అన్నదాత ఆగం!

ABN , First Publish Date - 2021-05-14T08:16:00+05:30 IST

అన్నదాత ఆగమైపోతున్నాడు. ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుని పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ నిరీక్షిస్తున్నాడు

అన్నదాత ఆగం!

ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం.. ఐకేపీ కేంద్రాల్లో రైతుల పడిగాపులు

గోనె సంచుల కొరతతో ఇక్కట్లు

రైతుల ఆగ్రహం.. పలుచోట్ల ఆందోళన

నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కు 

బస్తాకు 2 కిలోల చొప్పున తరుగు

కల్లాలు, కేంద్రాల్లో తడిసిన ధాన్యం

ఖమ్మం, రంగారెడ్డి, ములుగుల్లో వాన

రాజధానిలో ఈదురుగాలుల బీభత్సం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

అన్నదాత ఆగమైపోతున్నాడు. ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుని పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ నిరీక్షిస్తున్నాడు. ఐకేపీ కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, మిల్లులకు తరలించేందుకు లారీలు రాకపోవడం, వర్షాల నుంచి తడిసిపోకుండా ధాన్యాన్ని రోజుల తరబడి రక్షించుకోవడం, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం వంటి సమస్యలతో నిత్యం సతమతమవుతున్నాడు. దీనికి తోడు కొలుగోలులో తరుగు పేరిట మిల్లర్ల చేతిలో దోపిడీకి గురై అచేతనంగా మిగిలిపోతున్నాడు. కొనుగోలు చేసిన ధాన్యానికి సైతం చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నాడు. మరోవైపు మార్కెట్లకు తరలించిన ధాన్యాన్ని వారాల తరబడి కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహిస్తున్న రైతులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలకు దిగుతున్నారు. ధాన్యం, గోనెసంచులు దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో.. యాసంగిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో, అమ్మినా.. గిట్టుబాటు ధర లభిస్తుందో లేదో అనే సందిగ్ధంలో ఉన్న రైతన్నలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇంతర వరకు బాగానే ఉన్నా.. నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతను తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారు. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం 232 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 89 కేంద్రాలు ప్రారంభించారు. 1,80,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 14,141 మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ.9.85 కోట్లు చెల్లించగా ఇంకా రూ. 12.28 కోట్లు చెల్లించాల్సి ఉంది. క్వింటా రూ.1,888 ప్రకారం 17 లోపు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు తరుగు తీయాలనే నిబంధనలు ప్రభుత్వం నుంచి లేకున్నా.. నిర్వాహకులు రైతుల నుంచి క్వింటాకు 3 నుంచి 6 కిలోలు తరుగు తీస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతుల ధాన్యాన్ని కొనకుండా నిలుపుదల చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు గోనె సంచుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సంచుల కోసం ఇప్పటికే యాచారం, షాద్‌నగర్‌, షాబాద్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు అవసరమైనన్నీ సంచులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి తోడు ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ధాన్యం అమ్మిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పినప్పటికీ వారం రోజులు దాటినా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.12.28 కోట్లు చెల్లించాల్సి ఉంది.  


రైతన్నల ఆగ్రహ జ్వాలలు 

రేయింబవళ్లు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారుల తాత్సారంపై నల్లగొండ, జనగామ జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్‌ కమిటీ ఆవరణలో ధర్నా అనంతరం, రహదారిపై గోనెసంచులు దహనం చేశారు. కామన్‌ గ్రేడ్‌ పేరుతో మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంపై జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తానేధార్‌పల్లిలో గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రహదారిపై ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు. కాగా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ రైతుల కష్టాన్ని మిల్లర్లు మింగేస్తున్నారు. తరుగు, తాలు, మట్టిపెడ్డల సాకుతో క్వింటాల్‌కు 3 నుంచి ఆరు కిలోల వరకు కోత విధిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఒక్కో బస్తాలో 41.200 కిలోల చొప్పున ధాన్యం నింపి, 40 కిలోలు నికరం ఖరారు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌, కోయిలకొండ, దేవరకద్ర మండలాల నుంచి మిల్లులకు ధాన్యంతో వస్తున్న రైతులను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించినప్పుడు ఈ బాగోతం బయటపడింది. 


మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలానికి చెందిన ఒక రైతు మహబూబ్‌నగర్‌లోని మిల్లుకు 120 బస్తాల ధాన్యం తీసుకొచ్చారు. కేంద్రం వద్దే తరుగు పేరుతో బస్తాకు 1.220 కిలోల చొప్పున అదనపు తూకం వేశారు. పైగా ధాన్యం పచ్చిగా ఉందని, 3శాతం తరుగుకు అంగీకరిస్తేనే ధాన్యం దించుకుంటామని చెప్పడంతో అప్పటికే 3 రోజుల పాటు వెయిటింగ్‌లో ఉండటంతో రైతు చేసేదిలేక పట్టీ రాయించుకొని వెళ్లారు. ఈ విషయాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పౌరసరఫరాల సంస్థ అధికారుల దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా తమ దృష్టికి రాలేదని, రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

మిల్లులకు తరలింపు భారం 

కల్లాల వద్ద గన్నీ బ్యాగులు సమకూర్చుకోవడమూ తమకు భారంగానే మారిందని, వాటి కోసం వారంరోజుల పాటు వేచి ఉన్నామని, ఆ తర్వాత లారీలు పంపకపోతే చివరకు ట్రాక్టర్లలో తామే స్వయంగా మిల్లుల వద్దకు రవాణా చేస్తున్నామని రైతులు వాపోతున్నారు. గన్నీబ్యాగులు సమకూర్చడం, లారీలు సమయానికి అందుబాటులో ఉంచడంలో రాజకీయ ప్రమేయం, పలుకుబడి కలిగిన వారికి త్వరగా అందుతున్నాయని, అవి లేని వారికి ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. 


ఐకేపీ కేంద్రాల వద్ద పడిగాపులు  

ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట చేతికందినప్పటికీ అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఎండకు ఎండు తూ వానకు తడుస్తుండటంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘట్‌ రైతులకు కొన్ని రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులకు తప్పడం లేదు. ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మూడురోజుల క్రితం గన్నీ బ్యాగులు పంపించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో వడ్లు కొనేదెప్పుడు.. తాము ఇక్కడి నుండి బయటకు పోయేదెప్పుడు అని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-14T08:16:00+05:30 IST