వేలి ముద్రల కోసం అవస్థలు

ABN , First Publish Date - 2021-09-19T05:43:36+05:30 IST

వైస్సార్‌ ఆసరా పఽథకం కోసం మహిళలు పడరాని అగచాట్లు పడుతున్నారు. సాయం అందాలంటే బయోమెట్రిక్‌ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో వేలిముద్ర కోసం స్వయంసహాయక సంఘాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.

వేలి ముద్రల కోసం అవస్థలు
జాతరను తలపిస్తున్న డ్వాక్రా మహిళల సమూహం

ఆసరా రెండో విడత సాయానికి బయోమెట్రిక్‌ తప్పనిసరి 

బారులు తీరిన మహిళలు

పలు చోట్ల అక్రమ వసూళ్లు

కడప(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 18 : వైస్సార్‌ ఆసరా పఽథకం కోసం మహిళలు పడరాని అగచాట్లు పడుతున్నారు. సాయం అందాలంటే బయోమెట్రిక్‌ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో వేలిముద్ర కోసం స్వయంసహాయక సంఘాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఓట్ల కోసం క్యూను తలపించే విధంగా మహిళలు బారులు తీరుతున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లుగా కొందరు వసూళ్లకు తెరలేపారు. జమ్మలమడుగులో ఈ వ్యవహారం బట్టబైలు కావడంతో మహిళలు ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. మరి కొన్ని చోట్ల మాత్రం గుట్టు చప్పుడు కాకుండా కొందరు వసూళ్లు చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఎలాగో మీకు సొమ్ము ఇస్తుంది. మాకు కాస్త ఇస్తే ఏంపోతుందంటూ కొందరు సిబ్బంది మహిళల మొహంమీదే చెబుతుండడంతో ఆసరా సొమ్ము అందదన్న భయంతో కొందరు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తోంది. నాలుగు విడతలుగా మాఫీ సొమ్మును స్వయం సహాయ సంఘాలకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత అందించారు. రెండో విడత సొమ్ము కోసం బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేశారు. జిల్లాలో గ్రామీణ, మున్సిపల్‌, కార్పొరేషనలో 40,215 సంఘాలకు రెండో విడత ఆసరా సొమ్మును రూ.338.24 కోట్లను జమ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 29,895 సంఘాలకు రూ.245.89 కోట్లు, మున్సిపల్‌ కార్పొరేషనలోని 10,320 సంఘాలకు రూ.92.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. అన్ని సంఘాలకు కలుపుకుంటే 4 లక్షల పైచిలుకు మహిళలు ఉంటారు.


కరోనాకు ‘ఆసరా’

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 18: ఎర్రగుంట్లలో ఆసరా.. జాతర శనివారం ఘనంగా జరిగింది. కరోనాను ఏమాత్రం లెక్కచేయకుండా డ్వాక్రా మహిళలు సుమారు నాలుగువేల మంది వేలిముద్రలు వేయించుకునేందుకు స్థానిక జడ్పీహైస్కూల్‌లో చేరారు. ఎర్రగుంట్లలో మెప్మా ఆధ్వర్యంలో సుమారు 610 డ్వాక్రా గ్రూపులున్నాయి. అందులో 455 గ్రూపులకు జగనన్న ఆసరా డబ్బులు మంజూరు అయ్యాయి. ఇందుకు సంబంధించి ఇద్దరు సీసీలున్నారు. ఒకరు సెలవుపై వెళ్లారు. బయోమెట్రిక్‌ నమోదుకు వీరి వేలిముద్రలు అవసరం. దీంతో ఉన్నతాధికారులు గురు, శుక్రవారం రెండు రోజుల పాటు మరో సీసీకి మార్చే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. శనివారం సక్సెస్‌ కావడంతో సుమారు 12 మంది ఆర్పీల పరిధిలోని డ్వాక్రా మహిళలను వేలిముద్రలు వేయించుకునేందుకు రావాలని పిలుపునిచ్చారు. శనివారం చివరి రోజుని తెలపడంతో డ్వాక్రా మహిళలందరూ ఉదయం ఏడు గంటలకే వేలాదిగా ఒకేసారి పాత నగరపంచాయతి కార్యాలయం వద్దకు చేరారు. దీంతో అక్కడ ఇసుకవేస్తే రాలనంత పరిస్థితి తయారు కావడంతో గమనించిన అధికారులు సమీపంలోని జడ్పీహైస్కూల్‌ క్రీడా మైదానంలోకి పంపారు. సుమారు నాలుగువేలకు పైబడి మహిళలు ఆర్పీలపైకి ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు పడుతూ గుంపులు గుంపులుగా చేరి ఒత్తిడి తెచ్చారు. ఒక్కసారిగా అందరికీ వేలిముద్రలు వేసేందుకు తగినన్ని బయోమెట్రిక్‌ మిషనరీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చంటి బిడ్డలతోవచ్చిన వారు, వృద్దులు నిల్చులేక అష్టకష్టాలు పడ్డారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా సచివాలయాలకు చెందిన వలంటీర్లను పిలిపించి వారితో వేలిముద్రలు వేయించే ప్రయత్నం చేశారు. సాయంత్రం వరకు మహిళలు భోజనాలు కూడా చేయకుండా అక్కడే ఉండి వేలిముద్రలు వేయించుకుని వెళ్లారు. ఇలా ఆసరా... జాతర అష్టకష్టాలతో ముగిసింది. కరోనా భయాన్ని పెంచింది.

Updated Date - 2021-09-19T05:43:36+05:30 IST