పాలిమర్స్‌ను పంపించేయాల్సిందే...

ABN , First Publish Date - 2020-05-28T09:46:13+05:30 IST

తెలుగుదేశం పార్టీ అమరావతిలో నిర్వహిస్తున్న మహానాడులో విశాఖ జిల్లా నేతలు ఇక్కడి నుంచే వెబ్‌నార్

పాలిమర్స్‌ను పంపించేయాల్సిందే...

  • టీడీపీ మహానాడులో తీర్మానం
  • కరోనా వైరస్‌ నేపథ్యంలో వెబ్‌నార్‌ ద్వారా నిర్వహణ 
  • కంపెనీ విస్తరణ కోసం పెట్టుకున్న దరఖాస్తును
  • 2018లో టీడీపీ ప్రభుత్వం తిరస్కరించినట్టు గణబాబు వెల్లడి
  • ప్రమాదం అనంతరం ప్రజలకు భరోసా కల్పించడంలో
  • ప్రభుత్వం విఫలమైందని ధ్వజం
  • కంపెనీని వెంటనే తరలించాలని డిమాండ్‌
  • బాధిత గ్రామాల ప్రజలందరికీ హెల్త్‌ కార్డులు ఇవ్వాలి
  • టీడీపీ హయాంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు: బండారు


విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అమరావతిలో నిర్వహిస్తున్న మహానాడులో విశాఖ జిల్లా నేతలు ఇక్కడి నుంచే వెబ్‌నార్‌ ద్వారా పాల్గొన్నారు. మహానాడు తొలిరోజు ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌లీక్‌ ప్రమాద మృతులకు సంతాపం తెలుపుతూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. కంపెనీ తరలింపుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని స్థానిక ఎమ్మెల్యే పి.గణబాబు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిలకు ఇచ్చారు. ఎమ్మెల్యే గణబాబు గోపాలపట్నంలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఉదంతంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన జరిగి 20 రోజులైనా కంపెనీ చుట్టుపక్కల గ్రామాల్లో వున్న ప్రజలు ఇంకా తేరుకోలేదని, పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం కొనసాగుతున్నదని పేర్కొన్నారు. గతంలో హిందుస్థాన్‌ పాలిమర్స్‌గా వున్న ఈ పరిశ్రలను 1997లో ఎల్‌జీ కంపెనీ టేకోవర్‌ చేసిందని, 1999లో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం కొంతభూమిని  స్వాధీనం చేసుకుని గోపాలపట్నం పాఠశాల క్రీడా మైదానం, రైతుబజార్‌, ఆస్పత్రికి కేటాయించిందని గుర్తుచేశారు. 2012లో కాంగ్రెస్‌ హయాంలో  కంపెనీ విస్తరణకు యాజమాన్యం దరఖాస్తు చేసుకుందని, అప్పటి నుంచి పెండింగ్‌లో వున్న దరఖాస్తును 2018లో టీడీపీ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు టీడీపీ హయాంలో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. 


ఈనెల ఏడో తేదీ తెల్లవారుజామున గ్యాస్‌లీక్‌ జరిగిన వెంటనే కంపెనీ వద్దకు చేరుకుని అధికారులకు ఫోన్‌ చేశానని గణబాబు చెప్పారు. ఎనిమిదో తేదీ రాత్రి రెండోసారి గ్యాస్‌లీక్‌ ఉదంతంపై లక్షల మంది ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తలో దిక్కుకు పరుగులు తీస్తుంటే, ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు సరికదా కనీసం హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ ఘటన తరువాత వెంకటాపురం గ్రామంలో సాధారణ పరిస్ధితులు నెలకొనడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. గ్యాస్‌ లీక్‌ ప్రమాద బాధిత గ్రామాలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మృతులు, అస్వస్థతకు గురైన వారికి పరిహారం అందజేయడంతో ప్రభుత్వం బాధ్యత తీరిపోయిందన్నట్టు మంత్రులు మాట్లాడడం దారుణమన్నారు. ఇంతటి విషాదానికి కారణమైన కంపెనీ యాజమాన్య ప్రతనిధులు, బాధ్యులైన అధికారులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పైగా పాలిమర్స్‌ గ్యాస్‌ బాధిత గ్రామమైన వెంకటాపురంలో 144 సెక్షన్‌ అమలు చేస్తూ, ప్రజల్ని తీవ్ర నిర్బంఽధానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని వెంటనే తరలించాలని, బాధిత గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన ఆరోగ్య కార్డులు జారీచేయాలని ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 


టీడీపీ హయాంలో అనుమతులు ఇవ్వలేదు: బండారు

ఎల్‌జీ పాలిమర్స్‌కు టీడీపీ హయాంలో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, కానీ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా గ్యాస్‌ వాసన వస్తున్నదని స్థానికులు చెబుతున్నారన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో ఉత్పత్తిని ఎలా ప్రారంభించారని ఆయన ప్రశ్నించారని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఎలా ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎందుకు పర్యటించలేదన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని తాము డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని తక్షణమే తరలించాలని, గ్యాస్‌ బాధిత గ్రామాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు హెల్త్‌ కార్డులు అందజేయాలని బండారు డిమాండ్‌ చేశారు.  


వెబ్‌నార్‌ ద్వారా మహానాడులో విశాఖ నేతలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడును వెబ్‌నార్‌ ద్వారా నిర్వహించింది. పార్టీ జిల్లా కార్యాలయంలో అర్బన్‌ జిల్లా అఽధ్యక్షుడు వాసుపల్లి గణేశ్‌కుమార్‌, ఇతర నాయకులు హాజరుకాగా, ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రి  బండారు సత్యనారాయణమూర్తి,  తమ కార్యాలయాల నుంచి మహానాడు వెబ్‌నార్‌లో పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, ఎలమంచిలి నుంచి ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, పాడేరులో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, బొర్రా నాగరాజు తదితరులు వెబ్‌నార్‌ ద్వారా పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T09:46:13+05:30 IST