మెరుపులు.. మరకల శ్వేతసౌధం

ABN , First Publish Date - 2021-01-17T18:57:31+05:30 IST

1600, పెన్సిల్వేనియా అవెన్యూ, వాషింగ్టన్‌ డీసీ... ఈ అడ్రెస్‌ మీకు తెలుసా!? తెలీదు కదూ! పోనీ... వైట్‌ హౌస్‌ తెలుసా? కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే... ఇది అమెరికా అధ్యక్షుడి అధికార నివాస భవనం! ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయాక, సోవియట్‌ రష్యా ముక్కలయ్యాక... ప్రపంచానికి ఏకైక పెద్దన్న అమెరికా! ప్రపంచంలోనే అతిపురాతన ప్రజాస్వామ్యం అమెరికా!

మెరుపులు.. మరకల శ్వేతసౌధం

1600, పెన్సిల్వేనియా అవెన్యూ, వాషింగ్టన్‌ డీసీ... ఈ అడ్రెస్‌ మీకు తెలుసా!? తెలీదు కదూ! పోనీ... వైట్‌ హౌస్‌ తెలుసా? కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే... ఇది అమెరికా అధ్యక్షుడి అధికార నివాస భవనం! ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయాక, సోవియట్‌ రష్యా ముక్కలయ్యాక... ప్రపంచానికి ఏకైక పెద్దన్న అమెరికా! ప్రపంచంలోనే అతిపురాతన ప్రజాస్వామ్యం అమెరికా! అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా! తన కాలికి ముళ్లు గుచ్చుకుంటుందని చిన్న అనుమానమొచ్చినా ఆగదు! ఎంతదూరమైనా వెళ్లి చెట్టును పెకలిస్తుంది. ప్రపంచానికి ‘నేనే పెద్దన్న’ అంటుంది. అదే సమయంలో... అవకాశాలకు ఆలంబనగా నిలుస్తుంది. అన్ని దేశాల వారినీ అక్కున చేర్చుకుంటుంది. పౌర సేవలకు విలువనిస్తుంది. అమెరికా అంటే... భౌగోళికంగా 50 రాష్ట్రాలున్న ఒక్క దేశం! కానీ... అక్కడి ప్రజల మూలాలను పరికిస్తే అదొక్కటే ఒక పెద్ద ప్రపంచం! అమెరికా తలచుకుంటే ఒక యుద్ధం వస్తుంది. వద్దనుకుంటే అదే యుద్ధం ఆగిపోతుంది. హెచ్‌1బీ వీసాల నిబంధనలను అమెరికా కఠినతరం చేస్తే... అది మొత్తం ప్రపంచానికి వార్త అవుతుంది. స్వదేశాన్నే కాదు... మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు పురుడు పోసుకునేది అధ్యక్ష భవనంలోనే! అమెరికా అధికారానికి, ప్రజలకు, ప్రభుత్వానికి ఉమ్మడి ప్రతీక వైట్‌ హౌస్‌! ఇది ఠీవిగా నిలుస్తుంది. మిలమిలా మెరుస్తుంది. తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ మినహా... ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షులైన వారంతా వైట్‌హౌస్‌లో నివసించారు. ఈ భవంతిది సుమారు 200 సంవత్సరాల చరిత్ర! అందులో... ఎన్నో మెరుపులు! కొన్ని మరకలు! ట్రంప్‌ హయాంలో ‘వైట్‌హౌస్‌’ వివాదాలకు కేంద్రమైంది.  ‘నేను శాశ్వతం. మీరంతా వచ్చిపోయే వాళ్లే’ అంటూ ప్రతి నాలుగు-ఎనిమిదేళ్లకో అధ్యక్షుడిని అక్కున చేర్చుకుంటోంది. ఇంకెన్నో కీలక ఘట్టాలకూ సాక్షీభూతంలా నిలుస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నెన్ని ‘అల్లరి-చిల్లర’ వేషాలు వేసినా... అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేయక తప్పడంలేదు. జనవరి 20వ తేదీ నుంచి తసౌధాధీశుడు జో బైడెన్‌! ఈ సందర్భంగా వైట్‌హౌస్‌కు అక్షర యాత్ర చేసేద్దామా!


ఆయనే కట్టించినా...

ఎవరో శంకుస్థాపన చేస్తే.. ఇంకెవరో ప్రారంభోత్సవం చేయడం మామూలే! వైట్‌హౌస్‌ విషయంలోనూ అదే జరిగింది. అధ్యక్ష భవనాన్ని ఎక్కడ, ఎలా కట్టాలో నిర్ణయించింది జార్జి వాషింగ్టన్‌. ఆయన అమెరికా తొలి అధ్యక్షుడు. 1792లో మొదలుపెట్టిన పని 1800 నాటికి ఓ కొలిక్కి వచ్చింది. అయితే... అంతకు మూడేళ్ల ముందే జార్జి వాషింగ్టన్‌ పదవీ కాలం ముగిసింది. 1799లో ఆయన కన్ను మూశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వైట్‌హౌస్‌లో కాలుపెట్టని, నివసించని అమెరికా అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ ఒక్కరే!. 


షాక్‌ కొడుతుందేమో..

అధ్యక్ష భవనాన్ని నిర్మించిన దాదాపు వందేళ్లకు... అంటే 1891లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. అప్పుడు... అధ్యక్షుడు బెంజిమన్‌ హ్యారిసన్‌. ‘కరెంటు షాక్‌ కొడుతుందేమో’ అని హ్యారిసన్‌ దంపతులు భయపడేవారట. అందుకే... ఒక్కసారంటే ఒక్కసారి కూడా వాళ్లు కరెంటు స్విచ్‌లను టచ్‌ చేయలేదు.


ఇద్దరు.. కన్నుమూత

వైట్‌హౌస్‌లో జీవించడం అధికార-విలాసం. అయితే... ఇద్దరు అధ్యక్షులు వైట్‌హౌస్‌లోనే మరణించారు. వారే... విలియమ్‌ హెన్రీ హ్యారిసన్‌, జచారీ టేలర్‌. ఇక... ముగ్గురు ‘ప్రథమ మహిళలు’ (అధ్యక్షుల సతీమణులు) ఇక్కడ ఉండగానే చనిపోయారు. ఇప్పటిదాకా వైట్‌హౌస్‌లో పది మంది మరణించారు.


ఇంకెవరో... 

అమెరికా అంటే... ఆహా ఓహో అని అనుకుంటాం! అయితే... వైట్‌హౌస్‌ను డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ మాత్రం అమెరికన్‌ కాదు. అప్పట్లో ఐరిష్‌ జాతీయుడైన జేమ్స్‌ హోబన్‌కు ఈ అవకాశం దక్కింది. 


అమ్మో... దెయ్యం!

పాత భవంతి అయితే చాలు... అందులో ఒక దెయ్యాన్ని ‘సృష్టిస్తారు’. అధ్యక్ష భవనానికీ ఈ తిప్పలు తప్పలేదు. వైట్‌హౌస్‌లో ‘అతీంద్రియ శక్తుల’ చర్యలు గుర్తించినట్లు అక్కడి సిబ్బంది, పలువురు అధ్యక్షుల భార్యలు పేర్కొన్నారు. మరికొందరు ‘అబ్రహం లింకన్‌ ఆత్మను చూశాం’ అని చెప్పారు. ‘నేను వైట్‌హౌస్‌లో బస చేసినప్పుడు అక్కడ లింకన్‌ ఆత్మను చూశాను’ బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న విన్‌స్టన్‌ చర్చిల్‌ తెలిపారు. నమ్మితే నమ్మండి! 


వైట్‌హౌస్‌ 2.0

వెన్నెల్లా మెరిసిపోయే వైట్‌హౌస్‌కు మసి అంటిందంటే నమ్మగలమా! ఔను! 1814 యుద్ధంలో బ్రిటిష్‌ సైనికులు శ్వేతసౌధానికి నిప్పంటించారు. దీంతో అధ్యక్షుడు ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. భవనానికి భారీగా మరమ్మతులు అవసరమయ్యాయి. ఆ తర్వాత 1952లో దాదాపు మొత్తం భవనాన్ని పునర్నిర్మించారు. ఇప్పుడున్నది వైట్‌హౌస్‌ 2.0 అన్నమాట!


కేబినెట్‌ రూమ్‌

వైట్‌హౌస్‌లోని కీలకమైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. వెస్ట్‌వింగ్‌లోని కేబినెట్‌ రూమ్‌లోనే అమెరికా అధ్యక్షుడు తన మంత్రివర్గ సహచరులతో సమావేశమవుతారు. అంటే... ముఖ్యమైన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయన్న మాట!


ఓవల్‌ ఆఫీస్‌... వెరీ ‘గుడ్డు’

వైట్‌హౌస్‌లో ఈస్ట్‌ వింగ్‌, వెస్ట్‌ వింగ్‌ అనే రెండు భాగాలున్నాయి. అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాలన్నీ ‘వెస్ట్‌ వింగ్‌’లో జరుగుతాయి. అందులోనూ... ఓవల్‌ ఆఫీసు చాలా స్పెషల్‌. ‘నాలుగు గోడల మధ్య’ కూర్చుని పని చేయడం ఇష్టంలేదు కాబోలు! వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడి కార్యక్షేత్రం కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అందుకే... దీనికి ‘ఓవల్‌ ఆఫీస్‌’ అని పేరు. అమెరికా తొలి రాజధాని ఫిలడెల్ఫియాలో జార్జి వాషింగ్టన్‌ అధికార నివాసం వృత్తాకారంలోనే ఉండేది. అందుకే... వైట్‌హౌస్‌ ఆఫీసు కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకున్నారు.


ఇల్లా... జైలా..

వైట్‌హౌస్‌లో టెన్నిస్‌ కోర్ట్‌, సినిమా థియేటర్‌, బిలియర్డ్స్‌ రూమ్‌, బాస్కెట్‌ బాల్‌ కోర్టు, జాగింగ్‌ ట్రాక్‌, రెండు స్విమ్మింగ్‌ పూల్స్‌, విశాలమైన పచ్చిక మైదానం... ఇలా ఎన్నో ఉన్నాయి. అయినా సరే, వైట్‌హౌస్‌లో నివాసమంటే ఒంటరితనంతో సహవాసమే అని చాలామంది వాపోయారు. ‘ఇది గ్రేట్‌ వైట్‌ జైల్‌’ అని ప్రెసిడెంట్‌ ట్రూమన్‌ పేర్కొన్నారు. ‘ఇదో అందమైన కారాగారం’ అని ప్రెసిడెంట్‌ నిక్సన్‌ కుమార్తె జూలీ ఆక్రోశించారు. ‘కిటికీలు తెరుచుకోనివ్వరు. అటూ ఇటూ కదలనివ్వరు. ఎప్పుడూ ఎవరో ఒకరు కన్నేసి ఉంటారు. ఇంత పెద్ద ఇంట్లో ఉన్నా ఒంటరితనమే’ అని మిషెల్లీ ఒబామా తన స్వీయ జీవిత చరిత్రలో ఆక్రోశించారు.


సినిమా చూపిస్త మామా...

అమెరికా అధ్యక్షుల జీవిత చరిత్రలతోపాటు కల్పిత కథలతో పదులకొద్దీ సినిమాలు వచ్చాయి. అందులో బాగా ప్రసిద్ధి చెందిన సినిమా... ‘లింకన్‌’. దీనిని స్పీల్‌బర్గ్‌ తెరకెక్కించారు. ఇక... అచ్చంగా వైట్‌హౌస్‌ నేపథ్యంలో వచ్చిన సినిమాలూ చాలానే ఉన్నాయి. అందులో ‘వైట్‌ హౌస్‌ డౌన్‌’ సూపర్‌ హిట్‌. వైట్‌హౌస్‌ సందర్శనకు వచ్చిన ఒక పోలీస్‌... దుండగుల దాడి నుంచి అధ్యక్ష భవనాన్ని కాపాడటమే ఈ చిత్ర ఇతివృత్తం.


తప్పక చూడండి

వైట్‌హౌస్‌ ముందున్న సువిశాలమైన ‘ప్రెసిడెంట్‌ పార్క్‌’ నిత్యం దేశ విదేశాలకు చెందిన పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. వైట్‌హౌస్‌ ముందు నిల్చుని ఫొటోలు దిగడం ఓ సరదా. ఇక... నిరసనలకూ వైట్‌హౌస్‌ కేంద్రంగా మారుతుంటుంది. వైట్‌హౌస్‌ ముందు రెండేళ్లపాటు జరిగిన నిరసన ఫలితంగానే అమెరికాలో మహిళలకు ఓటు హక్కు లభించింది. ఇక... నల్లజాతీయుడైన జార్జిఫ్లాయిడ్‌ కాల్చివేత సమయంలో వైట్‌హౌస్‌ ఆవరణ మొత్తం నిరసనలతో దద్దరిల్లింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడినంత పని చేశారు. అప్పటి నుంచి భారీ బారికేడ్లు, కంచెలతో భద్రత పెంచారు.


అప్పుడు ‘వైట్‌హౌస్‌’ కాదు

వైట్‌హౌస్‌ను మొదట్లో ‘ప్రెసిడెంట్స్‌ హౌస్‌’ అని పిలిచేవారు. ‘ఎగ్జిక్యూటివ్‌ మాన్సన్‌’ అని కూడా అనేవారు. ఎక్కడా మరక అంటకుండా మల్లెపువ్వులా మెరిసిపోయే ఈ భవనానికి మరేదో పేరు ఉంటే బాగుంటుందని ప్రెసిడెంట్‌ థియోడర్‌ రూజ్వెల్ట్‌కు అనిపించింది. ఇంకేదో ఎందుకు... తెల్లగా ఉంది కదా, ‘వైట్‌హౌస్‌’ అని 1901లో నామకరణం చేశారు. ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది.


ఏమిటీ ‘సిచ్యుయేషన్‌’?

అబోత్తాబాద్‌లో నక్కిన బిన్‌ లాడెన్‌ను అమెరికన్‌ కమెండోలు హతమార్చుతున్న దృశ్యాలను ఒబామా బృందం ‘లైవ్‌’లో చూస్తున్న ఫొటో మీకు గుర్తుందా? అప్పుడు వాళ్లంతా కూర్చున్న గది పేరు ‘సిచ్యుయేషన్‌ రూమ్‌’. యుద్ధాలతోపాటు కీలకమైన, రహస్యమైన ఆపరేషన్లను ఇక్కడి నుంచే సమీక్షిస్తారు. సిచ్యుయేషన్‌ రూమ్‌లో రోజంతా సిబ్బంది పని చేస్తూనే ఉంటారు. 


రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

‘బానిసలు కట్టిన భవంతిలో నివసిస్తున్నానే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు కలుక్కుమంటుంది’ అని ఒబామా సతీమణి మిషెల్లీ అప్పట్లో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. వైట్‌హౌస్‌ నిర్మాణంలో బానిసల కష్టమూ ఉండటం నిజం. వైట్‌హౌస్‌ కోసం ఇటుకల తయారీ, రాళ్లు కొట్టడంతోపాటు కార్పెంటర్లుగా బానిసలు పని చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, వారిని ప్రభుత్వం నేరుగా నియమించుకోలేదట!. 


కుక్కల నుంచి మొసళ్ల దాకా..

అమెరికాలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక పెంపుడు జంతువు కనిపిస్తుంది. అధ్యక్ష నివాస ప్రాంగణంలోనూ అనేక పెంపుడు జంతువులు (పెట్స్‌) సందడి చేశాయి. పెంపుడు జంతువులు అనగానే పిల్లులు, శునకాలు మాత్రమే అనుకుంటే పొరపడినట్లే. జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌ ఓ మొసలిని పెంచుకున్నారట! మార్టిన్‌ వాన్‌ బ్యూరెన్‌ తనకు ఒమన్‌ సుల్తాన్‌ బహూకరించిన రెండు పులి పిల్లలను కొన్నాళ్లపాటు పెంచుకున్నారు.


సొరంగాలూ.. బంకర్లు

రాజుల కోటలకు రహస్య మార్గాలు ఉన్నట్లే... వైట్‌హౌస్‌లోనూ రెండు సొరంగ మార్గాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వీటిని తవ్వారు. అలాగే... వైట్‌హౌస్‌ బేస్‌మెంట్‌లో ఒక బంకర్‌ను కూడా నిర్మించారు. ఇటీవల నల్లజాతీయుడి కాల్చివేతకు నిరసనగా ఆందోళనకారులు వైట్‌హౌస్‌ను ముట్టడించినప్పుడు... ట్రంప్‌ ఇదే బంకర్‌లో దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి.


ఇంకేం ఇంకేం కావాలి...

వైట్‌హౌస్‌లోని బేస్‌మెంట్‌ ఫ్లోర్‌ ఒక మినీ షాపింగ్‌ మాల్‌ను తలపిస్తుంది. సిబ్బంది తమకు అవసరమైన వస్తువులు అక్కడే కొనవచ్చు. అధ్యక్షుల వారికి పంటి నొప్పి వస్తే బయటికి పరిగెత్తకుండా... అక్కడే ఒక డెంటిస్ట్‌ అందుబాటులో ఉంటారు. ఇక... అతిథులను ఆహ్వానించేందుకు బొకేలు సిద్ధం చేసే ఫ్లవరిస్ట్‌ కూడా రెడీ! అధ్యక్షుడైనంత మాత్రాన ఇక్కడ అన్నీ ఫ్రీగా వచ్చేయవు. భోజనం, డ్రైక్లీనింగ్‌, మేకప్‌ తదితర ఖర్చులన్నీ అధ్యక్షుడి కుటుంబం సొంతంగా భరించాల్సిందే!. - కథనం: తొమ్మండ్రు సురేష్ కుమార్

Updated Date - 2021-01-17T18:57:31+05:30 IST