Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధ్వాన రోడ్లతో అవస్థలు

తుర్కపల్లి-వెంకటాపురం మధ్యలో వాహనాలు వెళ్లే సమయంలో రోడ్డంతా వ్యాపిస్తున్న దుమ్మూధూళి

 నరకప్రాయంగా మారిన తుర్కపల్లి టు యాదగిరిగుట్ట రహదారి 

 దుమ్మూధూళితో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

 నాలుగేళ్లుగా అసంపూర్తిగా మర్కుక్‌ టు గోపాల్‌పురం రోడ్డు పనులు

తుర్కపల్లి, నవంబరు 29:  ఒకటి కాదు రెండు కాదు.. ఏళ్ల తరబడి అధ్వాన రోడ్లతో అవస్థలు పడుతూనే ఉన్నారు. రోడ్డుపైకి రావాలంటేనే దుమ్ముదూళితో జంకుతున్నారు. నిత్యం వచ్చిపోయే వాహనాలతో ఇంట్లో నుంచి అడుగుబయట పెట్టాలంటేనే తుర్కపల్లి మండల వాసులు జంకుతున్నారు. యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదగిరిగుట్ట చుట్టూ రోడ్ల విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా మండలంలోని రోడ్ల విస్తరణ, మరమ్మతు పనులకోసం రూ.75కోట్లను మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా తుర్కపల్లి నుంచి యాదాద్రి వరకు సుమారు 11కి.మీ దూరం రోడ్డును నాలుగు లేన్లుగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు పనులు మొదలుపెట్టి కంకర వేశారు. అయితే పలు కారణాలతో రోడ్డు నిర్మాణ పనులు కొన్ని రోజులుగా నిలిపోయాయి. తుర్కపల్లి-వెంకటాపూర్‌, వెంకటాపూర్‌-దత్తాయపల్లి, దత్తాయపల్లి-మల్లాపూర్‌ గ్రామాల మధ్య అక్కడక్కడ కొంతదూరం ఓవైపు బీటీ రోడ్డువేసి, మరోవైపు మట్టి రోడ్డు వేశారు. మరి కొంతదూరంలో ఓ వైపు కంకర వేశారు, కానీ బీటీ రోడ్డు వేయలేదు. ఒక వరుస మట్టి రోడ్డు ఉండడంతో వాహనాలు వెళ్తున్నప్పుడు రోడ్డుపై నుంచి దుమ్మూ ధూళి వెదజల్లడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డువెంట ఇళ్లల్లోకి సైతం దుమ్ము చేరి, ఆయా గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ రహదారిపై ఉదయం, సాయంత్రం ట్యాంకర్లతో నీటిని పోసి దుమ్ము రాకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 


అసంపూర్తిగా బీటీ రోడ్డు పనులు

బీటీ రోడ్డు నిర్మాణ పనులు నాలుగేళ్ల నుంచి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ మండలం దామరకుంట, తుర్కపల్లి మండలం గోపాల్‌పురం గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలనీ ప్రభుత్వం యోచించింది. ఇందులో భాగంగా 2017 నవంబరు 28న యస్‌డీఎఫ్‌(స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) కింద సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు 3.375 కి.మీ దూరం బీటీ రోడ్డు పనులు చేపట్టడానికి రూ.3.10కోట్లు మంజూరు చేశారు. ఈ పనులను అటు దామరకుంట నుంచి కొంత దూరం ఇటు గోపాల్‌పురం నుంచి కొంత దూరం సుమారు 3కి.మీవరకు పూర్తిచేశారు. ఈ రెండు గ్రామాల మధ్య అటవీశాఖ భూమి ఉండడంతో అటవీ అధికారులు ఆభూమి నుంచి రోడ్డు వేయవద్దని పేర్కొంటూ పనులను అడ్డుకున్నారు. దీంతో కేవలం అర కిలోమీటర్‌ దూరం రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మండలంలోని గోపాల్‌పురం గ్రామస్థులు దామరకుంటకు వెళ్లడానికి, కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామాలకు 7 కి..మీ దూరమే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. గోపాల్‌పురం గ్రామం నుంచి దామరకుంట, కాశిరెడ్డిపల్లి, ఎర్రవెల్లి, భావానందపురం, మర్కుక్‌ తదితర గ్రామాలకు వెళ్లాలంటే వయా కొండాపూర్‌ మీదుగా 12కిమీ దూరం ఉంటుంది. అదేవిధంగా కర్కపట్ల మీదుగా అయితే 13 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి ప్రభుత్వ భూమి అని, రెవెన్యూ అధికారులు పేర్కొంటుండగా, అటవీ గెజిట్‌ ప్రకారం ఆ భూమి అటవీశాఖ పరిధిలోకి వస్తుందని ఆశాఖ అధికారులు పేర్కొంటూ హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సమస్యతో  నాలుగేళ్లుగా పనులు నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కలెక్టర్‌, అటవీశాఖ అధికారులకు  ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం లభించలేదు. 

పూలపల్లి వెంకటేశ్‌

అధికారుల దృష్టికి ఎన్నో సార్లు తీసుకువెళ్లాం : పూలపల్లి వెంకటేశ్‌, గోపాల్‌పురం  

సీఎం కేసీఆర్‌ చొరవతోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు మధ్యలో అటవీశాఖ భూమిరావడంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. అటవీశాఖ అధికారులతో మాట్లాడి రోడ్డు పనులకు క్లియరెన్స్‌ ఇప్పించాలని సిద్ధిపేట ఎంపీకి, జిల్లా అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు.   

Advertisement
Advertisement