Advertisement
Advertisement
Abn logo
Advertisement

వారంలో పరిహారం

వర్షానికి నష్టపోయిన రైతులందరికీ చెల్లిస్తాం

80శాతం సబ్సిడీపై శనగలు ఇప్పించేందుకు కృషి

మంత్రి బాలినేని వెల్లడి

మేదరమెట్ల, డిసెంబరు 1: అధిక వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతులందరికీ వారంలో పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కొరిశపాడు మండలంలో పర్యటించారు. దైవాలరావూరు, రావినూతల మధ్య వర్షానికి దెబ్బతిన్న మినుము పంటను, మేదరమెట్ల కొరిశపాడు మధ్య శనగ పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మంత్రి వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. దెబ్బతిన్న మినుమును తెచ్చి కాయలను వలిచి చూపించారు. పైకి చూడడానికి బాగానే ఉన్నప్పటికీ లోపల బూజు పట్టి ఉన్నాయన్నారు. వర్షం వలన ఊరకెత్తిన శనగ పంటను, నీరు పారడంతో మొలక ఎత్తకుండాపోయిన పొలాలను మంత్రికి చూపించారు. ప్రస్తుతం అదును దాటినందున శనగ తప్ప ఇతర పంటలు సాగు చేయలేమన్నారు. ఈ దృష్ట్యా 80శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు అందించాలని కోరారు. అనంతరం మంత్రి బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉన్నదన్నారు. ఎవ్వరూ అధైర్యపడొద్దని, అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శనగ విత్తనాల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 80శాతం సబ్సిడీపై ఇప్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన  కొరిశపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నష్టం అంచనాలను త్వరితగతిన నమోదు చేయాలని మంత్రి బాలినేని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ వెంకటమురళి, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ సీఈవో జాలిరెడ్డి, డీఆర్‌వో సరళావందనం, జేడీఏ శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, హార్టికల్చర్‌ ఏడీ నాగరాజు, ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి, జడ్పీటీసీ సభ్యుడు తాళ్లూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement