Abn logo
Oct 22 2021 @ 23:53PM

పారదర్శకత లేని పునర్విభజన

సమావేశంలో రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్న కమిషనర్‌

తప్పుడు సమాచారంతో ఎన్నికలకు..

బుజబుజనెల్లూరు ఓటర్లు వెంకటేశ్వరపురంలోనా..!

టీడీపీ, సీపీఎం ఆరోపణ

కార్పొరేషన్‌ ఎన్నికల సమావేశం నుంచి వాకౌట్‌ 

సాంకేతికతతో సరిచేస్తాం: కమిషనర్‌ 


నెల్లూరు (సిటీ), అక్టోబరు 22 : నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్‌ అధికారులు రాజకీయ పార్టీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. కార్పొరేషన్‌ కార్యాలయంలో కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ నేతృత్వంలో అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీ, డివిజన్లకు అతీతంగా ఓటర్ల మార్పు వంటి తప్పిదాలపై టీడీపీ, సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేసి సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం ఆ పార్టీల నాయకులు ఉచ్చి భువనేశ్వరీప్రసాద్‌, మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కార్పొరేషన్‌ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. డివిజన్ల పునర్విభజనలో పారదర్శకతే లేదని తప్పుపట్టారు. ఈ తంతు ఏకపక్షంగా జరిగిందని, మున్సిపల్‌ సిబ్బంది అఽధికార పార్టీకి కార్యకర్తల్లా పని చేశారన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బుజబుజనెల్లూరుకు చెందిన ఓటర్లు వెంక టేశ్వరపురంలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా ఓటర్లను డివిజన్లు మార్చారని విమర్శించారు. ఇన్ని తప్పిదాలు పెట్టుకుని అటు ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల సంఘానికి అంతా బాగుందని ఎలా చెప్తారని నిలదీశారు. నగరంలో జీరో డోర్‌ నెంబర్లతో ఏకంగా 9 వేల ఓట్లు ఉండగా, మరో 6 వేల ఓట్లు ఒకే డోర్‌ నెంబర్లు, మరణించిన వారివి ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు అశాస్త్రీయంగా ఉన్నాయని దుయ్యబట్టారు. టీడీపీ నుంచి ధర్మవరం సుబ్బారావు, సత్యనాగేశ్వరరావు, కప్పిర శ్రీనివాసులు, జలదంకి సుధాకర్‌, సీపీఎం నుంచి మూలం రమేష్‌, బత్తల క్రిష్ణయ్య, కత్తి శ్రీనివాసులు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. 

సాంకేతికతతో సరిచేస్తున్నాం : కమిషనర్‌ 

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ తెలిపారు. అన్ని తప్పిదాలను పరిగణలోకి తీసుకుని నూరు శాతం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని ప్రతి ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. అందరి అభ్యంతరాలను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి పరిష్కరిస్తామని కమిషనర్‌ స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితాలోని తప్పిదాలను వివరిస్తున్న టీడీపీ నేత ఉచ్చి


త్వరలో యాప్‌

కార్పొరేషన్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నౌ యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌ పేరుతో త్వరలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమిషనర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందితో శుక్రవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నూతన యాప్‌ ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారం సులువుగా అందుబాటులో ఉంటుందన్నారు. పోలింగ్‌ స్టేషన్లు, ఓటర్ల వివరాలు తదితర అంశాలన్నీ యాప్‌లో నిక్ష్లిప్తం చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది బాధ్యతగా  పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీ చంద్రుడు, కార్యదర్శి హేమావతి, మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఎన్నికలకు అధికారుల కేటాయింపు 

అదనపు ఎన్నికల అథారిటీగా కమిషనర్‌ 

నెల్లూరు నగర పాలక సంస్థకు త్వరలో నిర్వహించబోయే ఎన్నికలకు అధికారుల ను కేటాయిస్తూ కార్పొరేసన్‌ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. దాని ప్రకారం కమిషనర్‌ అదనపు ఎన్నికల అథారిటీగా వ్యవహరించున్నారు. లైజనింగ్‌ అధికారిగా కార్పొరేషన్‌ మేనేజర్‌ ఆర్‌ రాజేంద్రప్రసాద్‌ కొనసాగనున్నారు. ఎలక్షన్‌ సెల్‌ను డీసీ చంద్రుడు, సిబ్బంది, శిక్షణ వ్యవహరాలను మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌, పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాలను డీసీపీ క్రష్ణప్రసాద్‌, నామినేషన్ల ప్రక్రియ, ఇతర అంశాలను కార్యదర్శి హేమావతి, బ్యాలెట్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌ వ్యవహరాలు ఈఈ శ్రీనివాస సంజయ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ పై శిక్షణను రెవెన్యూ అధికారి సమ్మద్‌, స్టేషనరీ వ్యవహరాలు ఈఈ చంద్రయ్య, పోలింగ్‌ స్టేషన్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను ఎస్‌ఈ సంపత్‌కుమార్‌కు అప్పగించినట్లు కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితోపాటు ఈఈ, డీఈఈ, ఏఈఈలకు కూడా ఎన్నికల విధులు కేటాయించారు.