ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-01-09T09:19:24+05:30 IST

విజయవాడలో గతంలో కూల్చేసిన తొమ్మిది ఆలయాలను పునర్నిర్మించేందుకు సీఎం జగన్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన

దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్‌ 


విజయవాడ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): విజయవాడలో గతంలో కూల్చేసిన తొమ్మిది ఆలయాలను పునర్నిర్మించేందుకు సీఎం జగన్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉదయం 11గంటలకు శంకుస్థాపన చేసిన స్థలంలో దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని, ఆ పరిసరాల్లోనే రాహు-కేతు ఆలయం, సీతమ్మవారి పాదాలు, శనైశ్చరాలయం, బొడ్డుబొమ్మ, దుర్గగుడి మెట్ల వద్ద ఆంజనేయ స్వామి ఆలయం, సీతారామలక్ష్మణ సమేత దాసాంజనేయ ఆలయం, కనకదుర్గనగర్‌లో వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల, పోలీసు కంట్రోల్‌ రూం సమీపంలో వీరబాబు ఆలయాలను పునర్నిర్మించనున్నారు.


మరోవైపు రూ.77కోట్లతో ప్రసాదం పోటు భవనం, మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, ఆలయ ప్రాకార మండపాల విస్తరణ, కేశఖండనశాల, అన్నదాన భవనం, తిరుపతి అలిపిరి వద్ద ఉన్న మహాద్వారం తరహాలో కనకదుర్గనగర్‌లో ఎంట్రన్స్‌ ప్లాజా, ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడకుండా అవసరమైన రక్షణ చర్యలు, ఆలయం మొత్తం ఎనర్జీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పనులకు కూడా సీఎం భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవదాయశాఖ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండరును సీఎం ఆవిష్కరించారు. టెంపుల్‌ టూరి జం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

Updated Date - 2021-01-09T09:19:24+05:30 IST