AP Cinema Tickets Issue : దిగొచ్చిన Jagan Sarkar.. ఏకపక్ష నిర్ణయంపై దిద్దుబాటు..

ABN , First Publish Date - 2021-12-28T07:31:33+05:30 IST

AP Cinema Tickets Issue : దిగొచ్చిన Jagan Sarkar.. ఏకపక్ష నిర్ణయంపై దిద్దుబాటు..

AP Cinema Tickets Issue : దిగొచ్చిన Jagan Sarkar.. ఏకపక్ష నిర్ణయంపై దిద్దుబాటు..

  • హైకోర్టు ఆదేశాలతో.. సినిమా టికెట్లపై 11 మందితో కమిటీ
  • హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు
  • జీవో 35, కోర్టులో పిటిషన్ల అంశాలపై కసరత్తు
  • త్వరలో సంక్షోభం కొలిక్కి .. ఎవరూ స్పందించవద్దు: దిల్‌రాజు 
  • అందరూ బాగుంటేనే సినీ పరిశ్రమ కళకళ: నారాయణమూర్తి 

అమరావతి/హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సినిమా టికెట్ల వ్యవహారాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సినీ హీరోలు, ఇతర పెద్దలపై కక్షతో థియేటర్లలో సినిమా ధరలు భారీగా తగ్గిస్తూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై దిద్దుబాటుకు నడుం బిగించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ నేతృత్వంలో 11 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. సోమవారం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది.


రెవెన్యూ, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, పంచాయతీ రాజ్‌, న్యాయశాఖ కార్యదర్శులు, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, థియేటర్ల యజమానులు వేమూరి బాలరత్నం, డిస్ట్రిబ్యూటర్‌ టి. సీతారామ్‌ ప్రసాద్‌, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి ముత్యాల రామ్‌దాస్‌, సినీ గోయేర్స్‌ అసోసియేషన్‌ నుంచి ముగ్గురు ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసింది. కోర్టులో పిటిషన్లు, సినీ పరిశ్రమ ఇబ్బందులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించి ఈ కమిటీ సమస్యకు పరిష్కారాలు సూచిస్తుందంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


కాగా ప్రేక్షకుడికి సినిమా ఆప్షన్‌ మాత్రమేనని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మాతలు తీసే సినిమా టికెట్ల ధరలను కేవలం రూ.5కు తగ్గించడం అన్యాయమంటూ పలువురు హీరోలు గగ్గోలు పెట్టినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. టికెట్ల ధరలు తగ్గించాల్సిందే అంటూ రూ.5, రూ.10కి దించేస్తూ జీవో 35 జారీ చేసింది. దీనిపై ఎగ్జిబిటర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో జగన్‌ ప్రభుత్వానికి చుక్కెదురవడంతో కేవలం కోర్టును ఆశ్రయించిన సినిమా థియేటర్ల యజమానులకు మాత్రమే తీర్పు వర్తిస్తుందని, ఇతర  హాళ్ల విషయంలో ప్రభుత్వం నిర్దేశిస్తుందంటూ హైకోర్టులో వెనక్కి తగ్గింది. 


అపాయింట్‌మెంట్‌ ఇస్తే సంప్రదింపులు: దిల్‌ రాజు 

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల విషయంలో నెలకొన్న సంక్షోభం త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్‌ ధరల తగ్గింపు, థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్న పరిణామాలపై వ్యక్తిగతంగా ఎవరూ స్పందించవద్దని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, కమిటీ మధ్య సమావేశం జరిగితే చాలా వరకూ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈలోగా సంయమనం పాటించాలని కోరారు.


‘‘ప్రభుత్వానికి, పరిశ్రమకు కమిటీ వారధిలా ఉంటుంది. మాకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతాం. మాకున్న సమస్యల్ని ప్రభుత్వం ముందు ఉంచుతాం. సానుకూలంగా స్పందించి, ఓ నిర్ణయం తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావంతో ఉన్నాం’’ అని దిల్‌రాజు అన్నారు.


కాగా ఏపీలో థియేటర్లు మూసివేయడం పట్ల ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూసేవాళ్లు, తీసేవాళ్లూ, చూపించేవాళ్లు బాగుండాలని, అప్పుడే పరిశ్రమ కళకళలాడుతుందన్నారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. థియేటర్లను మూసి వేయొద్దని, తమ సమస్యల్ని స్థానిక నాయకులకు, నేతలకు చెప్పాలని, వాళ్లే పరిష్కారమార్గం చూపిస్తారన్నారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బతుకుతున్నాయని, వాళ్ల బాధను అర్థం చేసుకోవాలని కోరారు.



రాజకీయ ర్యాలీలపై ఆంక్షలు లేవా?: వర్మ 

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఉఽధృతి నేపథ్యంలో రాష్ట్ర పభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా థియేటర్లపై ఆంక్షలు విధించడం పట్ల ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించారు. షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లపై నిబంధనలు, షరతులు విధించే ప్రభుత్వాలు పొలిటికల్‌ ర్యాలీలపై మాత్రం ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించారు. రాత్రి పూట విధిస్తున్న కర్ఫ్యూలపై కూడా ఆయన సెటైర్‌ వేశారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ విధించే కర్ఫ్యూ వల్ల ఉఽధృతంగా విస్తరించే వైరస్‌ ఎలా తగ్గుముఖం పడుతుందో అర్థం కావడం లేదని, ఇది జీవితంలో తనకు ఎదరైన అతి పెద్ద సందేహమని ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2021-12-28T07:31:33+05:30 IST