గ్యాస్‌ లీకేజీలపై కమిటీ

ABN , First Publish Date - 2020-07-08T06:48:32+05:30 IST

పరవాడ ఫార్మా సిటీలో సాయినార్‌ సంస్థతో పాటు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లో గ్యాస్‌ లీకేజీ ఘటనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఓ కమిటీని ఏర్పాటు చేసింది...

గ్యాస్‌ లీకేజీలపై కమిటీ

  • పరవాడ, నంద్యాల ఘటనలపై ఎన్జీటీ విచారణ
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎ్‌సకు ఆదేశం 

న్యూఢిల్లీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): పరవాడ ఫార్మా సిటీలో సాయినార్‌ సంస్థతో పాటు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లో గ్యాస్‌ లీకేజీ ఘటనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  బాధితులకు పరిహారం, పర్యావరణం పునరుద్ధరణతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేసి 3నెలల్లో నివేదిక అందించాలని కమిటీని ఆదేశించింది. సాయినార్‌, ఎస్పీవై ఆగ్రో సంస్థల్లో గ్యాస్‌ లీకేజీ ఘటనలపై మీడియా కథనాల ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


సోమవారం ఈ కేసులపై ఎన్జీటీ విచారణ జరిపి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరవాడలో మరణించిన ఇద్దరి కుటుంబ సభ్యులకు ఇప్పటికే రూ.35 లక్షల చొప్పున సాయినార్‌ సంస్థ నష్టపరిహారం ప్రకటించిన నేపథ్యంలో అస్వస్థతకు గురైన నలుగురికి రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు అందించాలని సూచించింది. పరిశ్రమలో ఆన్‌ సైట్‌, ఆఫ్‌ సైట్‌ ఎమర్సెన్సీ ప్రణాళికలు, మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించడంలో విఫలమవడానికి బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్జీటీ ఆదేశించింది. ఈ ఘటనను కూడా పరిశీలించాలని ఎల్జీ పాలిమర్స్‌ కేసులో కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీకి సూచించింది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోలో మరణించిన ఒకరికి మధ్యంతర పరిహారంగా రూ.15 లక్షలు చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. అస్వస్థతకు గురైనవారికి రూ.5 లక్షలు చెల్లించాలని సూచించింది. 


Updated Date - 2020-07-08T06:48:32+05:30 IST