పరిహారం చెల్లించరు..స్థలాలు అప్పగించరు

ABN , First Publish Date - 2020-11-23T03:43:22+05:30 IST

పేదల భూములు అక్రమంగా తమ గుప్పిట్లో పెట్టుకున్న సింగరేణి అధికారులు ఏళ్ల తరబడి బాధితుల గోడు పట్టించుకోవడం లేదు.

పరిహారం చెల్లించరు..స్థలాలు అప్పగించరు
సింగరేణి ఆధీనంలో ఉన్న బాధితుల స్థలం

-దళితుల భూములు సింగరేణి గుప్పిట్లో

-దశాబ్దాల కాలంగా బాధితుల ఎదురుచూపు

మంచిర్యాల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పేదల భూములు అక్రమంగా తమ గుప్పిట్లో పెట్టుకున్న సింగరేణి అధికారులు ఏళ్ల తరబడి బాధితుల గోడు పట్టించుకోవడం లేదు. దశాబ్దాల క్రితం సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్టు పేరిట సేకరించిన భూములకు ఇప్పటికీ పరిహారం చెల్లించకపోగా, స్థలాలు కూడా వెనక్కి ఇవ్వడం లేదంటూ బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్టు గని ఏర్పాటు కోసం సింగరేణి అధికారులు 2006 -2008 మధ్య కాలంలో స్థానిక రైతుల నుంచి వందల ఎకరాల భూమిని సేకరించారు. అధికారులు రైతుల నుంచి సేకరించిన భూములకు కొంత మేర నష్టపరిహారం చెల్లించినప్పటికీ మరి కొన్ని భూములను అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకున్నారని బాఽధితులు ఆరోపిస్తున్నారు. ఇందులో సుమారు 20 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికీ పరిహారం అందలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూనే ఉన్నామని, సింగరేణి అధీనంలో ఉన్న భూములను తిరిగి వెనక్కి ఇచ్చివేయాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై బాధితులు ఈ ఏడాది ఫిబ్రవరి 19న కలెక్టర్‌ట్‌ ఎదుట భూమి పత్రాలతో నిరసన సైతం తెలిపారు. అనంతరం భూములు ఇప్పించాలని కోరుతూ డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. 

బాధితుల ఆవేదన..

పలువురు బాధితులు తమకు అధికారులు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరు శ్రీరాంపూర్‌కు చెందిన దళిత వృద్ధురాలు(80) చల్లూరి రాజమ్మ తనగోడు వెళ్లబోసుకుంది. నస్పూర్‌ మండలం తీగల్‌పహాడ్‌ శివారులోని సర్వే నెంబర్‌ 75లో తన భర్త చల్లూరు మల్లయ్య పేరిట ఉన్న 4 ఎకరాలను స్వాధీనం చేసుకున్న సింగరేణి అధికారులు ఎకరాకు రూ. 10వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించారని వృద్ధురాలు తెలిపింది. ఆ భూమి పోను మిగిలిన మరో 1.01 ఎకరం స్థలాన్ని సైతం సింగరేణి అధికారులు అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకున్నారని, నేటికీ భూమి వెనక్కి ఇవ్వకపోగా నష్ట పరిహారం కూడా చెల్లించడంలేదని రాజమ్మ కన్నీరు మున్నీరు అవుతోంది. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కనికరించడంలేదని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.  అదే సర్వే నెంబర్‌లో ఎకరం భూమిని సింగరేణి అధికారులు తన సమ్మతి లేకుండానే లాక్కున్నారని ఎంబడి కుమారస్వామి అనే వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు. తన భూమిలో నుంచి 26 గుంటలను సేకరించామని చెబుతున్న అధికారులు తన నుంచి ఎలాంటి సంతకాలు, అనుమతి తీసుకోలేదని చెప్పా డు. పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ భూమి ఇవ్వకుండా, నష్టపరిహారమూ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. సర్వే నెంబరు 27లో తన మూడెకరాలను సంస్థ అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకుందని తిప్పని చంద్రయ్య అనే వ్యక్తి చెబుతున్నాడు. అదే సర్వే నంబర్‌లోని తనకు చెందిన 1. 18 ఎకరాల భూమిని అధికారులు అక్రమంగా తీసుకున్నారని కుదిరె చంద్రయ్య అనే వ్యక్తి ఆవేదనతో చెప్పాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. 

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు..

చల్లూరి రాజమ్మకు చెందిన 1. 01 ఎకరం భూమి విషయమై తక్షణమే సర్వే జరిపి, వెనక్కి ఇచ్చివేయాలని ప్రభుత్వ ఆదనపు కార్యదర్శి నరేందర్‌రావు 23-12-2019న కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ సురేందర్‌రావు సదరు భూమిని ప్రభుత్వపరంగా గుర్తించడంగానీ, దానికి ఎలాంటి అవార్డు ప్రకటించలేదని మంచిర్యాల ఆర్డీవోకు సూచిస్తూ పరిశీలించి, రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింగరేణి అధికారులు ఎంజాయ్‌మెంట్‌ సర్వేకు సహకరించడంలేదని పేర్కొంటూ భూ కొలతల విభాగం ఏడీ తిరిగి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వం ఆదేశించినా సింగరేణి అధికారులు స్పందించకపోవడం గమనార్హం. 


Updated Date - 2020-11-23T03:43:22+05:30 IST