తాలిబన్ పై పోరుకు చైనాతో రాజీ

ABN , First Publish Date - 2021-08-31T06:05:50+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికా ఓడిపోయింది. కాబూల్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణతో, అంతర్జాతీయ వ్యవహారాలలో ఒక ప్రముఖపాత్ర పోషించే అవకాశం మన దేశానికి వచ్చింది...

తాలిబన్ పై పోరుకు చైనాతో రాజీ

అఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికా ఓడిపోయింది. కాబూల్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణతో, అంతర్జాతీయ వ్యవహారాలలో ఒక ప్రముఖపాత్ర పోషించే అవకాశం మన దేశానికి వచ్చింది. మరి మనం దాన్ని సద్వినియోగపరచుకోగలమా? స్వేచ్ఛా స్వాతంత్ర్యాల వైతాళికురాలు అమెరికా. అయితే ఇది గత చరిత్ర. ఆఫ్రికా నుంచి రాక్షసంగా తీసుకువచ్చి, పశువుల్లా ఉపయోగించుకున్న నల్లజాతి ప్రజలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామం అనంతరం పశ్చిమ యూరోపియన్ దేశాల పునర్నిర్మాణానికి వాషింగ్టన్ విశేష సహాయమందించింది. భారత్ మొదలైన ఆసియా దేశాలు వలసపాలన నుంచి విముక్తి పొందేందుకు రూజ్వెల్ట్ మొదలైన అమెరికా రాజనీతిజ్ఞులు నైతిక, రాజకీయ తోడ్పాటు నందించారు. 1960 దశకంలో కరువు కాటకాలతో విలవిలలాడిన మన దేశానికి పిఎల్-–480కార్యక్రమం కింద ఆహారధాన్యాలను ఉదారంగా సరఫరా చేసిన ఉదారత అమెరికాదే. 


అయితే ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచ ఏకైక అగ్రరాజ్యంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా నిర్వహించిన పాత్ర ప్రశంసార్హమైనది కాదు. రాచరిక సౌదీ అరేబియా, సైన్యం నియంత్రణ లోని పాకిస్థాన్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్య విస్తరణ పట్ల ఆ దేశ నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న శక్తి అమెరికాయే. మేధాసంపత్తి హక్కులను సంరక్షించడమే ఆ ప్రపంచ సంస్థ ప్రధాన బాధ్యతగా ఉంది. తద్వారా అది పాశ్చాత్య సంపన్నదేశాల ప్రయోజనాలనే కాపాడుతోంది. ఆ దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు నవీన సాంకేతికతల సృష్టిలో అగ్రగాములుగా ఉన్నాయి. ఆ అధునాతన సాంకేతికతలపై పేటెంట్స్ ఆలంబనతో అవి తమ ఉత్పత్తులను ఇరవైఏళ్ళ పాటు అత్యధిక ధరలకు అమ్ముకుని అపరిమిత లాభాలను ఆర్జిస్తున్నాయి. కరోనా విలయంలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారు ఫైజర్ ఆర్జించిన లాభాలే అందుకొక తిరుగులేని ఉదాహరణ. పేటెంట్లపై స్వామ్యాన్ని వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. కనీవినీ ఎరుగని స్థాయిలో మానవాళి ఆరోగ్యముప్పులో అల్లల్లాడిపోతున్న తరుణంలో కూడా వ్యాక్సిన్లపై తన గుత్తాధిపత్యాన్ని పదిలపరచుకోవడానికే అమెరికా ప్రాధాన్యమిచ్చింది. 


ఈ నేపథ్యంలో అఫ్ఘానిస్తాన్‌లో మన భావి కార్యాచరణకు ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలి. కాబూల్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు మనతో వ్యాపార వాణిజ్యాలను కొనసాగించేందుకు సుముఖంగా లేరు. ఆందోళనకరమైన విషయమేమిటంటే చైనా వైపే వారు మొగ్గుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా తాలిబన్లు, చైనాతో జట్టుకట్టే అవకాశం ఎంతైనా ఉంది. దీనికితోడు పాకిస్థాన్‌లో సైతం తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశమూ ఉంది. ఇదే జరిగితే మనదేశం అఫ్ఘాన్-చైనా-పాకిస్థాన్ చక్రబంధంలో చిక్కుకోవడం ఖాయం. 


ఈ విషమపరిస్థితులు స్పష్టం చేస్తున్నదేమిటి? తాలిబన్‌ను న్యూఢిల్లీ ఎటువంటి మినహాయింపు లేకుండా వ్యతిరేకించి తీరాలనే కదా! కాబూల్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణతో మనకు లభించిన ఒక విలువైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మనం విఫలమయ్యామని చెప్పక తప్పదు. అమెరికా స్థానంలో మనం అఫ్ఘాన్ పరిస్థితులను అదుపులోకి తీసుకుని ఉండాల్సింది. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య సైనికకూటమి నేటోతో కలిసి మనం అఫ్ఘాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక పోరు, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను చేపట్టి ఉండాల్సింది. కొన్ని దశాబ్దాల క్రితం శ్రీలంకలో తమిళ వేర్పాటు వాదాన్ని అణచివేసేందుకు భారతీయ శాంతి పరిరక్షకదళాన్ని పంపాము (ఈ కర్తవ్య నిర్వహాణలో అది విఫలమయింది. అయితే అది వేరే విషయం). ఇప్పుడు అఫ్ఘాన్‌కు కూడా ఐపికెఎఫ్ లాంటి శాంతిపరిరక్షకదళాన్ని పంపడం ఇప్పుడు మన ముందున్న ఒక ప్రత్యామ్నాయం. తాలిబన్‌కు వ్యతిరేకంగా ప్రపంచ సంకీర్ణసేన నొకదాన్ని ఏర్పాటు చేసి, పోరాడేందుకు భారత్ తక్షణమే పూనుకోవాలి. మన పశ్చిమ సరిహద్దుల్లో కంటే అఫ్ఘాన్ లోనే తాలిబన్‌కు వ్యతిరేకంగా పోరాడడమే అన్ని విధాల శ్రేయస్కరం. 


కీలకప్రశ్న ఏమిటంటే మనం ఎవరితో జట్టు కట్టాలి? నేటోను భాగస్వామిని చేసుకోవాలా లేక చైనాతో కలిసి సంయుక్తంగా పోరాడాలా? రెండు సంభావ్యతలకు అవకాశముంది. భారత్–-నేటో కూటమి తాలిబన్- చైనా కూటమికి వ్యతిరేకంగా పోరాడాలి. అలా కాకపోతే భారత్, చైనాలు కలిసి తాలిబన్‌కు వ్యతిరేకంగా పోరాడాలి. భారత్, చైనాలు సంయుక్తంగా పోరాడడమే మేలు. ఎందుకంటే చైనా మద్దతు లేని పక్షంలో తాలిబన్ పూర్తిగా బలహీనపడుతుంది. తాలిబన్–-చైనా సంబంధాలు ఇంకా చాలా ప్రాథమికదశలో ఉన్నాయి. అవి ఏ విధంగా రూపుదిద్దుకుంటాయో ఇప్పుడే చెప్పలేము. తాలిబన్-–చైనా కూటమిని ఎదుర్కోవడానికి బదులుగా తాలిబన్‌కు వ్యతిరేకంగా చైనాతో జట్టు కట్టేందుకు మనం ప్రయత్నించాలి. 


చైనాతో కలిసి పోరాడేందుకు ఒక ప్రధాన అవరోధం ఉంది. సరిహద్దు వివాదాలే ఆ అడ్డంకి. బ్రిటిష్ జర్నలిస్ట్ నెవిల్ మ్యాక్స్ వెల్ ‘ఇండియాస్ చైనా వార్’ అన్న తన పుస్తకంలో సరిహద్దు వివాదాల గురించి నిశితంగా విశ్లేషించాడు. 1962లో భారత్–-చైనా యుద్ధానికి న్యూఢిల్లీ అనుసరించిన దుస్సాహసిక విధానాలే ప్రధాన కారణమని అతడు విశ్లేషించాడు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను సొంతం చేసుకోవాలని మన సైనికదళాలకు నాటి రక్షణమంత్రి కృష్ణ మీనన్ జారీ చేసిన ఆదేశాలే అంతిమంగా యుద్ధానికి దారితీశాయని మ్యాక్స్ వెల్ తెలిపాడు. ‘భారత్‌కు ఒక గుణపాఠం నేర్పేందుకు’ చైనా సంశయించలేదని ఆతడు వ్యాఖ్యానించాడు. 1962లో మన తప్పిదాన్ని మనం అంగీకరించడం మంచిది. మన పశ్చిమ సరిహద్దుల్లో తాలిబన్ నుంచి ఒక పెద్ద అపాయం ముంచుకొస్తోందన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. చైనా మనలను పరాభవించిన మాట నిజమే. అయితే ప్రస్తుత విషమ పరిస్థితుల దృష్ట్యా ఆ శక్తిమంతమైన దేశంతో మనం వ్యూహాత్మకంగా రాజీపడాలి. తాలిబన్ ఆపదను అధిగమించేందుకు ఇది తప్పనిసరి. 


ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తిగత విషయాన్ని ప్రస్తావించదలిచాను. నా ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలో జరిగింది. అమెరికా ప్రభుత్వం ఉదారంగా సమకూర్చిన ఉపకారవేతనం వల్లే నేను అమెరికా విశ్వవిద్యాలయంలో చదువుకోగలిగాను. ఇందుకు నేను అమెరికాకు కృతజ్ఞుడిని. అయితే ఆ దేశం ఇప్పుడు ప్రపంచ పేదలకు అంతగా తోడ్పడడం లేదు. ప్రజాస్వామ్యదేశాలను యుద్ధాల నుంచి, పేదరికం నుంచి కాపాడేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు. కేవలం తన వ్యాపార ప్రయోజనాలను సాధించుకునేందుకు మాత్రమే అమెరికా ఆరాటపడుతోంది. ఆ అగ్రరాజ్యం ప్రదర్శిస్తున్న ఈ ధోరణిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించి తీరాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-08-31T06:05:50+05:30 IST