Abn logo
Oct 30 2020 @ 04:33AM

సాయంలో.. న్యాయం

సర్వత్రా అదే డిమాండ్‌

అనేక ప్రాంతాలలో వరద బాధితుల ఆందోళనలు

కొన్ని చోట్ల గంటల పాటు..

ఆందోళన కార్యక్రమాలలో ఎక్కువగా మహిళలు

అధికారులను ఘెరావ్‌ చేస్తున్న నిరసనకారులు

కొన్ని చోట్ల సాయంత్రం దాకా ఆందోళనలు

అల్వాల్‌, ఆబిడ్స్‌లలో పొద్దుపోయిన తర్వాత కూడా

బోయినపల్లి, బండ్లగూడలో నిలిచిన ట్రాఫిక్‌

గుడిమల్కాపూర్‌లో ఘర్షణ.. మహిళకు గాయాలు

సర్దిచెబుతున్న ఎమ్మెల్యేలు


వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన సహాయం పంపిణీ కార్యక్రమం కొందరు స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధుల కారణంగా అర్హులకు చేరడం లేదు. చేరినా.. పూర్తిగా రావడం లేదు. అసలే వరద బీభత్సాన్ని చవిచూసి దెబ్బతిన్న వారిని కొందరు లీడర్ల కక్కుర్తి మరింత ఆవేదనకు లోను చేస్తోంది. అది కాస్తా ఆగ్రహంగా మారుతోంది. నిన్నా, మొన్నటి దాకా పంపిణీలో వివాదాలు చోటు చేసుకోవడం కనబడింది. ఇప్పుడు బాధితులు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారు. కార్పొరేటర్ల ఇళ్లను ముట్టడిస్తున్నారు. కొందరు స్థానిక నేతలు తమ అనుచరులు, బంధువులు, స్నేహితులకే ఆర్థిక సాయం ఇప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


రోడ్డెక్కిన వరద బాధితులు 


మన్సూరాబాద్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : వరదలతో నిత్యావసరాలు కోల్పోయిన తమకు రూ.10వేల తక్షణ సహాయాన్ని అందివ్వటం లేదని నిరసిస్తూ నాగోలు డివిజన్‌లోని అయ్యప్ప కాలనీ, మల్లికార్జుననగర్‌ కాలనీవాసులు బండ్లగూడ - మన్సూరాబాద్‌ ప్రధాన రోడ్డుపై సుమారు గంట పాటు ఆందోళన కొనసాగించారు. భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. పోలీసులు కల్పించుకొని మహిళలను పంపించి వేశారు. 


కార్పొరేటర్‌ ఇంటి ముందు బైఠాయింపు

చంపాపేట, అక్టోబర్‌ 29(ఆంధ్రజ్యోతి): చంపాపేట చౌరస్తా డిమార్టు ముందు సాగర్‌ ప్రధాన రహదారిపై రెడ్డికాలనీకి చెందిన బాధితులు రాస్తారోకో చేపట్టారు. కాలనీలో కొందరికి మాత్రమే పరిహారం ఇచ్చారన్నారు. 5 రోజులు నీటిలోనే గడిపామని తెలిపారు. పోలీసులు వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం బాధితులు కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి ఇంటి ముందు ఆందోళన కొనసాగించారు. 


రూ.10 వేలకు బదులు రెండున్నర వేలే..

కూకట్‌పల్లి, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : కూకట్‌పల్లి డివిజన్‌లో బాధితులకు రూ.10 వేలకు బదులు రూ.2,500 మాత్రమే ఇస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ‘‘మా ఇంట్లోకి వరద నీళ్లు వచ్చాయి. ఇప్పటికీ తేరుకోలేని స్థితిలో ఉన్నాం. వరద సాయం అందించడం లేదు’’ అని దయార్‌గూడ వాసి చాంద్‌బీ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 


వీవీనగర్‌ డివిజన్‌ ఆర్‌పీకాలనీలో..

వివేకానందనగర్‌కాలనీ, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : స్థానిక టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు అసలైన బాధితులకు నగదు అందించడం లేదని వివేకానందనగర్‌ డివిజన్‌ ఆర్‌పీకాలనీలో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్‌ పరిధిలోని ఆస్‌బెస్టా్‌సకాలనీ, హనుమాన్‌నగర్‌లో బాధితులు స్థానిక కార్పొరేటర్‌, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


కార్పొరేటర్‌ తీరుతో అపార్ట్‌మెంట్‌వాసుల ధర్నా

దిల్‌సుఖ్‌నగర్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : వరదసాయం అందించాలని కోరితే కార్పొరేటర్‌ దురుసుగా వ్యవహరించారని ఆగ్రహిస్తూ దిల్‌సుఖ్‌నగర్‌ కోదండరాంనగర్‌ అపార్ట్‌మెంట్‌వాసులు రోడ్డుపై బైఠాయించారు. అపార్ట్‌మెంట్‌లోని అందరికీ సాయం అందిస్తామని జీహెచ్‌ఎంసీ ఏఈ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 


మాదన్నపేటలో పెల్లుబికిన మహిళాగ్రహం 

సైదాబాద్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ సాయాన్ని దళారులు, సిబ్బంది పంచుకుంటున్నారని చంద్రయ్యహట్స్‌ మహిళలు మాదన్నపేటలోని జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దళారులు తమకు అనుకూలమైన వారికే డబ్బులు ఇస్తూ ప్రతి ఒక్కరి వద్ద రూ.3 వేలు కమీషన్‌ తీసుకుంటున్నారని తెలిపారు. 


ఆబిడ్స్‌లో రాత్రి వేళ ధర్నా 

మంగళ్‌హాట్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): గన్‌ఫ్రౌండీ డివిజన్‌ నేతాజీనగర్‌కు బాధితులు గురువారం రాత్రి 9 గంటలకు ఆబిడ్స్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం గేటు ఎదుట ధర్నా చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారి ధరమ్‌సింగ్‌ పది వేలలో రూ.5వేలు కమీషన్‌ అడుగుతున్నారని, ఇవ్వకపోవడంతో వరదసాయం ఇవ్వకుండా వెళ్లిపోయాడని ఆరోపించారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని శాంతింపజేశారు. 

అల్లాపూర్‌లో ఉద్రిక్తత

అల్లాపూర్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): భారీ సంఖ్యలో బాధితుల ఆందోళనతో వివేకానంద నగర్‌ వార్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నాయకులు తమకు అనుకూలమైన వారికే ఆర్థిక సాయం అందించారంటూ బాధితులు రాస్తారోకో కూడా నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలకు బదులు తమకు 5వేలే అందాయని శివాజీనగర్‌ వాసులు ఆరోపించారు.   

Kaakateeya

ఓల్డ్‌ బోయినపల్లిలో...

ఓల్డ్‌ బోయినపల్లి, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఓల్డ్‌ బోయినపల్లి అంజయ్య నగర్‌కు చెందిన మహిళలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు రవి కుమార్‌ గౌడ్‌, ప్రకా్‌షతో పాటూ ఇతర పార్టీల నాయకులు మహిళలకు మద్దతు తెలిపారు. 5 గంటల పాటు నిరసన కొనసాగడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. 

సాయం కోసం పడిగాపులు...

జవహర్‌నగర్‌, అక్టోబర్‌ 29(ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌ పరిధిలోని పాపయ్యనగర్‌, సుక్కమ్మ బస్తీ, ముత్తుస్వామికాలనీ, కేసీఆర్‌నగర్‌, గబ్బిలాల్‌పేట, గిరిప్రసాద్‌కాలనీ, దొండతోట, మార్వడిలైన్‌ ప్రాంతాల వాసులు వరద సాయం కోసం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మండుటెండలో పడిగాపులు కాశారు. కార్పొరేషన్‌ పరిధిలో 28 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ అక్కడికి ఎవరూ రాలేదు. మున్సిపల్‌ అధికారులు కూడా పట్టించుకోలేదు. కొన్ని డివిజన్‌లలో ముందుగా రూ. 10 వేలు ఇచ్చి తిరిగి 5 వేలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

కార్పొరేటర్‌ బంగారి దిష్టిబొమ్మ దహనం

కార్వాన్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం కార్పొరేటర్‌ బంగారి ప్రకాష్‌ తన వారికే అందిస్తున్నారని పలువురు బాధితులు ఆరోపించారు. వరదల్లో మునిగిన 300 కుటుంబాలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

Advertisement
Advertisement