ఉద్యోగులకు పూర్తి భద్రత

ABN , First Publish Date - 2021-01-11T07:15:51+05:30 IST

సకాలంలో ఎన్నికలు జరప డం రాజ్యాంగ విధి అని, మనమందరం సమష్టిగా పంచాయతీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు పిలుపిచ్చారు.

ఉద్యోగులకు పూర్తి భద్రత

  • వారికి పీపీఈ కిట్లు, ఫేస్‌ షీల్డులు.. రక్షణ చర్యలపై శిక్షణ 
  • వ్యాక్సిన్‌ ప్రాధాన్య సిబ్బందిలో వారిని కూడా చేర్చాలని చెప్పాం
  • సీఎస్‌కూ సూచించాం.. సకాలంలో ఎన్నికలు రాజ్యాంగ విధి
  • కలిసి సఫలం చేద్దాం.. ఉద్యోగులకు కమిషనర్‌ బహిరంగ లేఖ


అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సకాలంలో ఎన్నికలు జరప డం రాజ్యాంగ విధి అని, మనమందరం సమష్టిగా పంచాయతీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు పిలుపిచ్చారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు శనివారం తమ ఆవేదనను వెలిబుచ్చాయంటూ వారికి ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలు విధుల్లో ఉన్న సిబ్బంది రక్షణ  కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మొదటి నుంచీ ప్రభుత్వానికి సూచిస్తోందని తెలిపారు. ‘ప్రభుత్వానికి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో 27, 28 పేరాల్లో ఎన్నికల సిబ్బందికి కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించాం. సిబ్బందికి నాణ్యమైన పీపీఈ కిట్లు, ఫేస్‌ షీల్డులు, గ్లౌజ్‌లు ఇవ్వడమే కాకుండా.. వారికి రక్షణ చర్యలపై తగు శిక్షణ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించాం. కరోనా వ్యాక్సిన్‌ ప్రాధాన్య సిబ్బందిలో ఎన్నికల సిబ్బందిని చేర్చాలని చెప్పాం. దీంతో ఎన్నికల సిబ్బందిలో ఆత్మస్థైర్యం నెలకొల్పినట్లవుతుంది. ఇదే విషయాన్ని ఈ నెల 8న ఎస్‌ఈసీ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించిన సందర్భంగా చెప్పాం’ అని వివరించారు.  విపత్తులు ఎదుర్కొవడంలో, ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు మంచి ట్రాక్‌ రికార్డు ఉందని, మనమే ముందున్నామని కమిషనర్‌ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో ఉద్యోగులకు భద్రత కల్పించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను అందరం సమష్టిగా సజావుగా నిర్వహిద్దామని కోరారు.

Updated Date - 2021-01-11T07:15:51+05:30 IST