సంశయాలు–భయాలు

ABN , First Publish Date - 2020-04-21T11:12:53+05:30 IST

కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేసి, వ్యాప్తి వేగాన్ని బాగా నియంత్రించాలన్న లక్ష్యంతో తొలి, మలి విడత లాక్‌డౌన్‌ అమలు జరుగుతోంది. దీని కారణంగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందనీ, లాక్‌డౌన్‌ కనుక లేకుంటే కేసులు 8లక్షలు ...

సంశయాలు–భయాలు

కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేసి, వ్యాప్తి వేగాన్ని బాగా నియంత్రించాలన్న లక్ష్యంతో తొలి, మలి విడత లాక్‌డౌన్‌ అమలు జరుగుతోంది. దీని కారణంగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందనీ, లాక్‌డౌన్‌ కనుక లేకుంటే కేసులు 8లక్షలు దాటిపోయేవని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో లెక్కలు కట్టింది కూడా. ఈనెల 14న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాక్‌డౌన్‌ కొనసాగింపును ప్రకటిస్తూనే రాబోయే వారం రోజులు అత్యంత కీలకమైనవనీ, ఆ తరువాత కొన్ని సడలింపులకు అవకాశం ఉంటుందనీ ప్రకటించారు. పరిమితులతో కూడిన ఆ మినహాయింపులు సోమవారం నుంచి అమలులోకి వచ్చినప్పటికీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను వీసమెత్తు సడలించేందుకు సిద్ధపడలేదు. ఏ మాత్రం వెసులుబాటు ఇచ్చినా, కరోనా మహమ్మారిపై ఇంతకాలం అత్యంత కట్టుదిట్టంగా సాగించిన పోరాటమంతా నిష్ఫలమైపోతుందని వాటి భావన. 


ప్రధాని చెప్పిన ‘జాన్‌ భీ జహాన్‌ భీ’ సూత్రం ఎప్పటికైనా అమలు కావాల్సిందే. ఇప్పటికే దేశంలో నలభై రోజుల లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్నది. ఆర్థికమాంద్యంలో ఉన్న దేశాన్ని కరోనా వచ్చి మరింత కుదిపేసిన కారణంగా ఆర్థిక కార్యకలాపాల ఆరంభం అవసరమే. మిగతా దేశాలతో పోల్చితే మనం ఎంతోముందుచూపుతో వ్యవహరించి కరోనాను కట్టడి చేసుకున్నామన్న ప్రధాని వ్యాఖ్యల్లో నిజం ఉన్నది. అమెరికా సహా అనేక అగ్రరాజ్యాలు కరోనాపై పోరులో చావుదెబ్బతిని, వేలాది మరణాలు నమోదు చేస్తున్న దశలో, అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఇక, లాక్‌డౌన్‌ ద్వారా వ్యాప్తినైతే నిరోధించగలిగాము కానీ, ముప్పు తీవ్రతను పట్టిచ్చే పరీక్షల విషయంలో మనం ఇంతకాలం అనేక దేశాలకంటే వెనుకబడే ఉన్నాం. మొన్న ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా దేశంలో పదహారువందల కేసులు నమోదైనాయి. ఇటీవలే విదేశాలనుంచి టెస్టుకిట్లు రావడంతో పెంచిన పరీక్షల ఫలితం ఇది. పరీక్షల సంఖ్యను మరింత హెచ్చించి, వాటిని వేగవంతంగా జరపాల్సిన అవసరాన్ని ఇది తెలియచెబుతున్నది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతానికి పదిహేడువేల కొవిడ్‌ కేసులున్న దేశంలో ఎటువంటి సడలింపులూ లేని లాక్‌డౌన్‌ కొనసాగాలన్న కొన్ని రాష్ట్రాల నిశ్చితా భిప్రాయానికి ప్రాధాన్యం ఉన్నది. 


ప్రాణనష్టాన్ని నివారించాలనీ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పాలకులు కచ్చితంగా తీర్మానించుకోవాల్సిన సందర్భం ఇది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మే 7వతేదీ వరకూ లాక్‌డౌన్‌ ఇదే స్థాయిలో, మరింత పటిష్ఠంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. పరిస్థితులను బట్టి మే నెలాఖరువరకూ కొనసాగించే అవకాశాలున్నాయని కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంకేతాలు ఇస్తున్నారు. కరోనాపై తనది రాజీలేని పోరాటమంటున్నారు. పేదలు, వలసకూలీల విషయంలోనూ ఆయన వైఖరి ప్రశంసనీయమైనదే. ఈ దిగ్బంధంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదన్న ఆశయం క్షేత్రస్థాయిలో మరింత సక్రమంగా అమలయ్యేట్టు చూడాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత ఒక పక్క హెచ్చుతూ, ఏమాత్రం తగ్గుముఖం పట్టని స్థితిలో పాక్షిక సడలింపులకు ప్రభుత్వం సిద్ధపడటం విచిత్రం. ఆదినుంచీ ఈ మహమ్మారి విషయంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీరు భిన్నంగానే ఉంటున్నది. కరోనాను తేలికగా తీసుకోవడమే కాక, దానిని పక్కనబెట్టి తన మిగతా లక్ష్యాలు నెరవేర్చుకొనే ప్రయత్నంలో ఉన్నారాయన. పాక్షిక సడలింపుల కారణంగా భవిష్యత్తులో వ్యాప్తి అధికమై, కేసులు మరింత హెచ్చితే అందరూ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో పాటు ప్రభుత్వానికి  తీవ్ర అప్రదిష్ట వస్తుంది. మినహాయింపుల విషయంలో ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే బాగుండేది. ఇప్పుడు కేరళ ప్రభుత్వం సైతం అంతకుముందు ప్రకటించిన చాలా మినహాయింపులను రద్దుచేసుకుంది. కేంద్రం కూడా మినహాయింపుల పేరిట లాక్‌డౌన్‌ సడలింపుకోసం తొందరపడుతున్నా, రాష్ట్రాల తీరును బట్టి అదీ తన వైఖరిని మార్చుకుంటున్న విషయం తెలుస్తూనే ఉన్నది. విమానయానం వంటి విషయాల్లో అది కొన్ని సవరణలు కూడా చేసుకుంది. ఇప్పటికైనా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తప్పటడుగులు సరిదిద్దుకోవాలి. కనీసం, రెడ్‌జోన్లు, కంటైన్మెంట్‌ ఏరియాల్లోనైనా నిబంధనలు కఠినంగా అమలయ్యేట్టు చూడాల్సిన అవసరం ఉన్నది.

Updated Date - 2020-04-21T11:12:53+05:30 IST