతాననుకున్నారు. ఖబడ్దార్‌. నేరస్తులు, అవినీతిపరులను చూసి భయపడే వాడిని కాను! రాష్ట్రపతి పాలనకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. కానీ... ఇప్పుడున్న పరిస్థితులను చూసి... మొట్టమొదటిసారి ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని కోరాను. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిల అపాయింట్‌మెంట్‌ అడిగాం. వారికి అన్నీ వివరిస్తాం.  ప్రభుత్వ ఉగ్రవాదంపై యుద్ధం చేస్తాం. అడుగడుగునా ఎండగడతాం. దేశంలో ఎంపీలందరికీ వివరాలు పంపిస్తాం. 


 దీక్ష విరమణ 

చంద్రబాబు గురువారం ఉదయం 8 గంటలకు మొదలుపెట్టిన దీక్షను శుక్రవారం రాత్రి 8.25 గంటలకు ముగించారు.


అయినా... మారలేదు!

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు బస్సులో వెళ్తే నాపై చెప్పులు విసిరారు. ఎవరికో బాధితులకు కోపం వచ్చి దాడి చేశారని ఆరోజు ఈ డీజీపీ దాడిని సమర్థించారు.  ఆత్మకూరులో ఎస్సీలను వెలివేస్తే వారిని సొంత గ్రామానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే... నా ఇంటి గేటుకు తాళ్లు కట్టి ఆపేశారు. నేను విశాఖపట్నం వెళ్తే విమానాశ్రయంలో ఆపేశారు. తిరుపతిలో ఎన్నికల్లో ఎన్నెన్నో అక్రమాలు! ఇదంతా ప్రభుత్వ ఉగ్రవాదం కాదా? ‘సిగ్గనిపించడం లేదా?’ అని హైకోర్టు కూడా డీజీపీకి అక్షింతలు వేసింది. అయినా... వీళ్లు మారలేదు.


బీపీలు వాళ్లకు రావా...: అభిమానులకు బీపీ పెరిగి దాడులు చేశారని సీఎం అంటున్నారు. 35వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల జీవితాల్ని చితక్కొట్టావే! ఇప్పటికే 670 రోజులుగా ఉద్యమం చేస్తున్న ఆడబిడ్డల్ని చెప్పరాని భాషలో హింసించారే! వారికి కోపం రాదా? ఉపాధి హామీలో కొన్ని లక్షల బిల్లులు ఇవ్వకుండా వారిని సర్వనాశనం చేశారే! కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారే! వారికి బీపీ పెరగదా! నా తమ్ముళ్లు హింసకు గురయ్యారు. 

జగన్‌.. ఒక ప్రత్యేక క్యారక్టర్‌: జగన్‌ విలన్‌ కూడా కాదు. అదో ప్రత్యేక క్యారెక్టర్‌. భారతదేశంలో ఇలాంటి ప్రత్యేక క్యారక్టర్‌ను చూడలేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ‘మనిషిని కొడితే దెబ్బ తగులుతుంది. కోలుకుంటాడు. అదే ఆర్థికంగా దెబ్బతీస్తే ఇక కోలుకోడు’ అని ఒకప్పుడు రాజారెడ్డి చెప్పేవారు. ఇప్పుడు అదే చేస్తున్నారు.

- చంద్రబాబు

Updated Date - 2021-10-23T07:54:03+05:30 IST