ఎకరాకు రూ.15 వేల పరిహారం

ABN , First Publish Date - 2021-07-27T07:42:37+05:30 IST

రాష్ట్రంలో భారీ వర్షాల కారణగా జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి..

ఎకరాకు రూ.15 వేల పరిహారం

  • విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ ఇవ్వాలి
  • పంట నష్టంపై తక్షణం అంచనా వేయాలి
  • రుణమాఫీ నిధులనూ విడుదల చేయాలి
  • సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ 
  • రేషన్‌ ద్వారా 9 రకాల సరుకులు ఇవ్వాలి: భట్టి


హైదరాబాద్‌/ఉప్పల్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి)/మధిరటౌన్‌: రాష్ట్రంలో భారీ వర్షాల కారణగా జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంటల బీమా అమలు కాకపోవడానికి సర్కార్‌ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.  పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, కొత్తగా పంటలు వేసుకునేందుకు రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ ఇవ్వాలన్నారు. తదుపరి పంటల నుంచైనా పంటల బీమా పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు తక్షణం రూ. లక్ష చొప్పున రైతులకు రుణమాఫీ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 


ఇదిలా ఉంటే సోమవారం కార్గిల్‌ విజయ్‌ దివ్‌సను పురస్కరించుకుని అమర జవాన్లకు ఎంపీ, పార్లమెంటరీ డిఫెన్స్‌ కమిటీ సభ్యుడైన రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. కాగా, ఏపీలో అమలు చేస్తున్నట్టుగా తెలంగాణలోనూ ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్ర మం చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. మరోవైపు.. రేషన్‌కార్డు లబ్ధిదారులకు 9 రకాల నిత్యావసరాలను అందించాలని ఖమ్మం జిల్లా మధిరలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాగా, ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన నిధుల్లో ఏ మేరకు ఖర్చు చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. కాగా, కేసీఆర్‌ నియంత పాలన అంతానికి నిరుద్యోగులు, విద్యార్థులు హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ఆయుధంలా వాడుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఓయూ లో తెలంగాణ నవ నిర్మాణ్‌ విద్యార్థి సేన (టీఎన్‌వీ ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు టీకే శివప్రసాద్‌ అధ్యక్షతన  నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. 

Updated Date - 2021-07-27T07:42:37+05:30 IST