‘కాఫీ డే’ కోసం పోటీ...

ABN , First Publish Date - 2022-01-14T22:10:49+05:30 IST

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ... సికల్ లాజిస్టిక్స్‌ను దక్కించుకునే క్రమంలో అనూహ్యమైన పోటీ నెలకొంది.

‘కాఫీ డే’ కోసం పోటీ...

బెంగళూరు : కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ... సికల్ లాజిస్టిక్స్‌ను దక్కించుకునే క్రమంలో అనూహ్యమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో... నాలుగు సంస్థలు బిడ్‌ దాఖలు చేశాయి. వీటిలో... యాంబే మైనింగ్, ప్రిస్టిన్ మాల్వా లాజిస్టిక్స్ సంస్థలు ఎక్కువ కోట్‌ చేసినట్లు వినవస్తోంది. మరో ఇద్దరు బిడ్డర్లు... అగ్రిగో ట్రేడింగ్, విన్‌విండ్ పవర్ ఎనర్జీ సంస్థలు. సికల్ మీద 26 సంస్థలు ఆసక్తి చూపించినప్పటికీ, ఈ నాలుగు కంపెనీలు మాత్రమే రిజల్యూషన్ ప్లాన్లు సమర్పించాయి.


సంస్థ ప్రమోటర్ సిద్ధార్ధ హెగ్డే... 2019 జులైలో మరణం తర్వాత... కంపెనీ పరిస్థితి దిగజారింది. అప్పులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో... రుణదాతలు చట్టప్రకారం దీనిని అమ్మకానికి పెట్టాయి. దాదాపు రూ. 1,561 కోట్లుగా చెబుతున్న అప్పుల్లో కనీసం పావలా వంతయినా రాబట్టాలని ఆ సంస్థలు భావిస్తున్నట్లు వినవస్తోంది. కంపెనీ, రుణదాతల మధ్య రుణ-పునరుద్ధరణ పథకంపై (డెట్‌-రీకాస్ట్‌ స్కీమ్‌) జరిగిన చర్చలు విఫలం కావడంతో, దివాలా ప్రక్రియకు 2021 మార్చిలో సికల్ లాజిస్టిక్స్ అంగీకరించింది. తన అనుబంధ సంస్థ అవసరాలు తీర్చడానికి ‘కాఫీ డే’ కూడా 2019 మార్చి వరకు రూ. 281 కోట్లను అసురక్షిత రుణాలుగా అందించింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినపక్షంలో... కాఫీ డే రుణభారం తగ్గుతుంది. ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 1.07 గంటల  సమయానికి కాఫీ డే షేర్లు 1.70 % పడిపోయి, రూ. 54.90 వద్ద ట్రేడవుతున్నాయి.


ప్రిస్టైన్‌ లాజిస్టిక్స్ & ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ గ్రూప్ కంపెనీ అయిన ప్రిస్టైన్ మాల్వా... రైల్‌ లాజిస్టిక్స్(మైనింగ్) వ్యాపారం చేస్తోంది. ముప్ఫై  ఏళ్లుగా బొగ్గు తవ్వకాలు, రవాణా వ్యాపారాల్లో ఉంది. బల్క్, కంటెయినరైజ్డ్ కార్గో పోర్ట్ టెర్మినల్స్ కోసం మల్టీ-మోడల్ లాజిస్టిక్స్, పోర్ట్ హ్యాండ్లింగ్, ట్రక్కింగ్, వేర్‌హౌసింగ్, షిప్ ఏజెన్సీ, కస్టమ్‌హౌస్ ఏజెన్సీ, ఆఫ్‌షోర్ సప్లై లాజిస్టిక్స్, రిటైల్ లాజిస్టిక్స్‌లనుకూడా సికల్ నిర్వహిస్తోంది.

Updated Date - 2022-01-14T22:10:49+05:30 IST