‘నా భార్యను మళ్లీ నాకే ఇచ్చి పెళ్లి చేసినట్టు ఉంది’.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజల మండిపాటు

ABN , First Publish Date - 2021-12-01T18:11:17+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలు మండిపడుతున్నారు.

‘నా భార్యను మళ్లీ నాకే ఇచ్చి పెళ్లి చేసినట్టు ఉంది’.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజల మండిపాటు

అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ప్రభుత్వ హౌసింగ్‌  పథకం ద్వారా గ్రామాల్లో  ఇళ్లు నిర్మించుకుని ఉంటే... వాళ్లు రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ప్రభుత్వం వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఓ ఇంటికి వచ్చిన వాలంటీర్‌పై ఆ గృహ యజమాని మండిపడ్డారు. తమకు పట్టా ఉందని, మళ్లీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉన్న పట్టాకు మళ్లీ పట్టా ఇవ్వడమేంటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ‘నా పెళ్లాన్ని మళ్లీ నాకే ఇచ్చి పెళ్లి చేసినట్టు ఉందని’ అన్నారు.


జగన్ సర్కారు పేదలపైనా పగపట్టింది. కాసుల కోసం పేదల గూటిపై దండయాత్ర చేస్తోంది. అప్పుడెప్పుడో ఇచ్చిన పాత ఇళ్లకు కొత్తగా ‘పైసా వసూల్‌’ చేస్తున్న ప్రభుత్వం...  వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) డబ్బులు చెల్లించకుంటే పెన్షన్‌కు కోతపెడతామని హెచ్చరిస్తోంది. ‘డబ్బులు కడతారా... పింఛను ఆపేయమంటారా’ అంటూ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది చేస్తున్న ఒత్తిడితో పేదలు తల్లడిల్లుతున్నారు. ఇదేమి ఘోరమని వాపోతున్నారు.


ఈ సర్కారు కొత్తగా ఒక్క ఇల్లూ కట్టలేదు. చంద్రబాబు హయాంలో కట్టిన, నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న ‘టిడ్కో’ ఇళ్లనూ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. కానీ... ఎప్పుడో ఎన్టీఆర్‌ కాలం నుంచి బలహీన వర్గాలకు కేటాయించిన పేదల ఇళ్లపై ఈ ప్రభుత్వం దండయాత్ర చేస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ పట్టించుకోని ‘బకాయిల’ కోసం వేట ప్రారంభించింది. దీనికి ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ అని ముద్దుగా ఓ పేరు పెట్టి... వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద రూ.10 వేల నుంచి 15 వేలు కట్టాలని ఒత్తిడి చేస్తోంది. ఇప్పుడు... ఇది పరాకాష్ఠకు చేరింది.





Updated Date - 2021-12-01T18:11:17+05:30 IST