బియ్యం కార్డు ఉంటేనే.. బీమా!

ABN , First Publish Date - 2020-09-12T17:57:46+05:30 IST

పేద కుటుంబాలకు ఆసరాగా ఉండే వైఎస్‌ఆర్‌ బీమా నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది

బియ్యం కార్డు ఉంటేనే.. బీమా!

  • 2.5 ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్టభూమి కంటే ఎక్కువ ఉంటే అనర్హులే..
  • కొత్తకార్డుల కోసం వేలాది దరఖాస్తులు
  • జిల్లాలో 11.69 లక్షల బియ్యం కార్డులు


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: పేద కుటుంబాలకు ఆసరాగా ఉండే వైఎస్‌ఆర్‌ బీమా నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ప్రభుత్వం ఇటీవల నూతనంగా జారీ చేసిన బియ్యం కార్డు ఉంటేనే ఈ బీమా వర్తిస్తుందనే నిబంధన విధించింది. దీంతో కొత్తగా వివాహమైన వారి పరిస్థితి ఏమిటనే దానిపై గందరగోళం నెలకొంది. మరికొందరికి వివిధ కారణాలతో బియ్యం కార్డులు లేవు. సచివాలయాల్లో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే 10రోజుల్లోనే కార్డు మంజూరు చేస్తామని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావటం లేదు. సకాలంలో వైఎస్‌ఆర్‌ బీమా పథకంలో నమోదు కాని పక్షంలో కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మరణించినా లేదా శాశ్వత వికలాంగులుగా మారినా ఆ కుటుంబం పరిస్థితి ఏమిటనే అంశంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కార్మికశాఖ, ఉపాధి కల్పనా నోడల్‌ ఏజెన్సీగా ఉండగా డీఆర్‌డీఏ, మెప్మా ద్వారా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. వలంటీర్ల ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలో బియ్యం కార్డులున్న కుటుంబాలు 11,63,900 కాగా లేనివారు 80 నుంచి 90వేల కుటుంబాలు ఉంటాయని ప్రాథమిక అంచనా.


అర్హుల్ని నిర్ణయించేది ఇలా..

వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా లబ్ధి పొందాలంటే 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు ఉండాలని నిర్దేశించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తిని లబ్ధిదారుడిగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా గుర్తిస్తున్నారు. ఇద్దరి బ్యాంకు ఖాతాల నెంబర్లు, ఐఎఫ్‌ఎస్‌సీ నెంబర్లతో సహా తీసుకుంటున్నారు. వీటిని ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇరువురిలో ఎవరికి బ్యాంకు ఖాతాలు లేకున్నా జన్‌ధన్‌ ఖాతాలు తెరిచి ఆ వివరాలను నమోదు చేస్తున్నారు.


అనర్హత నిర్ణయించేది ఇలా..

ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించేవారు, విద్యార్థులు, బిక్షాటన చేసేవారు. మతిస్థిమితం లేనివారు, పీఎఫ్‌, ఈసీఎఫ్‌ చెల్లించేవారు వైఎస్‌ఆర్‌ బీమాకు అనర్హులు. అలాగే రెండున్నర ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్టభూమి కంటే అధికంగా ఉన్నా అనర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. మూడెకరాల మాగాణి, పదెకరాల మెట్టభూమి ఉన్నవారికి కూడా పథకం వర్తింపజేయాలనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. 18 నుంచి 50 ఏళ్ల వయసున్నవారిది సహజ మరణమైతే రూ. 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5లక్షల బీమా సొమ్ము లబ్ధిదారుని కుటుంబానికి అందజేస్తారు. 51 నుంచి 70ఏళ్లలోపు వారు సహజంగా మరణిస్తే బీమా సొమ్ము రాదు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.3లక్షలు ఆ కుటుంబానికి అందజేస్తారు.


నిబంధనలకు అనుగుణంగా సర్వే: డీఆర్‌డీఏ పీడీ

ప్రభుత్వ సూచనల మేరకు ప్రస్తుతం జిల్లాలో సర్వే జరుగుతోంది. బియ్యంకార్డు లేనివారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. సచివాలయాల్లో బియ్యంకారు ్డకోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వైఎస్‌ఆర్‌ బీమా అమలులో అర్హులందరికీ న్యాయం జరుగుతుంది.

Updated Date - 2020-09-12T17:57:46+05:30 IST