Abn logo
Jul 14 2021 @ 06:42AM

bihar: ఉద్యోగం నుంచి తీసేశారని మహిళా డాక్టర్‌ నుదుట సింధూరం దిద్దిన కంపౌండర్!

సమస్తీపూర్: వన్‌సైడ్ లవ్ ఎంతవరకైనా దారితీస్తుందంటారు. బీహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లాలోని దల్‌సింగ్‌సరాయ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే కంపౌండర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ద్వేషం పెంచుకున్న ఆ కంపౌండర్ అక్కడి మహిళా డాక్టర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈ ఉద్దేశంతో ఆసుపత్రిలోని డాక్టర్ చాంబర్‌లోకి చొరబడ్డాడు. అక్కడి మహిళా డాక్టర్ అతనికి ఏదో చెప్పబోతున్నంతలోనే ఆమె నుదుటన సింధూరం దిద్దాడు. 

ఈ ఉదంతాన్ని వీడియో తీశాడు. అలాగే ఫొటోలు కూడా తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వ్యవహారం వైరల్ కావడంతో సదరు మహిళా డాక్టర్ ఆ కంపౌంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలైన మహిళా డాక్టర్ దల్‌సింగ్‌సరాయ్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తూనే, ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అక్కడ సుమిత్ కుమార్ అనే యువకుడిని కంపౌండర్‌గా నియమించుకున్నారు. కొద్ది రోజల క్రితం ఆ మహిళా డాక్టర్‌కు సుమిత్ కుమార్ ప్రవర్తన నచ్చక అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటికే సుమిత్ కుమార్ ఆ మహిళా డాక్టర్‌ను ప్రేమిస్తున్నాడు. దీంతో ఆమెపై పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో బలవంతంగా ఆమె నుదుట సింధూరం దిద్దాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన సుమిత్ కుమార్ కోసం గాలిస్తున్నారు. 

ప్రత్యేకంమరిన్ని...