Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆధార్‌ లింక్‌కోసం రైతుల అవస్థలు

మోత్కూరు, నవంబరు 18: ధాన్యం విక్రయించాలంటే ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంటు మేనేజ్‌మెంటు సిస్టమ్‌ (ఓపీఎంఎ్‌స)లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న నిబంధనతో ఆధార్‌కు మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేయించడానికి రైతులు పరుగులు పెడుతున్నారు. ‘ధాన్యం కొనుగోళ్లలో కొత్త కొర్రీ’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆధార్‌కు మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవాలని సూచించారు. దీంతో గురువారం మోత్కూరులో సుమారు 20 మంది రైతుల ధాన్యం రాశులు కొనుగోలుకు ఎంపికకాగా, అందులో నలుగురు రైతులకు మాత్రమే ఆధార్‌కు మొబైల్‌ నెంబర్‌ లింక్‌ అయ్యి ఉంది. మిగతా వారిని ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్లి లింక్‌ చేయించుకొమ్మని చెప్పారు. పోస్టాఫీసులో ఆధార్‌కు మొబైల్‌ లింకు చేస్తారని చెబుతున్నప్పటికీ మోత్కూరు పోస్టాఫీసులో మాత్రం చేయడంలేదు. బయోమెట్రిక్‌ పనిచేయడం లేదని చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఏపీజీవీబీ, మీసేవా కేంద్రాల్లో లింక్‌ చేస్తున్నారు. లింక్‌ చేసినందుకు ఒక్కో రైతు నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. పలు గ్రామాల రైతులు మోత్కూరుకు రావడానికి బస్సు, ఆటో చార్జీలు రూ.50, ఆధార్‌కు మొబైల్‌ లింక్‌కు రూ.50 కలిపి రూ.100 ఖర్చవుతుండగా, ఒక రోజు సమయమంతా కేటాయించాల్సి వస్తోందన్నారు. ఆధార్‌కు మొబైల్‌ లింక్‌ ప్రక్రియ పూర్తి చేశాక కూడా అప్‌గ్రేడ్‌ కావడానికి ఒకటి రెండు రోజులు పడుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ధాన్యం సేకరణలో కుదించిన దిగుబడి

కొనుగోలుకేంద్రాల్లో గతంలో ఎకరాకు 90 బస్తాలు (36 క్వింటాళ్లు) తీసుకునేవారు. ఇప్పుడు ఎకరాకు 80బస్తాలు (32 క్వింటాళ్లు) మాత్రమే తీసుకోవాలని ఉన్నతాధికారులు గూగుల్‌ మీట్‌లో చెప్పారని ఏపీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఓవైపు దిగుబడులు పెంచాలని చెబుతున్న ప్రభుత్వం సేకరణ సందర్భంగా తగ్గించడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.  

Advertisement
Advertisement