బస్తీ మే సవాల్

ABN , First Publish Date - 2020-12-01T07:30:29+05:30 IST

ఓటర్లకు కొందరు డబ్బులు పంచుతున్నారు.. అదేపని చేస్తున్న మరొకరిని వారే అడ్డుకుంటున్నారు! ఎదుటివారూ అంతే. పైసలు, మద్యం బాజాప్తాగా పంచుతూనే మీరెలా పంచుతారంటూ ప్రశ్నిస్తున్నారు! దీంతో ఆ వర్గాల మధ్య మాటా మాటా పెరుగుతోంది. కొట్లాటలు, కుస్తీలతో గల్లీల్లో హీట్‌ పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకుగాను ఆయా పార్టీల కార్యకర్తలు

బస్తీ మే సవాల్

పోటాపోటీగా డబ్బు పంపిణీ.. అడ్డగింతలు.. బస్తీలు, కాలనీల్లో ఉద్రిక్తతలు, బాహాబాహీ

చివరి అంకంలో పార్టీలు ఢీ అంటే ఢీ.. ఓటుకు రూ.500 నుంచి 5000 దాకా పంపిణీ

బోనస్‌గా ఫుల్లుగా మద్యం, మాంసంతో విందు

చోటామోటా లీడర్లు, కార్యకర్తల ద్వారా ఇళ్ల వద్దకే

గంపగుత్తగా ఓట్లకు బల్క్‌గానే ఆఫర్‌?

కాలనీ సంఘాలకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు

ద్విముఖ పోటీ స్థానాల్లో మరింత పోటాపోటీగా 

డ్వాక్రా సంఘాలకు రూ.5లక్షల నుంచి 10 లక్షలు

డబ్బు, మద్యం పంపిణీపై పార్టీల పరస్పర ఆరోపణలు 

కొన్నిచోట్ల గొడవలు.. టీఆర్‌ఎస్‌ను అడ్డుకున్న బీజేపీ 

పలుచోట్ల బెల్ట్‌షాపులపై దాడి

వాహనాల్లోనూ పట్టుబడ్డ మద్యం

అభ్యర్థులకు తలా 3 కోట్ల నుంచి 5 కోట్ల దాకా ఖర్చు


హైదరాబాద్‌ / హైదరాబాద్‌ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఓటర్లకు కొందరు డబ్బులు పంచుతున్నారు.. అదేపని చేస్తున్న మరొకరిని వారే అడ్డుకుంటున్నారు! ఎదుటివారూ అంతే. పైసలు, మద్యం బాజాప్తాగా పంచుతూనే మీరెలా పంచుతారంటూ ప్రశ్నిస్తున్నారు! దీంతో ఆ వర్గాల మధ్య మాటా మాటా పెరుగుతోంది. కొట్లాటలు, కుస్తీలతో గల్లీల్లో హీట్‌ పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకుగాను ఆయా పార్టీల కార్యకర్తలు ఎక్కడికక్కడ మోహరించడంతో ‘బస్తీ మే సవాల్‌’ అన్నట్లుగా వాతావరణం ఒకింత ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓట్లను కొనేందుకు పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీశారు.


ఓటుకు రూ.500 నుంచి రూ.5000 వేల దాకా పంపిణీ చేస్తున్నారు. బస్తీల్లోని జనమే కాకుండా మధ్య తరగతి ప్రజలను ‘ప్రభావితం’ చేసేందుకు పోటీపడుతున్నారు. అయితే ఈ ఓట్ల కొను‘గోల’ గుట్టును పరస్పరం ఆయా పార్టీల కార్యకర్తలే చాలా చోట్ల బయటపడేసుకొని రోడ్డున పడుతున్నారు. ఒకరినొకరిని అడ్డుకొని బాహాబాహీకి దిగుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని కొన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండగా.. కొన్నిచోట్ల టీఆర్‌ఎస్‌, బీజేపీ ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీపడుతున్నాయి.


ద్విముఖ పోటీ ఉన్న డివిజన్లలో అభ్యర్థులు, పరస్పరం చిత్తు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఓటర్ల కార్డులు జిరాక్స్‌ తీసుకుని మరీ డబ్బులిస్తున్నారు. బేగంపేట డివిజన్‌లో ఆదివారం రాత్రి ఒక బస్తీలో అదికార పార్టీకి చెందిన ఓ నాయకుడు డబ్బులు పంచుతున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ నేతలు అక్కడకు వెళ్లగానే వారిని చూసి సదరు నాయకుడు పరారయ్యాడు. మరో బస్తీలో మరో పార్టీ సైతం అధికార పార్టీ నేతలు వెళ్లిన బస్తీలకు తన మనుషులను పంపి వారు పంచిన విలువకు సగం డబ్బును పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇలా రెండు ప్రధాన పార్టీల నేతలు బస్తీల నేతలనే లక్ష్యంగా చేసుకుని ప్రలోభ రాజకీయాలను నడిపించాయి. సనత్‌నగర్‌ డివిజన్‌లో అధికార పార్టీకి పోటీగా బీజేపీ, బస్తీలను చుట్టేసినట్లు ప్రచారం ఉంది.


ఏ బస్తీకి వెళ్లినా బీజేపీ వారు వచ్చి వెళ్లారనే సమాచారం అధికార పార్టీ నాయకులకు అందడంతో వారు కూడా ఆయా బస్తీలకు రాత్రి వేళ లో వెళ్లి తమకు తోచిన విధంగా ఇచ్చుకుంటూ వారిని  ఖుషీ చేశారు. అమీర్‌పేట డివిజన్‌లో కూడా ఇరు ప్రధాన పార్టీల నేతలు బస్తీల్లో తమ అనుచరుల ద్వారా పంపిణీ దారాపు పూర్తి చేసినట్లు తెలిసింది. డబ్బులిచ్చే క్రమంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పక్కా ప్లాన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులు ఏఏ డివిజన్లలో ఎంతెంత పంచారో వివరాలను తెలుసుకుని, అందుకు రూ.500 అధికంగా పంపిణీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ కండువా వ్యక్తులు వచ్చి నా.. కార్లు, బైక్‌లలో బస్తీలు, కాలనీలోకి వచ్చినా.. బీజేపీ కార్యకర్తలు ఆ వాహనాలను చుట్టుముట్టి అడ్డుకున్నారు.  


టీఆర్‌ఎస్‌ నేత ఇంట్లో మద్యం బాటిళ్లు 

చైతన్యపురి డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ది జిన్నారం విఠల్‌రెడ్డి అనుచరుడు, టీఆర్‌ఎస్‌ నేత గట్టు శ్రీనివాస్‌ ఇంట్లో  ఎనిమిది కాటన్ల మద్యం పట్టుబడింది. బీజేపీ శ్రేణుల  ఫిర్యాదుతో ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, చైతన్యపురి పోలీసులతో ప్రభాత్‌నగర్‌లోని శ్రీనివాస్‌ ఇంట్లో తనిఖీలు జరిపారు.  కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాస్‌ ఇంట్లో లేకపోవడం, కారు తాళాలు తీసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో బీజేపీ నేతలు మూడు గంటలు ఆందోళన చేశారు. అనంతరం కారు తాళాలు తీయడంతో రెండు కాటన్ల మద్యం, మరో గదిలో ఆరు కాటన్ల మద్యం దొరికింది.  గడ్డిఅన్నారం డివిజన్‌లో ప్రచారానికి వచ్చిన పొరుగు నేతలు శనివారం రాత్రి కోదండరామ్‌నగర్‌లోని ఆలయం వద్ద డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ నేతలు పట్టుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.


బంజారాహిల్స్‌, మంగళ్‌హాట్‌ ప్రాంతాల్లో బెల్ట్‌షాపులపై  పోలీసులు దాడి చేసి నలుగురు నిర్వాహకుల నుంచి రూ.లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారాసిగూడ ప్రాంతానికి చెందిన బొడ్డుల కృష్ణ, అశోక్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ గౌసుద్దీన్‌ నివాసాల్లో పోలీసులు రూ.65 వేల విలువైన, ఛత్రినాకకు చెందిన శ్రీను ఇంట్లో రూ.70 వేల మద్యం పట్టుకున్నారు. హయత్‌నగర్‌లో సాగ రాజేందర్‌రెడ్డి కార్లో మద్యం తరలిస్తూ దొరికిపోయాడు. లింగం సందీప్‌ కుమార్‌, ఎల్క మధుసుదర్‌ రెడ్డి భారీగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. కిరణ్‌ కుమార్‌, శ్రీకాంత్‌ అనే వ్యక్తులు బైక్‌పై 52 బాటిళ్ల మద్యం తరలిస్తూ దొరికిపోయారు. 


అపార్ట్‌మెంట్‌ వాసులకూ డబ్బు

ఈసారి డబ్బు పంపిణీ బస్తీల నుంచి మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కాలనీలు, అపార్ట్‌మెంట్లకు పాకింది. ఓటుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించటానికి ఒక్కో పార్టీ సిద్ధంగా ఉన్నట్లు పలు కాలనీ, అపార్ట్‌మెంట్ల అసోసియేషన్ల బాధ్యుల నుంచి అక్కడి ఓటర్లకు సందేశాలు అందాయి. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు మొదట ఎక్కువ డబ్బు ఖర్చుకు సిద్ధమని చెప్పి, చివరి నిమిషంలో చేతులు ఎత్తేయటంతో అధిష్ఠానమే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అన్ని పార్టీలు కూడా డబ్బు పంపిణీకి స్థానిక నేతలపైనే ఆధారపడ్డాయి. కాకపోతే, డబ్బు పంపిణీ తీరు, అనుకున్న నగదు ఓటర్లకు చేరిందా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షిస్తున్నాయి. ఇక బస్తీల్లో మద్యం ఏరులై పారుతోంది. గడిచిన రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల పైబడి మద్య నిల్వలు అమ్ముడుపోయాయి. దీనికిముందే రెండు, మూడు రెట్ల మొత్తంలో మద్యం నిల్వలు నగరం నలుమూలలకు చేరినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎ్‌సకు కొమ్ము కాస్తోందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడిని విపక్షాలు తీవ్రం చేశాయి. సోమవారం బీజేపీ ఏకంగా ఎస్‌ఈసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. 


కలిసొచ్చిన కార్తిక పున్నమి

నగరంలో పని చేయందే పూట గడవని బస్తీవాసులకు సెలవనేదే ఉండదు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే రూ.500 నుంచి రూ.1000 దాకా కూలీ ఇస్తారు. అయితే సోమవారం కార్తిక పున్నమి రోజు వారు పనులు మానుకొని ఇంట్లోనే ఉన్నారు. ఆయా పార్టీలకు చెందిన వారంతా ఇళ్ల వద్దకే వచ్చి పోటాపోటీగా డబ్బులు ఇవ్వడమే కాదు.. మద్యం, మాంసం కూడా ఇవ్వడంతో పండుగ చేసుకున్నారు. నగరంలో 150 ప్రాంతాల్లో కూలీల అడ్డాలు ఉండగా శివారు ప్రాంతాల్లో మినహా మిగతావన్నీ బోసిపోయాయి. కొన్నిచోట్ల ఉన్నత, ఉద్యోగ కుటుంబాల వారు కూడా పార్టీలు పంచే డబ్బు కోసం ఎదురుచూడటం విశేషం. 


అందరి నుంచీ డబ్బులు..ఓటు ఎవరికి?

ఏ పార్టీ కార్యకరక్తలు వచ్చి డబ్బిచ్చినా ఓటర్లు కాదనకుండా తీసుకుంటుడటం విశేషం. ఉప్పల్‌ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ రూ.1000 చొప్పు న పంచుతుండగా ప్రతిపక్షాలు కొన్ని చోట్ల రూ. 1000 చొప్పున, మరికొన్ని చోట్ల రూ.500 చొప్పున పంపిణీ చేశారు. మూడు పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్న ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి.. మా దగ్గర ఇంత ఇస్తున్నారు? మీ దగ్గర ఎంత ఇస్తున్నారు? అని ఆరా తీస్తున్నారు. ఇక నగరంలోని డ్వాక్రా మహిళా సంఘాలకు రెండు రోజుల నుంచే ఖాతాల్లో డబ్బులు పడిపోయాయి. కొన్ని డివిజన్లలో ఒక డ్వాక్రా సంఘానికి రూ.20వేల నుంచి రూ.60 వేల వరకు ఇవ్వగా, మరికొన్ని డివిజన్లలలో ఒక్కో సంఘానికి రెండు నుంచి రూ.5లక్షలు, రూ.10లక్షలు కూడా ఇస్తున్నారు. 



కొన్ని చోట్ల ఓటర్ల డిమాండ్‌

‘మా కాలనీ ఓట్లన్నీ మీకే.. మా కాలనీ సంక్షేమ సంఘానికి ఏమిస్తారు? మా కులం ఓట్లన్నీ మీకే.. మా కుల సంక్షేమ నిధికి ఎన్ని లక్షలు ఇస్తారు? మా కాలనీలో ప్రార్థనా మందిరం నిర్మాణానికి ఎంతిస్తారో చెప్పండి? మా కాలనీ ఓట్లన్నీ మీకే వేస్తాం..!’ అంటూ స్థానికులు అభ్యర్థులతో స్థానికులు బేరసారాలకు దిగుతున్నారు. ఈ డిమాండ్‌లకు అభ్యర్థులు వెనుకాడటం లేదు. ఓట్లను గంపగుత్తగా వేయించుకుంటే పని తేలికవుతుందని, కాలనీ సంఘాలు అడిగిన వాటికి ఓకే చెబుతున్నారు. ఓటుకు రూ.1000 చొప్పున పంచే బదులు గంపగుత్తగా అయితే ‘గిట్టుబాటు’ అవుతుందనుకుని కాలనీ సంఘాలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ముట్టజెబుతున్నారు.


ఇలా ఒక్కొక్క అభ్యర్థి.. కాలనీల అవసరాల కోసం రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం 10 డివిజన్‌లోని చందానగర్‌, శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, వివేకానందనగర్‌ ప్రాంతాల్లో ఈ తరహా పరిస్థితి ఉంది. శేరిలింగంపల్లి, చందానగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల చోటమోట నేతలను కొనేందుకు బేరసారాలు జరిగాయి. ఇక అపార్ట్‌మెంట్లకు రంగులు, భారీ గేట్లు వంటివాటికి కమిట్‌మెట్లు ఇచ్చి ఓట్లు కొంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మొదట్లో ఖర్చు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు అనుకున్నారు. చాలామంది ఇప్పటికే రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం.  

Updated Date - 2020-12-01T07:30:29+05:30 IST