మళ్లీ రణ తెలంగాణ!

ABN , First Publish Date - 2022-06-19T08:13:36+05:30 IST

బాసర ట్రిపుల్‌ ఐటీలో వైస్‌ చాన్స్‌లర్‌ను, అధ్యాపకులను నియమించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థుల ఆందోళన.

మళ్లీ రణ తెలంగాణ!

  • ఉద్యమం నాటి స్థాయిలో ఆందోళనలు
  • ఒకదాని వెంట మరొకటిగా తెరపైకి సమస్యలు
  • నిరసనలకు నాయకత్వం వహిస్తున్న యువత 
  • అందివచ్చిన అవకాశంగా భావిస్తున్న ప్రతిపక్షాలు
  • మరింత రాజకీయ వేడి రాజేసే ప్రయత్నాలు
  • గతంలోలాగా కట్టడి చేయలేకపోతున్న సర్కారు


హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): బాసర ట్రిపుల్‌ ఐటీలో వైస్‌ చాన్స్‌లర్‌ను, అధ్యాపకులను నియమించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థుల ఆందోళన. వారిని శాంతింపజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలం. గౌరవెల్లి ప్రాజెక్టుతో తాము కోల్పోయిన భూములకు పరిహారం ఇచ్చాకే ట్రయల్‌రన్‌ నిర్వహించాలంటూ నిర్వాసితుల నిరసనలు. పోలీసుల లాఠీచార్జికి సైతం వెరవకుండా పోరాడుతున్న రైతులు. జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్‌ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ ధర్నాలు. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో హింసాత్మకంగా మారిన ఉద్యోగార్థుల ఆందోళన. ఇలా.. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిరసనలు, ఆందోళనలే కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత.. మళ్లీ ఆ స్థాయిలో వాతావరణం వేడెక్కుతోంది. ఈ ఆందోళనలకు యువ, విద్యార్థి లోకమే ఎక్కువగా  నాయకత్వం వహిస్తున్నా.. ప్రతిపక్ష పార్టీలు వీటిని ఆసరాగా చేసుకొని మరింత వేడి రగిల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి సంఘటననూ అందివచ్చిన అవకాశంగా భావిస్తూ ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నా యి. ఇలా ఒకదాని వెంట మరొకటిగా సమస్యలు తెరపైకి వస్తుండటంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎ్‌సనే ప్రస్తుత ఉద్యమాల సెగలు తాకుతున్నా యి. దీంతో రాష్ట్రంలో ఈ మార్పు దేనికి సంకేతమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 


గతంలో నిరసనలపై ఉక్కుపాదం...

వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంతకుముందు కూడా విపక్షాలు, నిర్వాసితులు, విద్యార్థులు తదితరుల నుంచి అనేక నిరసనలు, ఆందోళనలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎదుర్కొంది. కానీ, వాటిని తనదైన శైలిలో తేలికగా అణిచి వేయగలిగింది. తెలంగాణ ఉద్యమ నాయకుడైన కోదండరామ్‌నే గృహనిర్బందం చేసినా పెద్దగా స్పందనలేని వాతావరణాన్ని స ర్కారు ఆస్వాదించింది. ప్రభుత్వ విధానాలపై విపక్ష కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పార్టీలు ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చినా ఆయా పార్టీల నాయకులపై గృహనిర్బంధ అస్త్రమో, అరెస్టులో ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంది. కానీ, కొద్ది రోజులుగా పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆందోళనలు, నిరసనల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రజ ల దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ కోసం నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా.. బాధితులు రణరంగాన్ని తలపించేలా పోలీసులతో పోరాటం చేశారు.  పోలీసుల లాఠీచార్జిని సైతం ఎదుర్కొని ఆ అంశాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తేగలిగా రు.  బీజేపీ ఈ అంశాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లగా, కాంగ్రెస్‌ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా..

జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచార ఘటన అంశం వెలుగులోకి రావడంతోనే బాధితురాలికి న్యాయం చే యాలంటూ కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా ఆందోళన లు చేపట్టాయి. ఈకేసు విషయంలో ప్రభుత్వంపై ఒత్తి డి తెచ్చాయి. నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మత్తుపదార్థాలకు యువత బానిసవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే ఆరోపణలను తీవ్రతరం చేశా యి. ఇక బాసర ఐఐటీలో వైస్‌ చాన్స్‌లర్‌, భోధనా సి బ్బంది నియామకం, కనీస వసతుల కల్పన కోసం అ క్కడి విద్యార్థులు చేపట్టిన ఆందోళన దేశం దృష్టినే ఆకర్షించింది. ఈ ఆందోళనను కట్టడి చేయడానికి ప్రభు త్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా విద్యార్థులు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో రాజకీ య పార్టీలు కూడా రంగంలోకి ది గాల్సి వచ్చింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారంటేనే దేశం దృష్టిని ఈ అంశం ఎంతగా ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దే శమంతా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ.. తెలంగాణలో మా త్రం ఇది తీవ్రరూపం దాల్చింది.  పోలీసు కాల్పులకు, ఒక విద్యార్థి మరణించే వరకు వెళ్లింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయమైనా.. రాష్ట్రంలోనే ఆందోళన ఇంత తీవ్రరూపం దాల్చడం పట్ల రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.  


చావో రేవో అన్నట్లుగా.. 

గత ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. వచ్చే ఎన్నికలే తమకు చివరి అవకాశం అన్నట్లుగా పోరాడుతోంది. రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసుల జారీని నిరసిస్తూ ఆ పార్టీ గురువారం తలపెట్టిన ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులతో కాంగ్రెస్‌ నేతలు బాహాబాహీకి దిగే స్థాయికి వెళ్లారు. మరోవైపు బీజేపీ సైతంఆందోళన కార్యక్రమాలను పెం చింది. ఈ రెండు పార్టీలను నిలువరించేందుకు అధికా ర టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. పలువురు మం తులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. 

Updated Date - 2022-06-19T08:13:36+05:30 IST