వాయిదాపడిన మద్యం దుకాణాల డ్రా పూర్తి

ABN , First Publish Date - 2021-12-01T05:18:50+05:30 IST

వాయిదాపడిన మద్యం దుకాణాల డ్రా పూర్తి

వాయిదాపడిన మద్యం దుకాణాల డ్రా పూర్తి
వికారాబాద్‌లో లక్కీ డ్రాలో విజేతను ప్రకటిస్తున్న వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి/మేడ్చల్‌ జిల్లా ప్రతిధి): వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో వాయిదా పడిన మద్యం దుకాణాల కేటాయింపు డ్రా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం వికారాబాద్‌ కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ నిఖిల, జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారి వరప్రసాద్‌ సమక్షంలో మద్యం దుకాణాలకు డ్రా నిర్వహించారు. వాయిదా పడిన 6 మద్యం దుకాణాలకు 120 దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీలకు రిజర్వు చేసిన యాలాల మద్యం దుకాణం(షాప్‌ నెం:వికెబి17) కోసం 22మంది దరఖాస్తు చేసుకోగా, డ్రాలో టి.శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. కొడంగల్‌లో మూడు దుకాణాలు జనరల్‌కు కేటాయించారు. షాప్‌ నెం.52కు 16మంది పోటీ పడగా అశోక్‌గౌడ్‌ దానిని దక్కించుకున్నాడు. షాప్‌ నెం.53 కోసం 17మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో జి.హనుమాగౌడ్‌కు లక్కు చిక్కింది. షాప్‌ నెం.54కు 18మంది పోటీ పడగా వారిలో శరత్‌కుమార్‌ను అదృష్టం వరించింది. రావులపల్లి షాప్‌నెం.55 కోసం 19మంది దరఖాస్తు చేసుకోగా, డ్రాలో పెంటయ్య ఎంపికయ్యారు. దౌల్తాబాద్‌ షాప్‌ నెం.56కు 28మంది దరఖాస్తు చేసుకోగా వారిలో సుధారాణిని అదృష్టం వరించింది.


  • తక్కువ దరఖాస్తులు వచ్చాయని..

వాస్తవానికి జిల్లావ్యాప్తంగా జరిగిన టెండర్లలో 6 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి ఆరు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో మద్యం వ్యాపారులు సిండికేట్‌ అయ్యారని భావించిన ఎక్సైజ్‌ అధికారులు తిరిగి టెండర్లు పిలిచారు. అయితే, వీటికి ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరిగింది. దరఖాస్తులు పెరగడంలో కూడా సిండికేట్లే ప్రభావం చూపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సిండికేట్లు దరఖాస్తులు ఎక్కువగా రాకుండా వ్యాపారులను అడ్డుకున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి ఈ అపవాదు రాకుండా చూసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. రీటెండర్లలో దరఖాస్తుల సంఖ్య పెరగడం వెనుక కూడా సిండికేట్ల ప్రభావం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎక్కువ దర ఖాస్తులు రావడానికి వారు పావులు కదిపినట్టు స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


  • మేడ్చల్‌లో ఒక దుకాణానికి..

అంకిరెడ్డిపల్లి మద్యం దుకాణం లైసెన్స్‌ను నవీన్‌రెడ్డి దక్కించుకున్నారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా ఇన్‌చార్జ్జి కలెక్టర్‌ హరీష్‌, మల్కాజ్‌గిరి ఈఎస్‌ అరుణ్‌కుమార్‌లు దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ నిర్వహించారు. 6వ నెంబరుపై వేసిన దరఖాస్తుదారుడు నవీన్‌రెడ్డికి అంకిరెడ్డిపల్లి మద్యం దుకాణం లభించింది. జిల్లాలో మద్యం టెండర్లు ముగిశాయని, మద్యం అమ్మకాలు, దుకాణాల ఏర్పాటుపై ఆబ్కారీ అధికారులు దృష్టి సారించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అదేశించారు.

Updated Date - 2021-12-01T05:18:50+05:30 IST