వేగంతో పోటీ

ABN , First Publish Date - 2021-07-21T05:47:40+05:30 IST

స్కూల్లో ఆటలు బాగా ఆడేదాన్ని. కానీ మెడిసిన్‌లో చేరాక... చదువు తప్ప మరో ఆలోచనే ఉండేది కాదు. పుస్తకాలు, ల్యాబ్‌లు..

వేగంతో పోటీ

  • మెలికలు తిరిగిన సర్క్యూట్లు...  
  • దూసుకుపోయే కార్లు... స్పీడ్‌కు నిర్వచనం రేసింగ్‌.  
  • మగవాళ్లకే చమటలు పట్టించే ట్రాక్‌లో ఓ యువతి వేగంతో పోటీపడుతోంది. 
  • ఎంబీబీఎస్‌ చదివి... టాప్‌గేర్‌లో రేస్‌ కార్లను దూకిస్తున్న ఆ డాక్టరే శివానీ పృధ్వీ.


‘‘స్కూల్లో ఆటలు బాగా ఆడేదాన్ని. కానీ మెడిసిన్‌లో చేరాక... చదువు తప్ప మరో ఆలోచనే ఉండేది కాదు. పుస్తకాలు, ల్యాబ్‌లు... వీటితోనే సరిపోయేది. మాది బెంగళూరు. కర్ణాటకలోని ధార్వాడ్‌ ఎస్‌డీఎం మెడికల్‌ కాలేజీలో ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తయింది. గ్రామీణ ప్రాంతంలో డాక్టర్‌గా పోస్టింగ్‌ వేశారు. మోటర్‌ స్పోర్ట్స్‌పై మనసు ఎప్పుడు మళ్లిందంటే... అది 2018. కాలేజీకి సెలవులు. ఇంటికి వెళ్లాను. పరీక్షల ఒత్తిడి. దాని నుంచి కాస్త ఉపశమనం కావాలనిపించింది. ఇంట్లో రేస్‌ కార్‌ ఉంది. ఆ కారు తీసుకెళ్లి రేసింగ్‌ నేర్చుకొంటానని మా నాన్న పృథ్వీని అడిగాను. ఎంతో సంతోషపడ్డారు. ఆయన బెంగళూరులో ఒకప్పుడు పేరున్న రేసర్‌. ప్రస్తుతం ఔత్సాహికులకు శిక్షణనిస్తున్నారు. తన కూతుర్ని రేసర్‌గా చూడాలనేది నాన్న కోరిక. కానీ దాన్ని బలవంతంగా నాపై రుద్దాలనుకోలేదు. అందుకే నేను అడగ్గానే ఓకే అనేశారు. 


ఆ క్షణమే నిర్ణయించుకున్నా...  

నాన్నను వెంటబెట్టుకుని కారు బయటకు తీశాను. నాలుగైదు రౌండ్లు వేశాను. ఆ తరువాత నుంచి ప్రతి రోజూ మా ఫ్యాక్టరీ కాంపౌండ్‌లో సాధన. ఇలాగే కొనసాగిస్తే తప్పకుండా రేస్‌లో పోటీపడే స్థాయికి ఎదుగుతావని అప్పుడు నాన్న చెప్పారు. ఆ క్షణమే రేసర్‌ను కావాలని నిర్ణయించుకున్నా. అదే సంవత్సరం చెన్నైలో జరిగిన ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ స్పీడ్‌’లో పోటీపడ్డా. మహిళల విభాగంలో రెండో స్థానం వచ్చింది. నా మొట్టమొదటి పోడియం అది. ఇంటికి తిరిగి వెళుతుండగా ‘ఫోక్స్‌ వ్యాగన్‌ మోటర్‌ స్పోర్ట్స్‌’ వారి ‘అమియో కప్‌’ సెలక్షన్లు జరగనున్నాయన్న వార్త చూశాను. వెంటనే ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ పంపించాను. రేసింగ్‌లో నా ఆసక్తి చూసి నాన్న చాలా సంబరపడ్డారు. 


గోకార్టింగ్‌కు వెళ్లి... 

రేస్‌ కార్లను నడపడమే పెద్ద పరీక్ష. అలాంటిది వాటితో ట్రాక్‌లో పోటిపడడమంటే సామాన్యం కాదు. నాన్న నాకు అదే చెప్పారు. ఏదో కాలక్షేపానికి కాకుండా విజయమే అంతిమ లక్ష్యం కావాలన్నారు. దాని కోసం నన్ను బెంగళూరులోని గోకార్టింగ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సాధన చేయించారు. ప్రముఖ రేసర్‌ జోయల్‌ జోసఫ్‌కు పరిచయం చేశారు. ఆయన నాకు రేసింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. జోసఫ్‌ ఆధ్వర్యంలో చెన్నైలో శిక్షణ మొదలైంది. తరువాత భారత లొలి మహిళల రేసింగ్‌ టీమ్‌... ‘అహురా రేసింగ్‌’లో చేరాను. 


సెలక్షన్‌ కోసం పుణెకి... 

పూర్తిగా సన్నద్ధమై ‘అమియో కప్‌’ సెలెక్షన్స్‌ కోసం పుణే వెళ్లాను. మా అమ్మ, నాన్న కూడా నా వెంట వచ్చారు. మొత్తం 300 మంది రేసర్లు పాల్గొంటే... అందులో 25 మంది ఫైనల్‌ రౌండ్‌కు ఎంపికయ్యారు. వారిలో నేనూ ఉన్నాను. చివరకు రేస్‌లో టాప్‌ 20లో నిలిచాను. ఆ రేస్‌ నాకు ఎంతో అనుభవా న్నిచ్చింది. పెద్ద పెద్ద రేసర్లు పోటీకి ఎలా సన్నద్ధవవుతారో ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. ఆ స్ఫూర్తితో మరింత కసిగా సాధన చేశాను. ఈ మధ్య నిర్వహించిన 50 కిలోమీటర్ల స్ర్పింట్‌ రేస్‌లో సెకండ్‌ రన్నరప్‌గా వచ్చాను. 


అమ్మతో కలిసి ట్రోఫీ... 

కొన్ని రేసుల్లో నేవిగేటర్‌ అవసరం ఉంటుంది. దానికి ఎవరని వెతుకుతుంటే... నేనున్నానంటూ అమ్మ దీప్తి ఉత్సాహం చూపించింది. ఒక్క క్షణం నాకేమీ అర్థంకాలేదు. తను కూడా డాక్టర్‌. మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌. అప్పుడు ‘ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ చాంపియన్‌షిప్‌’ (ఐఎన్‌ఆర్‌సీ) జరుగుతోంది. నేనా అమెచ్యూర్‌ని. అనుభవమనున్న ఓ నేవిగేటర్‌ను అడిగాను. అతను కుదరదన్నాడు. దాంతో అమ్మనే తీసుకువెళ్లా. వేగాన్ని అంచనా వేయడం, మార్గంలో రాబోయే ఇబ్బందుల గురించి అప్రమత్తం చేయడం, టర్నింగ్‌ల్లో ప్రమాదం జరగకుండా సూచనలివ్వడం వంటివన్నీ అమ్మ నా కోసం నేర్చుకుని, రేస్‌లో సహకరించింది. అనూహ్యంగా కుదిరిన మా జోడీ సత్ఫలితాలనిచ్చింది. 2019లో జరిగిన ‘ఐఎన్‌ఆర్‌సీ’ మహిళల విభాగంలో టైటిల్‌ సాధించాం. 


పోడియం ఫినిష్‌లు ఎన్నో... 

అమ్మతో కలిసి ఇప్పటివరకు చాలా రేస్‌ల్లో పోడియం ఫినిష్‌లు సాధించాను. ఇండోనేషియాలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ఏషియా ఆటో జింఖానా చాంపియన్‌షిప్‌’లో పాల్గొన్న తొలి భారత మహిళను నేనే. అందులో ఓవరాల్‌గా నాలుగో స్థానం వచ్చింది. కోయంబత్తూర్‌ ‘కారి మోటర్‌ స్పీడ్‌వే’లో ఈ ఏడాది నిర్వహించిన గ్రాండ్‌ ప్రిలో థర్డ్‌ రన్నరప్‌ దక్కించుకున్నాను. ఆ రేస్‌ నాకు పెద్ద సవాలే విసిరింది. సాధారణంగా రేస్‌లో 20 నుంచి 30 ల్యాప్‌లు ఉంటాయి. కానీ అందులో 50 ల్యాప్‌లు పూర్తి చేయాలి. రేసర్‌గా రాణించాలంటే ఫిట్‌నెస్‌ నుంచి కార్‌ని కండిషన్‌లో పెట్టడం వరకు ప్రతిదీ ముఖ్యమే. అదేసమయంలో ఒక రేస్‌ కారుని సన్నద్ధం చేసుకోవడం కోసం దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇంకా గ్లవ్స్‌, హెల్మెట్‌, సూట్‌... ఇలా ఎంతో వ్యయంతో కూడుకున్నది. స్పాన్సర్లు లేకపోతే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కష్టమవుతుంది. ఇక లాక్‌డౌన్ల తరువాత మళ్లీ రేసింగ్‌ సీజన్‌ ఆరంభమైంది. ట్రాక్‌లో నా కారుని దూకించడానికి సిద్ధమవుతున్నా.’’


ప్రమాదాలు ఎదురైనా...

రేసింగ్‌ అంటేనే పెద్ద సాహసం. ప్రమాదాలతో సహవాసం. సవాళ్లు... సమస్యలు... ఇక్కడ సాధారణం. రేస్‌లో నా కారు పల్టీలు కొట్టిన సందర్భాలున్నాయి. ప్రమాదాలు, గాయాల పాలైన రోజులూ ఉన్నాయి. కోయంబత్తూర్‌లో ఒకసారి కారు బోల్తాకొట్టింది. డోర్‌ మధ్యలో పడి అమ్మ వేలు కట్‌ అయింది. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే ఆమె భయపడకపోవడం. వెంటనే సీటు బెల్టు తీసేసి, కారులో నుంచి బయటపడింది. వెనక వచ్చే కార్లకు ఇబ్బంది లేకుండా హెచ్చరిక బోర్డు పెట్టింది.

Updated Date - 2021-07-21T05:47:40+05:30 IST