Abn logo
May 21 2020 @ 04:44AM

రోజూ మంచినీటి సరఫరాకు ట్రయల్‌రన్‌ పూర్తి

త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం

రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహార పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌ టౌన్‌, మే 20: నగరంలో రోజు మంచినీటి సరఫరా చేసేందుకు ట్రయల్‌రన్‌ పూర్తి చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహార పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం మారుతినగర్‌లో 20లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పైప్‌లైన్‌ పనులకు మేయర్‌ సునీల్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్‌ అర్బన్‌ మిషన్‌ భగీరథలో భాగంగా నగరంలో రోజు మంచినీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


డిస్ట్రిబ్యూషన్‌ పైప్‌లైన్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి వాటన్నింటినీ మార్చుతున్నామన్నారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం వేసిన సీసీ పైపులైన్లను తొలగించి వాటిస్థానంలో హెచ్‌డీపీఈ, డీఏ పైపులను వేస్తామన్నారు. ఈ పైపుల ద్వారా వంద శాతం లీకేజి సమస్యలను అధిగమించవచ్చన్నారు. త్వరలోనే కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రతిరోజు మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని మంత్రి గంగుల ప్రకటించారు. శాతవాహన, మార్కెట్‌ వాటర్‌ ట్యాంకులను నీటితో నింపి మరోసారి ట్రయల్‌ రన్‌ చేస్తామన్నారు.


తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌ ప్రజలకు డెయిలీవాటర్‌తో పాటు రానున్న రోజుల్లో 24/7 రోజులు మంచినీటిని సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ వల్లూరి క్రాంతి, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌, కార్పొరేటర్‌ నేతికుంట యాదయ్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement