రాయచోటి సీఐపై హైకోర్టుకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-12-03T04:47:14+05:30 IST

రాయచోటి మండలం గరుగుపల్లెకు చెందిన ఇడగొట్టు రామ్మోహన్‌ (35)ను రాయచోటి అర్బన్‌ సీఐ రాజు మూడు రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉంచి హింసిస్తున్నాడంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్లు ప్రజా సంఘాల నాయకులు తెలియజేశారు.

రాయచోటి సీఐపై హైకోర్టుకు ఫిర్యాదు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ప్రజాసంఘాల నాయకులు

రాయచోటి, డిసెంబరు 2: రాయచోటి మండలం గరుగుపల్లెకు చెందిన ఇడగొట్టు రామ్మోహన్‌ (35)ను రాయచోటి అర్బన్‌ సీఐ రాజు మూడు రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉంచి హింసిస్తున్నాడంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్లు ప్రజా సంఘాల నాయకులు తెలియజేశారు. గురువారం స్థానిక ఓపీడీఆర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గరుగుపల్లెకు చెందిన రామ్మోహన్‌ అనే యువకుడిని రాయచోటి అర్బన్‌ సీఐ రాజు గత నెల 30వ తేదీ అదుపులోకి తీసుకుని మూడు రోజులు కావస్తున్నా ఇంతవరకు అతనిని కోర్టు ఎదుట హాజరు పర్చకుండా అక్రమ నిర్బంధంలో ఉంచుకున్నాడని ఆరోపించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికల్లో రామ్మోహన్‌ తల్లి లీలావతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. దీంతో కక్షగట్టిన చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి వరద బాధితుల నష్టపరిహారం పంపిణీ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సాకు చూపి పోలీసులను పూరమాయించి రామ్మోహన్‌తో పాటు ఐదుగురు గరుగుపల్లె యువకులపై ఐపీసీ సెక్షన్లు 353, 341, 506 ప్రకారం అక్రమ కేసు బనాయించారన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా రాయచోటి అర్బన్‌ సీఐ వ్యవహరిస్తూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.  సమావేశంలో ఓపీడీఆర్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు రామాంజనేయులు, విద్యావంతుల వేదిక నాయకుడు జీవానందం, మారుతీశంకర్‌, రామ్మోహన్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-03T04:47:14+05:30 IST