రెండుచెట్ల కోసం రెండేళ్లుగా..

ABN , First Publish Date - 2020-05-23T10:11:00+05:30 IST

ఆయన నాటుకుంది రెండు టేకు చెట్లు.. 30ఏళ్లు పెంచారు. ఉద్యోగ విరమణ చేసి సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. అందుకు ఆ

రెండుచెట్ల కోసం రెండేళ్లుగా..

అనుమతుల కోసం విశ్రాంత ఉద్యోగి అవస్థలు

అటవీశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న దుస్థితి

చేయితడిపితే వెంటనే అనుమతులు

ఇబ్బందులు పడుతున్న సామాన్యులు 


ఖమ్మం కమాన్‌బజార్‌, మే 22 : ఆయన నాటుకుంది రెండు టేకు చెట్లు.. 30ఏళ్లు పెంచారు. ఉద్యోగ విరమణ చేసి సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. అందుకు ఆ రెండు టేకు చెట్ల కలప అక్కరకు వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ క్రమంలో ఆ చెట్లను నరిక్కునేందుకు అటవీశాఖ అనుమతి కోసం ఆన్‌లైన్‌లో చలానా కూడా చెల్లించారు. ఇది జరిగి రెండేళ్లయినా అనుమతులు మాత్రం రావడం లేదు. వాటికోసం అటవీశాఖ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక ఏం చేయాలో పాలుపోక.. ఓ అధికారిని కలిసి కొంత డబ్బు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. అందుకు సరేనన్న సదరు అధికారి ఆ విశ్రాంత ఉద్యోగి దరఖాస్తున్న పై అధికారి వద్దకు తీసుకెళ్లగా.. తనవాటా ఏదంటూ ఆ పై అధికారి తిరకాసు పెట్టాడు.


దీంతో ఇంత వరకు ఆయన ఫైల్‌కు మోక్షం రాలేదు. రెండు టేకు చెట్లను నరుక్కునేందుకు అనుమతుల కోసం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీవీ పాలేనికి చెందిన విశ్రాంత ఉద్యోగి విఠల్‌రావు పడుతున్న అవస్థలివి. చివరకు ఆయన ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించారు. అటవీశాఖ కార్యాలయంలో డబ్బు లేనిదే ఏ పనులు జరగని తీరుపై ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు. రెండేళ్లుగా ఎంతో మందికి ఎన్నో అనుమతులు ఇచ్చిన అధికారులు తనను మాత్రం ఎందుకు తిప్పించుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ వాపోయారు. 


చేయితడిపితే వెంటనే అనుమతులు....

టేకు చెట్లు నరకటానికి ఒక్కో చెట్టుకు ఆన్‌లైన్‌ చలానా రూ.500 చెల్లించాలి. టీఎస్‌ఐసీ చట్టం ప్రకారం 15రోజుల నుంచి 43రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అదే వ్యక్తి ఒక్కో చెట్టు స్థానంలో మూడు మొక్కలు నాటితే రూ.450 తిరిగి శాఖ చెల్లిస్తుంది. కానీ అధికారులు మాత్రం చలానాతో పాటు వారి చేయితడిపితేనే అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో అనుమతికి రూ.25వేలు దండుకుంటున్నారని తెలుస్తోంది. ఇటు రైతుల నుంచి, అటు సామిల్‌ యజమానుల నుంచి రూ.వేలల్లో వసూళ్లు చేస్తున్నారని సమాచారం. ఇదే క్రమంలే నేరుగా పనులు చేయించుకోలేని రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. దీంతో అటు అధికారులకు ఇచ్చుకోవడమే కాకుండా.. దళారులకు కూడా మరింత డబ్బు వెచ్చించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. 


రెండు చెట్లకోసం ఇన్ని సంవత్సరాలా? విఠల్‌రావు, విశ్రాంత ఉద్యోగి, వీవీ పాలెం

రెండుచెట్లను నా ఇంటి అవసరాల కోసం నరుక్కునేందుకు అనుమతుల కావాల్సి వచ్చింది. కానీ రెండేళ్లుగా తిరగాల్సి వస్తోంది. వయసులో పెద్దవాడిని అని కూడా చూడకుండా తిప్పుతున్నారు. ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పినా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం అన్నిరకాల చలాన్లు చెల్లించినా అనుమతుల ఇవ్వడంలేదు. ఒక్కో అధికారి ఒక్కోరకంగా చెబుతున్నారు తప్ప పనిమాత్రం చేయటంలేదు. ఇప్పటికైనా అధికారులు కనికరించి సైజులు కోపించుకునేందుకు అనుమతులివ్వాలి. 


Updated Date - 2020-05-23T10:11:00+05:30 IST