15 రోజుల్లో రైతులకు పరిహారం

ABN , First Publish Date - 2020-10-25T06:49:07+05:30 IST

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు 15 రోజుల వ్యవధిలో పరిహారం అందించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ కె.వి.ఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

15 రోజుల్లో రైతులకు పరిహారం

5.5 కోట్ల నష్టాన్ని గుర్తించాం

జనవరిలో కరోనా వ్యాక్సిన్‌?

కలెక్టర్‌ చక్రధర్‌ బాబు


దొరవారిసత్రం, అక్టోబరు 24 : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు 15 రోజుల వ్యవధిలో పరిహారం అందించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ కె.వి.ఎన్‌ చక్రధర్‌బాబు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రంలో వైద్యసిబ్బందితో మాట్లాడారు. కొవిడ్‌-19 పరీక్షా ఫలితాలు వెంటనే రావడం లేదని ఆశా వర్కర్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం ఆయన స్థానిక రైతులతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో ఇప్పటి వరకు 5.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించినట్లు తెలిపారు.  రైతుల ఖాతాలో నేరుగా నష్టపరిహారం జమ చేస్తామన్నారు.  కొవిడ్‌-19 నిబంధనలు గ్రామాల్లో కూడా పాటిం చాలని, జనవరిలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని  తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు పద్మావతి, వ్యవసాయాధికారి కాంచన, ఆర్‌ఐ రమాదేవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


నేలపట్టు పక్షుల కేంద్రం సందర్శన

మండలంలోని విదేశీ విహంగాల విడిది కేంద్రమైన నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని కలెక్టర్‌ కె.వి.ఎన్‌ చక్రధర్‌ శనివారం సందర్శించారు. ఆయన సాయంత్రం నేలపట్టు వచ్చారు.  నేలపట్టు ప్రాముఖ్యతను స్థానిక వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ నిర్వహించే విషయమై ఇప్పుడే చెప్పలేమని స్థానిక విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పారు. కొవిడ్‌-19 నిబంధనలు ఎలా ఉంటాయో చూసి నిర్ణయిస్తామని తెలిపారు. నేలపట్టులో నిరుపయోగంగా ఉన్న టూరిజం భవనాలను వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. ఆయన వెంట స్థానిక తహసీల్దారు పద్మావతి, నేలపట్టు రేంజర్‌ రామకొండారెడ్డి, అధికారులు ఉన్నారు.

Updated Date - 2020-10-25T06:49:07+05:30 IST