‘రాజంపేట’ కోసం ఆందోళనలు ఉధృతం

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న ఆందోళనలు శుక్రవారం ఉధృతమయ్యాయి. ఈ ఆందోళనలు రైల్వేకోడూరును కూడా తాకాయి. రైల్వేకోడూరు అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

‘రాజంపేట’ కోసం ఆందోళనలు ఉధృతం
అన్నమయ్య విగ్రహం ఎదుట పొర్లుదండాలు పెడుతున్న జనసేన నేతలు

చెవిలో పూలతో గొబ్బిళ్లు తడుతూ బీజేపీ నేతల నిరసన 

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

హైవేపై రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు

అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద జనసేన పొర్లుదండాలు

ముస్లిం మైనారిటీల ర్యాలీ

రాజంపేట, జనవరి 28 : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న ఆందోళనలు శుక్రవారం ఉధృతమయ్యాయి. ఈ ఆందోళనలు రైల్వేకోడూరును కూడా తాకాయి. రైల్వేకోడూరు అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాజంపేటలో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకోకు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలను, విద్యార్థులను డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ సందర్భగా పోలీసులకు, అఖిల పక్ష నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అఖిలపక్ష నాయకులు టీడీపీ రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి ప్రతా్‌పరాజు, బీసీ నాయకులు ఇడిమడకల కుమార్‌, టీడీపీ నేతలు సంజీవరావు, సుబ్రహ్మణ్యంనాయుడు, శివకుమార్‌, వైసీపీ నేత, ఎమ్మెల్యే సోదరుడు మేడా విజయశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, కౌన్సిలర్‌ మీసాల వెంకటసుబ్బయ్య, మిరియాల సురేఖ, సీపీఎం, సీపీఐ, జనసేన నేతలు పాల్గొన్నారు. అన్నమయ్య జన్మస్థలి రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


ముస్లిం మైనారిటీల ర్యాలీ

రాజంపేట జిల్లా కేంద్రం కావాలంటూ ముస్లిం మైనారిటీలు నూనెవారిపల్లె మసీదు నుంచి రాజంపేట అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సిరాజుద్దీన్‌, గుల్జార్‌బాషా, అబుబకర్‌, అఫ్సర్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అన్నమయ్య గడ్డను జిల్లా కేంద్రం చేయకుండా ఎక్కడో ఉన్న రాయచోటిని నీళ్లు లేని ప్రాంతాన్ని జిల్లాగా చేయడం దారుణమన్నారు.


అన్నమయ్య జిల్లా గోవిందా.. అంటూ బీజేపీ నేతల నిరసన  

‘‘గోవిందా హరి గోవిందా... అన్నమయ్య జిల్లా గోవిందా...’’ అంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాజంపేట ఇన్‌చార్జి పోతుగుంట రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో తాళ్లపాకలో అన్నమయ్య విగ్రహం చుట్టూ తిరుగుతూ గొబ్బిళ్లు తడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేశ్‌నాయుడు మాట్లాడుతూ వైసీపీ నేతల అనాలోచిత నిర్ణయాల వల్లే  రాయచోటిని అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు వై.సురే్‌షరాజు, ప్రభావతి, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


అన్నమయ్య విగ్రహం ఎదుట జనసేన పొర్లుదండాలు 

అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ఎదుట జనసేన పార్టీ నాయకులు పొర్లు దండాలు పెడుతూ అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు చెంగారి శివ, పార్లమెంట్‌ ఇన్‌చార్జి ముఖరంచాంద్‌, న్యాయవాదులు కరుణాకర్‌రాజు, కత్తి సుబ్బరాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST